పూర్ణచంద్ర ఆలోచన:-కంచనపల్లి వేంకట కృష్ణారావు 9348611445


 పూర్ణచంద్ర ఒక పెద్ద కంపెనీలో ఇంజనీరు.ఆయన ఎంతో శ్రమించి కంపెనీకి ఖర్చులు తగ్గించి గణనీయ లాభాలు చేకూర్చే మార్పులు యంత్రాలలో చేశాడు.అదిగాక ఎన్నో లాభాలు చేకూర్చే సూచనలు కంపెనీకి చేశాడు.

        అందుకే కంపెనీ అధికారులకి పూర్ణచంద్ర అంటే గౌరవం.కంపెనీ అభివృద్ధికి ఇతర దేశాల నిపుణుల సలహాలకోసం పూర్ణచంద్రను కంపెనీ జర్మనీ,చైనా,జపాను,రష్యా,అమెరికా వంటి దేశాలకు పంపేది.పూర్ణచంద్ర అక్కడి నిపుణుల సలహాలు తీసుకోవడమే కాకుండా,స్వతహాగా ఆ సూచనలను మరింత అభివృద్ధి చేసి మన దేశ కంపెనీలకు ఉపయోగ పడేటట్టు చేయగలిగాడు.పూర్ణచంద్ర పని చేస్తున్న కంపెనీనే కాకుండా అనేక ఇతర కంపెనీలు కూడా ఆయన సూచనలు స్వీకరించి,లాభాలు పొంది ఆయనకు అభినందన పత్రాలు ఇచ్చాయి.

        పూర్ణచంద్ర ఏ దేశానికి వెళ్ళినా ఆయన ఐదు నక్షత్రాల హోటల్ లో దిగే ఏర్పాటు చేసింది కంపెనీ.

మరి మంచి వసతి కల్పిస్తేనే కదా, మంచి వాతావరణంలో మంచి ఆలోచనలు,సృజనాత్మకతకు అవకాశం ఉంటుంది కదా!

        పూర్ణచంద్ర వెళ్ళిన అన్ని దేశాల్లో ఆ పెద్ద హోటళ్ళలో ప్రతి బాత్ రూమ్ లో మంచి ఖరీదైన సబ్బులు పెట్టేవారు.అలా ఒకసారి వాడిన సబ్బును తీసేసి మరలా కొత్త సబ్బుబిళ్ళ పెట్టేవారు.

        ప్రతి రోజూ తన బాత్ రూములో కొత్త సబ్బు ప్రత్యక్షం అవడం చూసిన పూర్ణచంద్రకు ఒక అనుమానం వచ్చింది.మరి తీసేసిన సబ్బు బిళ్ళను ఏం చేస్తారని? ఒకరోజు తన పని ముగించుకుని వచ్చాక పూర్ణచంద్ర ఆ హోటల్ మేనేజర్ ని కలసి ఈ విధంగా అడిగాడు, "సార్,బాత్ రూములో ప్రతిరోజు సబ్బు మారుస్తున్నారు,మరి తీసేసిన సబ్బుల్ని ఏం చేస్తారు?"అడిగాడు పూర్ణచంద్ర.

        "సార్ ఒకరు వాడిన సబ్బు ఇంకొకరు వాడరు,కొంతమంది రోజూ ఒక కొత్త సబ్బు  పెట్టమంటారు,ఎందుకంటే మాది ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి,మరి ఎవరూ వాడరు కాబట్టి తీసేసిన సబ్బుల్ని చెత్తలో పార  వేసేస్తుంటాం.మాది ఫైవ్ స్టార్ హోటల్ కాబట్టి ఇవన్నీ తప్పవు"అని చిరునవ్వుతో చెప్పాడు హోటల్ మేనేజరు.

        ఆ రాత్రి పూర్ణచంద్ర సబ్బులను గురించి తీవ్రంగా ఆలోచించాడు.రీ సైకిల్ అంటే బాగు చేసి మరలా వాడటం,లేక రీ యూజ్ అంటే యధాతదంగా మరలా వాడటం చేస్తే ఆ మిగిలి పోయిన ఖరీదైన సబ్బులకు సార్థకత చేకూరుతుంది కదా! అంటే వాటిని అమ్మకానికి ఉపయోగించకూడదు. మనదేశంలో ఎన్నో మురికి వాడల్లో మనుషులు సబ్బు బిళ్ళ కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు.మనదేశమే కాదు ఆఫ్రికా ఖండంలో సోమాలియా,నైజీరియా వంటి దేశాల్లో కూడా అతి పేదలు సబ్బుకొనలేని పరిస్థితుల్లో ఉన్నారు! మరి మిగిలి పోయిన సబ్బుల్ని రీ సైకిల్ చేసి అంటే ప్రత్యేక పద్దతుల ద్వారా శుభ్రం చేసి,ప్యాక్ చేసి ఆ బీద వారికి పంపిస్తే ఎంతోమేలు చేసిన వారం అవుతాము కదా అని ఆలోచించాడు పూర్ణచంద్ర.

      రెండోరోజే మరలా హోటల్ మేనేజర్ని కలసి "ఆ మిగిలి పోయిన సబ్బలన్నీనాకు ఇవ్వగలరా?" అని అడిగాడు.

      అంతపెద్ద కంపెనీ ఇంజనీరు ఆ విధంగా అడిగే సరికి మేనేజర్ ఆశ్చర్య పోయాడు.అతని ఆశ్చర్యాన్ని గమనించిన పూర్ణచంద్ర ఈ విధంగా చెప్పాడు.

       "సార్,వదిలేసిన సోపుల్ని పారవేసే బదులు వాటిని శుభ్రం చేసి అంటే రీసైకిల్ చేసి ప్యాక్ చేసి సబ్బుకొనలేని పేదవారికి ఇస్తే ఎంతో ఉపయోగం కదా!" చెప్పాడు పూర్ణచంద్ర.

      "మీది గొప్ప ఆలోచన,మీ ఆలోచన అధ్బుతం, తప్పకుండా సబ్బులు మీకు చేరేట్టు చేస్తాను,అదిగాక కొన్ని హోటళ్ళ మేనేజర్లు నాకు తెలుసు,వారి హోటళ్ళలోని సబ్బులు కూడా మీకు చేరేట్టు చేస్తాను" చెప్పాడు మేనేజర్.

      మేనేజర్ మాటలకు ఎంతో సంతోషించాడు పూర్ణచంద్ర.వెంటనే తనకు తెలిసిన సబ్బుల తయారీ ఫ్యాక్టరీ యజమానికి ఫోన్ చేసి తన ఆలోచన చెప్పాడు పూర్ణచంద్ర.

         "మీది మంచి ఆలోచనసార్, బీదవారి పరిస్థితులు నాకు బాగాతెలుసు, మీరు డబ్బులేవీ ఇవ్వనక్కరలేదు,మీరి తెచ్చే సోపుల్ని నేనే ప్యాక్ చేయించి ఇస్తాను"అని పెద్ద మనసుతో చెప్పాడు యజమాని.

     .ఒక మంచి ఆలోచన వస్తే, మంచివారు తప్పక తోడ్పడతారు.మంచిపనులు అవే జరిగిపోతాయి.

ఆ విధంగా బోలెడు సోప్స్ సబ్బు కొనలేని వారందరికీ చేరసాగాయి! ఈ కార్యక్రమం మొదలు పెట్టిన తరువాత ఆ బీదవారిలో పది శాతం చర్మవ్యాధులు తగ్గి పోయాయి.ఈ కార్యక్రమ విశేషాలు తెలిసి పూర్ణచంద్రతో అనేక స్వచ్ఛంద సంస్థలు చేతులు కలిపాయి.

(Shawn Seipler వితరణ వ్యాసం చదివాక వచ్చిన ఆలోచనే ఈ కథ)

           


కామెంట్‌లు