రఘు తెలివిగల వాడు. స్కూల్లో , చదువులో, ఆటల్లో ఫస్ట్ వచ్చేవాడు.తానే అందరికన్నా మిన్న అని వాడికి గర్వం ఎక్కువ. అలా వాడికి తెలియకుండానే తక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళని ,ఆటల్లో ఓడిపోయిన వాళ్ళని గురించి చులకనగా మాట్లాడేవాడు! అలా ఇతరులను చులకనగా చూడకూడదని,కృషి చేసి వాళ్ళు కూడా ఎప్పటికైనా చదువులో, ఆటల్లో రాణించవచ్చునని చెప్పాడు రఘు తండ్రి నారాయణ. అయినా రఘు తన ధోరణి మార్చుకోలేదు.
ఇలా ఉండగా వల్ల స్కూల్ లో ధీరజ్ అనే అబ్బాయి కొత్తగా చేరాడు.
ధీరజ్ కూడా తెలివిగల వాడే. చదువులోనే కాకుండా క్విజ్, పెయింటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరచి అనేకబహుమతులు పొందేవాడు! రఘుకి క్విజ్ పోటీల్లో బహుమతి వచ్చేది కాదు. పెయింటింగ్ వెయ్యడం రఘుకి రాదు!
ఒకసారి ధీరజ్ వేసిన పది మంచి నీటి రంగుల చిత్రాలు స్కూల్ లో ప్రదర్శించి,తోటి విద్యార్థులు,టీచర్ల అభినందనలు అందుకున్నాడు.
ధీరజ్ ప్రతిభ చూసిన రఘులో ధీరజ్ మీద తెలియని ద్వేషం పెరిగిపోయి ఇంట్లో అందరికి దిగులుగా కనబడసాగాడు.
రఘు పరిస్థితి గమనించిన రఘు తండ్రి నారాయణ మెల్లగా రఘు ధీరజ్ మీద పెంచుకున్న ద్వేషాన్ని తెలుసుకుని రఘుని దగ్గరకు తీసుకొని ఈ విధంగా చెప్పాడు.
" చూడు రఘు, ఎదుటి వాడు ఎదిగి పోతున్నాడని మనం ఎప్పుడూ కుళ్లి పోకూడదు. మనం కూడా తగిన కృషి చేస్తే అతడు సాధించినది మనం సాధించవచ్చు! అందుకే పెద్దలు 'కృషి తో నాస్తి దుర్భిక్షం' అన్నారు. అంటే కృషి చేస్తే మనకు లేమి ఉండదు. అది డబ్బు అయినా, కళ, చదువు అయినా, అందుకే నేను డ్రాయింగ్ మాస్టర్ పాపయ్య గారి వద్ద నిన్ను చేరుస్తాను. ఆయన దగ్గర శ్రద్ధగా డ్రాయింగ్ నేర్చుకో. బాగా ప్రాక్టీస్ చేస్తే నీవు తప్పకుండా మంచి పెయింటింగ్స్ వెయ్యగలవు. క్విజ్ ల పట్ల నీకున్న ఆసక్తి మంచిదే, కానీ క్విజ్ పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, డైలీ పేపర్లో మంచి విషయాలు, టీవీ లో వచ్చే అభివృద్ధి విషయాలు, సైన్స్ విషయాలు ఒక నోట్స్ లో వ్రాసుకునికృషి చేయి. ప్రపంచంలో ఎన్నో సాధించినవారు కేవలం ఆసక్తి ,కృషి,పట్టుదల తో ఎన్నో సాధించి ప్రపంచానికి ఇచ్చారు." అని చెప్పి ఒక మంచి డ్రాయింగ్ పుస్తకం, పెన్సిళ్లు, వాటర్ కలర్స్ మరొక మంచివిజ్ఞాన విషయాల పుస్తకం ఇచ్చారు.
తండ్రి చెప్పిన మాటలు రఘుమీద బాగా పని చేశాయి.శ్రద్ధగా డ్రాయింగ్ నేర్చుకోసాగాడు. అప్పటినుండి ఎవరిమీదా ద్వేషం పెంచుకోకుండా, ధీరజ్ తో కూడా మంచిగా వుంటూ అతని వద్ద చిత్రకళలో బోలెడు మెళకువలు నేర్చుకోసాగాడు.
ఎప్పుడూ మన మార్పు వెలుగు దారి వైపు సాగాలి కదా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి