గదేందో గని
సిన్నప్పుడు
ఏమన్న తినేటియి,బుక్కేటియి
కొనుక్కున్నప్పటి కన్న
ఎవరన్న ఇచ్చినా,
దొంగ తనంగ దొబ్బినా
బగ్గ తియ్యగ , కమ్మగ ఉంటాయెందుకో?
మల్లారం నుంచి
అన్మశ్పట బడిల
సదువుకున్నప్పుడు
బడి పోరగాండ్లం
బడికి సద్ది తీసుకొని
పోయేటోల్లం.
అన్నం బెల్ అయినంక
మా తోటి సదువుకుంటున్న
తాహెర్ పాష ఇంటికి వోయి
ఆళ్ళ ఇంటెనుక
జామ సెట్ల నీడల కూసోని
సద్ది తినేటోల్లం.
బువ్వ తిన్నంక
ఆ ఆడ కట్టులనే ఉన్న
శాలోళ్ళ ఇంటికి పోయి
జామకాయలు కొనుక్కొని
తినేటోల్లం.
ఒకడు సెట్టు ఎక్కితే
ఇంకొకడు బయట బజార్ల ఉండేటోడు.
జామ సెట్టు ఎక్కినోడు
జామ పండ్లను తినుకుంటనే
మూడు, నాలుగు జామకాయలను తెంపి
బజాట్ల పడేసేటోడు,
కొన్ని తన లాగు జేబుల దాసుకునేటోడు.
రెండో, మూడో సేతుల వట్టుకొని సెట్టు మీది నుంచి దిగి, ఇంటోల్ల దగ్గెరికి వోయి
సేతులున్నవి సూపిచ్చి
ఇవి ఎంతకిత్తరు అని అడిగెటోడు.
ఆల్లు చారానకోటి అని సెప్పెటోల్లు.
ఆటానే ఉన్నయి.మూడు ఇవ్వుర్రి అని బతిమిలాడితే
సరే అని ఆటానకు మూడు జామ కాయలిచ్చేటోల్లు.
మెల్లగ బయటికచ్చి,
ఇద్దరు నవ్వుకుంట
జామ కాయల్ని
కొరుక్క తినుకుంట
మల్ల బల్లెకు పోయేటోల్లు.
గట్ల సేసేటోల్లల్ల
నేను గుడ ఉన్ననుల్లా!
గట్ల సేసుడు మోసమేమీ గాదుల్లా!
ఎందుకంటరా?
గా శాలోల్లు సెట్టు నిండ
ఇరగ కాసిన జామ పండ్లను
అన్ని తినరు, ఏరే టోల్లకు అమ్ముకోరు.
జామ పండ్లు గాలికి ఉట్టిగనే కింద రాలి పోతుంటయి.
ఉత్తగ మంట్లె వోతె ఏమత్తదని గట్ల సేసెటోల్లం.
సిన్నప్పటి కోతి పనులు
యాది కత్తె
మల్ల సిన్న పొరగాండ్లమైతె
ఎంత మంచి గుండు అని అనిపిత్తది. సిన్న తనమే బంగారమసొంటి కాలం.
ఔ మల్ల!
ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం-871 297 1999
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి