పచ్చీస్ (మణిపూసలు ):-ఎం. వి. ఉమాదేవి
జీవిత పోరాటంగా 
ఆశల ఆరాటంగా 
కాలక్షేపం ఆటను 
ఆడుదురు పచ్చీసుగా 

ఆట మహా ఉత్సాహము 
గుమికూడునే సమూహము 
ఆడేది నలుగురైనా 
కలుగును సమరోత్సాహము 

అదృష్టపు ఆ గవ్వలూ 
వేయుటలోను ఒడుపులూ 
నాలుగు రెక్కలు గడులను 
దారంతో అల్లికలూ 

మేధస్సుకు సవాలుగా 
అదృష్టముకు జవాబుగా 
పావులు జరిపే విధమిది 
పదుగురికి ఆసక్తిగా 

ఓపికగా ఆడుతారు 
ఒక్కో కాయ తీస్తారు 
చంపిన కాయలు ఓడగ
విజయమునే పొందుతారు 

అలవాటైన వ్యసనము 
ఋజువే కదా భారతము 
రాజ్యాధికారం పోగ
జరిగిన మహా సంగరము 

పల్లె జనుల ప్రీతి కరము 
పాత తరము అపురూపము 
అందమైన బాల్య స్మృతి 
మనసులోన నిధి రూపము

కామెంట్‌లు