మొదట మానవత్వం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

    మా మామయ్యకు మొదటి నుండీ జంతు ప్రేమ ఎక్కువ,కుక్కలు తాగేందుకు బయట నీరు పెట్టే వాడు మరి పక్షులకు నీళ్ళు, అవి హాయిగా ఉండేందుకు కృత్రిమ గూడు కట్టేవాడు. అలా మామయ్య జువాలజీ ఎమ్.ఎస్.సి. చేశాడు.అయినా మామయ్యకు తృప్తి లేదు! ఇంకా పెద్ద చదువు వైల్డ్ లైఫ్  బయాలజీ చేశాడు.దానితో మామయ్యకు జూ లో ఉద్యోగం వచ్చింది.అక్కడి జంతువుల్ని ఎంతో ప్రేమగాచూసుకుంటుంన్నందుకు మామయ్య అనేక ప్రశంసా పత్రాలు పొందాడు.
          ప్రభుత్వం నుండి ఆయన ఒక అరుదైన గౌరవం పొందాడు. మామయ్యను ప్రభుత్వం ఆఫ్రికా దేశాలకు వెళ్ళి అక్కడి అరుదైన జంతువుల్ని,అంతరించి పోతున్న జంతువుల మీద పరిశోధనలకు పంపించింది.అది చాలా కొద్ది మందికి దక్కే గౌరవం!
         ఆ విధంగా మామయ్య ఆఫ్రికా దేశాలలో పర్యటించాడు ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్,సెరంగటి నేషనల్ పార్క్ లు దర్శించాడు అక్కడ అపార జంతు సంపద ఉంది కొన్ని జంతువులు అతి అరుదైనవి!ఆయనకి అక్కడి జంతు శాస్త్రజ్ఞులు ఎంతో సహకరించారు! జంతువులను వీడియో తీయడం, వాటి ప్రవర్తన గమనించడం, వాటిని గురించి పూర్తి సమాచారం సేకరించడం,అక్కడి శాస్త్రజ్ఞులు వాటిని ఏ విధంగా సంరక్షిస్తున్నారో తెలుసుకోవడం వంటివి ఎన్నో చేశాడు మామయ్య.
        ప్రతి విషయం గ్రంథస్తం చేశాడు మామయ్య త్వరలో జెనివాలో జరిగే  సభలో అంతరించి పోతున్న జంతు జీవాలను గురించి  మాట్లాడబోతున్నాడు.
       టాంజానియా లో ప్రయాణిస్తున్నప్పుడు మామయ్య ఒక విషయం గమనించాడు.అది ప్రపంచంలో అతి బీద దేశంకదా,చాలా మటుకు పాకలే! అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తే  వాళ్ళ డొక్కలు లోపలికి పోయి,కళ్ళలో కాంతి లేకుండా,అతి నీరసంగా కనబడ్డారు మామయ్యకు.
        అప్పుడే వారికి ఏదైనా మేలు చేయాలని మామయ్య నిశ్ఛయించాడు.అక్కడి శాస్త్రజ్ఞలతో మాట్లాడాడు. 
        వారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు.ఆఫ్రికాదేశాలు చాలామటుకు బీద దేశాలు.పిల్లలు పెద్దలు సమతుల్య ఆహారానికి నోచుకోలేక పోతున్నారు.అందుకే మామూలు పిల్లలు లాగ కాకుండా అతి బలహీనతగా కనబడుతున్నారు.అటువంటి వారి కోసం మైఖేల్ లెస్ కాన్నె అనే ఫ్రాన్స్ దేశానికి చెందిన పిల్లల సమతుల్య ఆహార నిపుణుడు 1996 లో ప్లంపీ నట్ అనే వేరుశనగ పప్పు, చక్కెర, పాలు మొదలైన వాటితో చక్కటి సమతుల్య ఆహారం చేశాడు,అనేక దేశాలకు చెందిన  స్వచ్ఛంద సంస్థలు దానిని ఆ బీద పిల్లలకు ఉచితంగా పంచుతున్నాయి!
         మామయ్య మన దేశానికి తిరిగి వచ్చాక ప్రతి సంవత్సరం కనీసం పది బస్తాల వేరు శనగపప్పు కొని ఆస్వచ్ఛంద సంస్థలకు పంపిస్తున్నాడు.వారు వాటితో ప్లంపీ నట్ చేసి ఆయా ఆఫ్రికా దేశాలకు పంపిస్తున్నారు.
         జెనీవా సభలో మామయ్య కేవలం అంతరించి పోతున్న జంతువుల్ని కాపాడటమే కాకుండా ఆకలితో అలమటించే జనాల్ని కాపాడాలని నొక్కి ఒక్కాణించాడు.అక్కడ అందరూ మామయ్యకు జేజేలు పలకడమే కాకుండా అందరూ తమ వంతు సహాయం చేస్తామన్నారు.
           ఇదండీ,అంతరించిపోతున్న జంతువులను కాపాడటమే కాదు అంతరించి పోతున్న మానవత్వాన్ని మేల్కొల్పడానికి మామయ్య తనవంతు కృషి చేశాడు.
(ఈ కథ వ్రాయటానికి ప్రేరణ శ్రీ ఐ.పూర్ణచంద్రరావుగారు.వారు ప్లంపీ నట్ ను గురించి తెలిపారు,తక్కిన కథ నేను సృష్టంచాను)
              

కామెంట్‌లు