కన్నతోడు కట్టుకున్న నీడనొదిలి
రక్తం గడ్డకట్టే మంచుకొండల్లో
సరిహద్దురేఖపై ఆకాశహర్మ్యమై
భారతావని రక్షణ కవచమై
మొక్కవోని అకుంఠిత దీక్షా దక్షతతో
రక్షణ బాధ్యత భుజానేసుకుని
దేశ సేవే ధ్యేయంగా
దేహాన్ని త్యాగం చేసే
ఓయోధుడా!నీకు వేలవందనం!!
కణకణం జనహితం కోసం
నీరు నిప్పులేని
నిర్మానుష్య ఆవాసాల్లో
తిండి తిప్పలు మాని
చీకటిలో నిండు జాబిలిలా
పగలు ఎర్రటి సూర్యుడవై
ఒళ్లంతా కళ్ళు చేసుకొని
అహరహం పహారా కాసే
ఓ అమర సైనికుడా!నీకు సలాం!!
దేశరక్షణ కోసం నీపోరాటం
నీ త్యాగం స్ఫూర్తిదాయకం
నరనరం దేశభక్తి నింపుకొని
క్షణక్షణం అప్రమత్తతో
విశ్వాసమే తుది శ్వాసగా
ఉచ్ఛ్వాస నిచ్చ్వాసలు నియంత్రించే
ఓ వీర ధీర జవాన్!నీకు సెల్యూట్!!
దేశ సౌభాగ్యం కోసం నీమరణం
చరిత్రలో చెరగని నెత్తుటి సంతకం
సాగిపోయే సైన్య ప్రవాహంలో
ఆరిపోయే అర్ధాంతర యోధులెందరో
దేశ నైసర్గిక స్వరూపం
భద్రంగా గుండెల్లో దాచుకునే
పరమ వీరచక్ర! శత సహస్ర ప్రణామం!!
దేశ సౌభ్రాతత్వం కోసం
ముష్కర తుపాకీ గుళ్ల వర్షానికి
తడిసిన దేహం నెత్తుటి ముద్దతో
దేశమాతను కడసారి ముద్దాడిన
కారణజన్ముడా! జోహార్ జై జవాన్!!
(15జూన్2020,లడఖ్ లోని గాల్వన్ లో చైనా చీకటివేటుకు తెలుగుతేజం కల్నల్ సంతోష్ బాబుతో సహా 20మంది సైనికులు అమరులైన సందర్భంగా నివాళి అర్పిస్తూ)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి