తెలుగుతనం తొణికిసలాడగ
లక్షల అక్షర మెదళ్లకు ప్రేరణగా
సాహితీ చెలక చదునుగా దున్నేసి
టన్నుల కొద్దీ కవన సిరులు పండించిన
భళారే!తెలుగు గజల్ రారాజు సినారె!
ఎగురలేని అక్షర పక్షులకు
రంగు రంగుల రెక్కలు తొడిగి
మేరువన్నె మెరుగుల సొబగులద్ది
విశ్వమంతా విరజిమ్మే తెలుగుతేజం
రెపరెప లాడే విశ్వంభర విజయ ధ్వజం
భళారే!పద్మ విభూషణ సినారె!
ఉరకలేసే గజల్ జలపాతాలతో
ఆరని జ్వాలల విప్లవ వేడి రాజేసి
సృజనాత్మక భావుకత సమపాళ్ళలో
చమత్కార రసాత్మకాలు రంగరించి
సామాజిక రుగ్మత శస్త్ర చికిత్సకారీ
భళారే!జ్ఞానపీఠ కీర్తి కిరీటి సినారె!!
సగటు మనిషి ఆలోచనాంకురం నుంచి
తాత్విక సిద్ధాంత ప్రయోగకర్త దాకా
శ్రమజీవన సౌందర్యావిష్కరణతో
వెలిగించే మనోవికాస చైతన్య దీపకళిక
విశ్వమానవ హృదయాంతర్య శోధకా
భళారే!నిత్య సత్య ఆచార్య సినారె!
మది దోచే మధుర సినీ గీతాలైనా
ఆణిముత్యాల కావ్య రాసులైనా
విలసిల్లిన కవితాశిల్ప సౌందర్యం
శబ్ద లయల హొయలొలికించే విశ్వగీతి
అద్భుత అజంతా సుందరి సుచిత్ర శిల్పి
అక్షర నివాళి!కవిలోక నారాయణ సినారె!
(12జూన్,సి.నా.రె నాల్గవ వర్థంతి సందర్భంగా అక్షర నివాళితో)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి