అద్దం చేసిన మేలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   ఓ అడవిలో కోతి,కుందేలు స్నేహంగా ఉండేవి. 
     "కోతి మామా, నీవేమో హాయిగా చెట్ల మీద పండ్లు తింటూ  ఉంటావు,మరి నేను నేలమీద ఉంటాను కదా,సింహం,తోడేలు,నక్క  నన్ను చూస్తే ,అవి నన్ను చంపి తింటాయేమోనని నాకు భయం!" అంటూ బాధ గా చెప్పింది కుందేలు.
       "మరేం చేసేది,చెట్లమీద ఉండటం నా అలవాటు,నీవేమో పొదల్లో ఉంటూ క్యారెట్ లాటి దుంపలు తిని బతుకు తావు,చెట్టు మీదకు ఎక్కలేవు,భయ పడకు జాగ్రత్తగా ఇటు అటు చూసుకుని వెళుతుండు"అని చెప్పింది కోతి.
      "మరి నేను ఇలానే బతకాలి,నాకున్న స్నేహితుడివి నీవొక్కడివే" అంటూ తన పొదలోకి వెళ్ళిపోయింది.
        కోతి చెట్లమీద దూకుతూ పక్క గ్రామానికి వెళ్ళి ఓ పెద్ద చెట్టు మీద కూర్చుంది,తిండి దొరుకుతుందేమోనని ఇటు అటు చూడ సాగింది,తిండి దొరకలేదు కానీ, దానికి ఓ గోడ పక్కన అద్దం కనబడింది! కొమ్మ పైనండే అది అద్దంలోకి చూసింది,అందులో తన ప్రతి బింబమే కనబడింది! అంతకు ముందు అది అద్దం చూసి ఎరగదు! అద్దం లో మరొక కోతి బంధించబడి ఉన్నదనుకుని పరుగున అద్దం వద్దకు వెళ్ళి తీసుకుని అందులో చూస్తూ అద్దంలోని కోతిని పలకరించడానికి నోరు తెరిస్తే అద్దంలో కోతి కూడా నోరు తెరిచింది! అల్లంత దూరంలో ఒకామె అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటున్నది,అప్పుడర్థమయింది కోతికి అది మొహం చూసుకునేందుకు మనుషులు ఉపయోగిస్తారని.దానికి ఆశ్చర్యం వేసి,ఆకలి కూడా మరచి అడవిలో జంతువులకు అద్దం చూపించాలని అడవిలోకి పరుగెత్తింది.
     అలా అది అడవిలోకి వెళ్ళి చెట్టు మీద కూర్చుని మొహం చూసుకుంటూ కూర్చుంది.కొంత సేపటికి చెట్టు కిందకు ఒక సింహం వచ్చింది,అద్దాన్ని దానికేసి తిప్పింది కోతి.అద్దంలో సింహం మొహం కనబడేసరికి,సింహానికి ఆశ్చర్యం, భయం కలిగాయి! సింహాన్ని కోతి బంధించిందేమో అనుకుని,సింహం పరుగు తీసింది.సింహం భయపడినట్లు కోతి గ్రహించింది. అది చెట్టు కిందకు వచ్చిన తోడేలు,నక్క కు కూడా వాటి మొహాలు అద్దంలో చూపించింది,అన్నీ తమ జాతి జంతువుల్ని బంధించిందేమోనని భ్రమపడి పరుగు తీశాయి!అన్నీ వెళ్ళి పోయాక చెట్టు కిందకు కుందేలు వచ్చింది,కుందేలుకు కూడా అద్దం చూపించేసరికి,
   "అబ్బ! ఈ కుందేలును ఎక్కడి నుండి తెచ్చావు?"అని అమాయకంగా అడిగింది.
      "ఏ కుందేలునూ తేలేదు కుందేలు తమ్ముడూ,దీనిలో ఎవరు చూసుకుంటే వారి మొహం కనబడుతుంది,ఇప్పుడే సింహం,తోడేలు,నక్క వాటి మొహాలు చూసుకుని నేను బంధించానేమోనని భయపడి ఆమడ దూరం పరుగెత్తాయి!ఈ విషయం ఎవరికీ చెప్పకు,ఈ అద్దం తీసుకుని నీతోపాటు నేనూ వస్తాను,ఇక నీకు భయం ఉండదు,నా చేతిలో అద్దం చూస్తే సింహం అయినా దూరంగా పరుగెత్తాల్సిందే"అని సంతోషంగా చెప్పింది.
     "నీవు ఇంత మంచి విషయం చెబితే,ఇక నాకు భయం ఎందుకు?నాకు మంచి దుంపలు దొరికే చోటు తెలుసు,నాతో రా ఇద్దరం హాయిగా తిందాము"అంది కుందేలు.
అలా కోతి,కుందేలు"ఒకరికి ఒకరు హాయిగా"అని పాడుకుంటూ బయలు దేరాయి.
          

కామెంట్‌లు