చిలుకూరులో అన్నపూర్ణమ్మకు ఓ చిన్న హోటల్ ఉంది.అదేమి చిత్రమో గానీ ఆమెచేసిన ఇడ్లీలు అమితరుచిగా మల్లె పువ్వులలాగ మెత్తగా ఉంటాయి.ఇక చట్నీ,సాంబారు రుచులు చెప్పనక్కరలేదు.
అందుకే ఊర్లో అందరూ ఇంట్లో ఎన్ని ఫలహారాలున్నా కనీసం వారానికి ఒక సారి అయినా అన్నపూర్ణమ్మ హోటల్లో తృప్తిగా రుచిగా ఆ ఇడ్లీలు తినేవారు!
బాగా డబ్బున్న గోపాలరావు కూడా పది రోజులకొకసారి అన్నఫూర్ణమ్మ హోటల్లో గుమ గుమలాడే సాంబారుతో ఇడ్లీలు తినేవాడు.
గోపాలరావు పిసినారి అందుకే ఎక్కువ ఇడ్లీలు తినాలని ఉన్నా డబ్బు ఖర్చు అవుతుందని నాలుగు ఇడ్లీలు మాత్రం తిని వెళ్ళేవాడు.ఎవ్వరికీ ఏ విరాళం ఇచ్చేవాడుకాదు!
ఒకరోజు గోపాలరావు అన్నపూర్ణమ్మ హోటల్లో ఇడ్లీలు తింటున్నప్పుడు,ఒక బైరాగి వచ్చి "అమ్మా రెండు ఇడ్లీలు దానం చెయ్యి ఆకలిగా ఉంది"అని దీనంగా అడిగాడు.
"అయ్యో,రెండు ఇడ్లీలతో ఆకలి ఏం తీరుతుందయ్యా?ఇదిగో నాలుగు ఇడ్లీలు తృప్తిగా తిను,ఇంకా ఆకలి తీరకపోతే మరో రెండు అడుగు" అంటూ ఇడ్లీలు గుమ గుమ లాడే చట్నీ అతడి గిన్నెలో వేసింది.బైరాగి నమస్కారం పెట్టి వెళ్ళాడు.
ఆమె వితరణ చూసి గోపాలరావు ఆశ్చర్యపోయాడు.
"అన్నపూర్ణమ్మా,నీవు అంత ఖరీదు పెట్టి మినపప్పు,ఇడ్లీ రవ కొంటున్నావు, ఈ విధంగా దానం చేస్తుంటే నీకు నష్టంరాదా?"అడిగాడు గోపాలరావు.
"అయ్యా,దానిని నష్టం అని ఆలోచిస్తే మనకు నష్టమే కనిపిస్తుంది,లేని వాడి ఆకలి తీరుస్తే మనకు మానసిక తృప్తి అదిగాక మనం చేసే దానానికి ఆ దేముడు సంతోషించి మనం మరిన్ని మంచిపనులు చేయడానికి శక్తి ఇస్తాడు"అని చెప్పింది.
"అబ్బో ఈమె దగ్గర చాలా నీతులే ఉన్నాయి" అనుకున్నాడు గోపాలరావు.
కొద్ది రోజుల తరువాత గోపాలరావు హోటల్ కి వచ్చాడు.
"అయ్యా,ఇడ్లీలు తింటూ ఉండండి, నేను పదినిముషాల్లో వచ్చేస్తాను" అని గోపాలరావుకి ఇడ్లీలు ఇచ్చి,ఏభై ఇడ్లీలు ఒక పాత్రలో పెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది.అన్ని ఇడ్లీలు ఎక్కడికి తీసుకవెళ్ళిందో గోపాలరావుకి అర్థం కాలేదు..
అన్నపూర్ణమ్మతిరిగి వచ్చాక,"అన్ని ఇడ్లీలు తీసుక వెళ్ళావు మరి బయట ఎక్కడైనా అమ్ముతున్నావా?" అడిగాడు గోపాలరావు.
"లేదు నాయనా, అప్పుడప్పుడూ నావంతుగా ఓ ఏభై ఇడ్లీలు వృద్ధాశ్రమానికి ఉచితంగా ఇస్తాను.ఆ ముసలి ప్రణాలకు అంతకన్నా ఏమి ఇవ్వగలను?" చెప్పింది.
ఆ మాటలు గోపాలరావును కదిలించాయి.తను ఎంతో సంపాదించాడు,కానీ ఒక్క రూపాయికూడాతాను దానం గానీ ధర్మం గానీ చేయడంలేదు.ఆ హోటల్ నడుపుకుంటున్న అన్నపూర్ణమ్మ ఎంతో వితరణశీలి.తనకు అంత డబ్బు లేక పోయినా,ఆకలి గొన్న వారికి వారికి కొంత దానం చేస్తోంది.అందుకే ఆమె అంటే అందరికీ గౌరవం!మరి తనని విమర్శించే వారు ఎక్కువ.ఇక తానుకూడా మారాలని,తనువంతు సాహాయంగా ఏదైనా స్వచ్చందసంస్థకు డబ్బు సహాయం చేయాలని నిశ్చయించాడు.
వెయ్యి రూపాయలు వికలాంగుల ఆశ్రమానికి ఇచ్చాడు.ఆ రోజు అతని హృదయం సంతోషంతో నిండి పోయింది.
గోపాలరావు కూడా అప్పుడప్పుడు అన్నపూర్ణమ్మ హోటల్ లో వంద ఇడ్లీలు కొని వికలాంగులు,మానసికవికలాంగుల ఆశ్రమాలకు పంపసాగాడు.
మంచివాళ్ళు చేసే కార్యక్రమాలు చూసినప్పుడు కొందరిలో మార్పు వస్తుందనడానికి గోపాలరావు మారిన మనసే ఉదాహరణ.
గోపాలరావులో వచ్చిన మార్పుకి ఇంట్లో వారే కాదు,అతని స్నేహితులు కూడా సంతోషించారు.ఆ స్నేహితులు కూడా అవసరమైనవారికి సహాయం చేయసాగారు.
అన్నపూర్ణమ్మ వితరణ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి