నందయ్య కట్టెలు కొట్టుకుని బతుకుతాడు. వారానికి ఒక సారి అడవికి వెళ్ళి ఎండిన చెట్లను మాత్రమే కొడతాడు. అడవికి వెళ్ళిన ప్రతిసారి ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చుని తెచ్చుకున్న సద్ది మూట తిండి తినేవాడు.తిన్నాక నీళ్ళు తాగి చేతులు ఆ చెట్టు మొదలులో కడిగేవాడు.ఆ నీళ్ళు పడినప్పుడల్లా చెట్టుకి ఆనందం కలిగేది! ఎందుకంటే వానాకాలంలో పడే వాన నీరే దానికి తెలుసు,మరి కాలం కాని కాలంలో కొద్ది నీరు నందయ్య వలన లభిస్తోంది, అదీ ఆ చెట్టు ఆనందం.
ఒక రోజు ఆ చెట్టు ఇలా అనుకుంది"ఇతడు నాకు కొద్దిగా అయినా జలం ఇస్తున్నాడు.అది నాకు ఎంతో తృప్తినిస్తున్నది...మరి ఇతనికి ఏదో ఒక విధంగా సహాయం చెయ్యాలి"
తన పెద్ద వేళ్ళ క్రింద ఉన్న బంగారుతో నిండిఉన్న పెట్టె దానికి గుర్తుకు వచ్చింది.కొన్ని వందల సంవత్సరాల క్రితం కొందరు దొంగలు బంగారంతో నింపిన పెట్టెను అక్కడ పాతి పెట్టారు.కాలక్రమేణా తను పెరిగి పోయి తన వేళ్ళు ఆ పెట్టె మీద ఎదిగి పోయాయి!ఆ బంగారు పెట్టెను అతనికి ఇవ్వాలనుకొంది!వెంటనే మనుష్య భాషలో"చూడు కట్టెలు కొట్టే చిన్నవాడా,నీవు రోజూ నాకు కొద్ది నీళ్ళు ఇస్తున్నావు,నీ నీళ్ళు నేను పీల్చుకుంటే నాకు ఎంతో తృప్తి, అందుకే నేను నీకు మేలు చేయదలిచాను"అని చెప్పింది చెట్టు.
నందయ్య చెట్టు పలుకలకు ఆశ్చర్య పోయి,భయపడ్డాడు కూడా!
"భయపడకు,నేను చెట్టును మాట్లాడుతున్నాను"అని చెప్పి అతనిలో ధైర్యం నింపింది!
"ఏదో చెయ్యి కడిగాను,అంతేగానీ నీకు తృప్తిగా నీళ్ళు ఇవ్వలేక పోయాను" చెప్పాడు నందయ్య.
నేను అల్ప సంతోషిని,నీ నీళ్ళు నాకు తృప్తి నిచ్చాయి కనుక,నాకుడివైపున ఉన్న వేళ్ళను నరకు,వాటికింద ఒక పెట్టె ఉంది అందులో బంగారం ఉంది,దానితో నీ జీవితం ఆనందమయం చేసుకో"అన్నది చెట్టు.
నందయ్య చెట్టుకి నమస్కారం పెట్టి, గొడ్డలితో కుడివైపు వేళ్ళను నరికాడు,వాటికింద ఒక అడుగు పొడవు వెడల్పు కలిగిన పెట్టె కన బడింది.దానిని తీసి చూస్తే నిండా బంగారు నగలు! దానితో నందయ్య దరిద్రం తీరి పోయింది.చెట్లు కొట్టడం మాని వేశాడు. ఒక పెద్ద తోట పెంచి అడవిలో తనకు సంపద నిచ్చిన చెట్టు విత్తనాలు తెచ్చి పాతాడు.
చూశారా,నందయ్య తనకు తెలియకుండా చేసిన పనికి అల్ప సంతోషి అయిన చెట్టు అపార సంపద ఇచ్చింది!
వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి