నమ్మకం:-- యామిజాల జగదీశ్
 రాత్రి అయింది. ఇంటి యజమాని పనులన్నీ కానిచ్చుకుని ఇంటి గేటుకి తాళం వేసి లోపలికొచ్చాడు. వాకిలి తలుపూ వేసేసి లైట్లు ఆపి పడుకుండిపోయాడు. 
అప్పుడు తెరిచే ఉన్న కిటికీ తలుపు పక్కనే మూసి ఉన్న వాకిలి తలుపుతో మాటలు కలిపింది. 
"దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నా" అంది కిటికీ తలుపు.
"ఎందుకూ?" అంది వాకిలి తలుపు.
"ఏమీలేదు. రాత్రీ పగలూ ఏదైనా కావచ్చు. నన్ను తెరిచే ఉంచుతున్నాడు ఈ మనిషి. మనిషికి గాలి తప్పనిసరిచేసాడు దేవుడు. అందుకేగా నిన్ను మూసేసినా నా కిటికీ తలుపుని తెరిచే ఉంచాడు. అందుకే దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను" అంది కిటికీ తలుపు. 
"ఓహో...అందుకా....బాగానే ఉంది. కానీ నాకీ మనిషిమీద కోపమూ. అసహ్యమూ..." అంది వాకిలి తలుపు.
"ఎందుకూ?" అని అడిగింది కిటికీ తలుపు.
అప్పుడు వాకిలి తలుపు "కాకపోతేమరేమిటీ? సాటి మనిషి మీద ఇతనికి నమ్మకం లేదు కానీ ఓ చెక్కనైన నామీదెంత నమ్మకం ఇతనికి. ఛీ ఛీ తోటివారిపై నమ్మకం లేని ఇతనొక మనిషేనా?" అంది. 

కామెంట్‌లు