ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం 871 297 1999
ఎనుకట 
ఊళ్ళల్ల
సదువు,సాత్రం నేర్వనోల్లే ఎక్కువుండేటోల్లు.
అయిన గని
ఆల్లకు తెలిసిన కాడికి 
నియ్యతి తప్పకుంట,
మోసం జెయ్యకుంట
మంచిగనే బతికిండ్రు.
కట్టం,సుకం ఏదచ్చినా
అందరూ కలిసి మెలిసి ఉన్నరు.
ఎవ్వరి కుల కశ్పి ఆల్లు జేసుకుంట పెళ్ళాం పిల్లల్ని
కలిగిన కాడికి మంచిగనే సాదుకున్నరు.

మా ఊల్లే
కాపోల్లు ఎవుసం జేసుడు,
శాలోల్లు బట్టలు నేసుడు,
అడ్లోల్లు కట్టె పని,
మంగలోల్లు సవురం దీసుడు,
సాకలోల్లు బట్టలుతుకుడు,
గౌండ్లోల్లు తాళ్ళు, ఈదులు గీసుడు, గాండ్లోల్లు నూనెలు గానుగు వట్టుడు, మ్యాదరోల్లు కంక బొంగులతో సాటలు,
గుల్లలు,అంచెలు, తడుకలు,
గుమ్ములు జేసుడు, మేరోల్లు బట్టల్ కుట్టుడు, కమ్మరోల్లు కొడండ్లు,గొడ్డండ్లు,కర్రులు, జేసుడు,అవుసులోల్లు బంగారు,ఎండి నగలు జేసుడు, ఒడ్డోల్లు బండలు, రౌతులు కొట్టి అమ్ముకునుడు,
ఎరుకలోల్లు పందుల కాసుడు,
కోసి అమ్ముడు,తాటిమట్టలతో సీపుర్లు,అంచెలు,గుల్లలు, పసులకు దొంగ గడ్డి మెయ్యకుంట మూతికి గట్టే
బుట్లు జేసుడు,
తెనుగొల్లు పండ్లు అమ్ముడు,
గూల్లోల్లు సెర్వుల సాపలు వట్టి అమ్ముడు,
మాదిగొల్లు సెప్పుల్ కుట్టుడు,
కోమట్లు దుకాణం బెట్టుడు,
బాకీలు ఇచ్చుడు, అడ్లు,మక్కలు,జొన్నలు, పెసల్లు,పత్తి,మిరుప కాయలు కొని అమ్ముడు,
గిట్ల అందరికీ 
కుల కశ్పి ఉంది గని
గదేందో గని మాలోల్లకైతే
ఏ కశ్పి లేదుల్లా!
ఎవ్వరు ఏం పని జేసిన గని
ఊరోల్లు ఏ కొలుపు, కొట్లాటలు లేకుంట 
అందరూ కలిసి మెలిసి ఉంటరు. 
ఊరంటే మా ఊరి లెక్క ఉండాలె.
ఏ కులమైతే ఏందుల్లా?
మనదంతా మానవ కులమే!
అయినా..
గా ఎనుకట
సేసే పనులను జూసి
కులం అచ్చింది గని
కులాన్ని బట్టి  కశ్పి రాలే.
మొదట్ల గీ కులాలు లేకుండే.
ఔ మల్ల!


కామెంట్‌లు