సీసమాలిక:---మచ్చ అనురాధ-సిద్దిపేట9948653223.

 ఏ నిమిషానికి యేమి జరుగుతుందో
యెంతటి వారైన యెరుగ లేరు,
కాలగమనములో కష్టాలు సుఖములు
కావడి కుండలు గనగమనము,
వెనుకకు తేలేరు వీరులైనను గాని
శూరులైనను నేమి జూడనెందు,
బీద ధనికులని భేదము లేదురా
కాల పురుషుడిని గాంచ నిలన,
ప్రస్తుత కాలము పాటిగ నడవాలి
కరుణలేని కరోన కట్టు తెలిసి,
కాలము జేయును ఘనమైన మాయలు
తలవంచి నిలవాలి తప్పదికను,
మానవ మనుగడ మహిలోన సాగాలి
ధర్మమార్గమునందుదండిగాను,
కాలచక్రములోన కనిపెట్టి ధర్మాన్ని
రక్ష జేయగ నీకు రక్ష యౌను.
తేటగీతి
కాలమెప్పుడు వెనుకకు కదలి రాదు,
వ్యర్థ పరచరాదు మనిషి  వసుధ నందు,
కష్ట సుఖముల కలబోత కాలమంత,
బ్రతుకు నాటలో గెలవాలి భారమనక.

కామెంట్‌లు