గూగుల్ తల్లి - లక్ష్మీకాంతం పిన్ని.
సెలవలకి ఇంటికి వచ్చిన అక్కయ్యల పిల్లల్ని పిన్ని హోదాలో ఆడించి , పాడించి ఓస్ పిల్లలని పెంచటం అంటే ఇంతేనా ?
వక్క కొరికినంత వీజీ అనుకున్నా.కానే కాదని తరువాత తెలిసింది.
పిల్లలు పుట్టి వాళ్ళు ప్రశ్నలు వేయటం మొదలు పెట్టాక, వాళ్ళకి సమాధానం చెప్పటంకోసం నేను మళ్ళీ చదువుకోవాల్సి వచ్చింది.
మా గోపాల్ అయితే మరీనూ స్కూటర్ ముందు నిలుచుని ఆకాశంలోకి చూసి చందమామ మనతో ఎందుకు వస్తుంది అని అడిగే వాడు.
మా మేఘనకి అన్నీ సంబంధాల గోలే. ఆ మేకా వాళ్ళ అమ్మమ్మ ఎవరు? పిల్లి పిల్లల్ని ఎక్కడికి తీసుకెళుతుంది?
ఇలా ఉండేవి తన ప్రశ్నలు.
ఇక ఇద్దరికీ చదువులో వచ్చే సందేహాలయితే చెప్పనే ఆఖర్లేదు.ఇప్పట్లా గూగుల్ చేసుకో అనటానికి లేదు కదా.
ఎవరయినా గట్టిగా మాట్లాడుకుంటే మా అమ్మాయికి ఎంత భయం అంటే, మనుషులు ఎందుకు గొడవ పడతారు?
అనుకుని దిగులు పడుతుంది. ఇప్పటికి కూడా !
నా చిన్నప్పటి విషయాల మీద వాళ్ళకి తెగ ఆసక్తి ఉండేది.
పిల్లలు నా చిన్నప్పటి నుంచి అడిగితే నేను మా అమ్మ చిన్నప్పటి నుంచీ మొదలుపెడతా.
మా అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండేదో ?
అల్లరి చేసేదా ? లేదా?
అన్న సందేహం నాకు కూడా వచ్చింది నా పదేళ్ల వయసులో.
అమ్మంటే భయం వల్ల అమ్మమ్మ దగ్గర చేరి అడుగుతుండే దాన్ని అమ్మమ్మా అమ్మ చిన్నప్పుడు బడికి సరిగ్గా వెళ్ళేదా?
అసలు అల్లరే చేసేది కాదా ? అంటూ .
మీ అమ్మ చాలా బుద్ధిమంతురాలు చక్కగా బడికి వెళ్ళేది. నా వెనకాలే తిరుగుతూ చిన్న చిన్న వస్తువులు అవీ చేతికి అందించేది.కుదురుగా ఉండేది .వేసిన జడలు వేసినట్లే మర్నాటి వరకూ అలాగే ఉండేవి. బట్టలు మాపుకునేది కాదు అంటూ మా అమ్మమ్మ మా అమ్మ గుణగాన కీర్తన చేసింది.ఎన్ని మార్లు అడిగినా ఇదే సమాధానం అమ్మమ్మది.
ఈ డిటెక్టివ్ రాణి బుర్రకి పిల్లలు అల్లరి చేయరు అన్న విషయం ఒప్పుకో బుద్ధి కాలేదు.అమ్మమ్మ అబద్దం చెపుతోందేమో అని ఒక పక్క, నిజమే అయితే అని నిరాశ ఒక పక్క.
ఈ సందేహం తీరే లింక్ దొరకక విచారిస్తున్న సమయంలో నా పాలిట గూగుల్ తల్లిలా మా అమ్మ చిన్నప్పుడు అమ్మమ్మా వాళ్ళు ఉన్న ఊరు నుంచి అమ్మ చిన్నప్పటి స్నేహితురాలు లక్ష్మీకాంతం పిన్ని వచ్చింది.
ఇన్ని రోజులు యామైపోయిందో కానీ ఆవిడ వస్తూనే రాణెమ్మా అంటూ నన్ను ఎత్తుకుంది.అయిదు సంవత్సరాల వయసు తరువాత మళ్ళీ ఎవరూ అలా ఎత్తుకుని ముద్దు చేసింది లేదు.దొరికిందే ఛాన్స్ అని కాసేపు గారాలు పోయి,మర్చిపోయిన ముద్దు మాటలు అన్నీ మాట్లాడాను.
పిన్ని ఉన్నంత సేపూ నన్ను వదలకుండా వళ్ళో కూర్చో బెట్టుకుని అమ్మా వాళ్ళతో కబుర్లు చెపుతూ ఉంది.
మధ్య మధ్యలో అమ్మ చేసిన గారం చాల్లే కాంతం ఇక దింపు అంటూ పిన్నిని హెచ్చరిస్తూ ఉంది. అమ్మ అలా అన్నప్పుడల్లా పిన్ని నా బుగ్గలు పుణికి ముద్దుపెట్టుకుని ఉండనీలే రాధమ్మా అని మళ్ళీ కబుర్లలోకి వెళ్ళేది.
నీకు అయిదుగురు కొడుకులు,ఓ ఆడపిల్ల ఉన్నా ఈ పిల్లల పిచ్చి తగ్గలేదే లక్ష్మీకాంతం అంటూ అమ్మమ్మ .
మాకు ఇట్లాటి పిల్లలు ఎందుకు ఉంటారు ?
చిట్టెమ్మ గారు అంటూ పిన్ని నన్ను మళ్లీ గారబం చేయటం.పదేళ్ల వయసుకే వయసు తక్కువ చేసుకోవడంలో కిక్కు బాగా తలకెక్కింది ఆరోజు నాకు.
నీ పిల్లలు బుద్దిమంతులు ఇది ఉట్టి అల్లరిది అంది అమ్మ నవ్వుతో.అదిగో అప్పుడు మా పిన్ని ఓ నవ్వు నవ్వి నీ కంటేనా రాధమ్మా?
అని దేచవరం గ్రామంలో అమ్మా,పిన్నీ చిన్నప్పుడు ఇసుకలో అక్షరాలు దిద్దుకున్న దగ్గరి నుంచి,తోటల్లో ,దొడ్లలో దొంగతనంగా కోసిన కాయల దగ్గరి దాకా మొత్తం వాళ్ళ అల్లరి చిట్టా చెప్పేసింది.
పిన్ని అమ్మ కన్నా ఓ ఏడాది చిన్నట. ఊళ్ళో ఇద్దరూ మోతుబరి రైతుల పిల్లలలు కదా రాణుల్లా పెరిగారట.పిన్నీ వాళ్ళ నాన్న మద్రాసు నుంచి సబ్బులు,పౌడర్లు,రిబ్బన్లు అన్నీ తెచ్చేవాడట .
జీతగాళ్ళు తొట్లలో నీళ్ళు పోస్తే సబ్బు తొట్లో వేసేసి ఎలా తొట్టి స్నానాలు చేసిందీ, పంతులు గారి దోవలో పన్నేరు కాయలు పోసింది.అమ్మా,పిన్నీ కలిసి చిన్నప్పుడు చేసిన అల్లారంతా చెప్పింది ఆ రోజు లక్ష్మీకాంతం పిన్ని.
నా సిద్దాంతం కరెస్టు పిల్లలన్నాక అల్లరి చేయకుండా ఎలా?
కాబట్టి మనమూ అల్లరి చేయటానికి అర్హత కలిగి ఉన్నాము అని కూడా అర్ధం అయిపోయింది.
మా అమ్మ చిన్నప్పుడు చిలిపిగా ,అల్లరిగా ఉండేది అన్న విషయం వినటానికి భలే అనిపించింది.పెద్దయ్యాక నా పిల్లలకి కూడా నా ఘన చరిత్ర వినిపించాలనే ఆకాంక్షకు బీజం అక్కడ ఉన్నదన్నమాట.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి