విశ్వాసానికి చిరునామా:- డా.. కందేపి రాణీప్రసాద్.
పైన నిప్పులు చెరిగే ఎండ
నెత్తిపైన సామాన్ల మూటలు
చేతుల్లో మోతల బ్యాగులు
చంకలో పసిపిల్లలు
పక్కనే భార్య బిడ్డలు
కళ్ళలో సడలని ఆత్మవిశ్వాసం
మనసులో ఉక్కు సంకల్పం
చెదరని దైర్య సాహసం
వారే వారే వలస కూలీలు!

నెత్తిమాడుతున్నా లెక్కలేదు
కాళ్ళు బొబ్బలెక్కినా ఆపేది లేదు
గొంతెండినా, కడుపు మాడినా
అలుపెరగని పయనం ఆగదు
చివరి గమ్యం చేరేవరకూ!

సంసారమంతా గుప్పిట్లో
కుటుంబమంతా నడిరోడ్లో
గమ్యం వేల కిలోమీటర్ల లో
ఐనా కళ్ళలో బెదురు లేదు
ఒంట్లో అదురు లేదు
ఆశయానికి ఎదురు లేదు
నడవలేమనే భయం గానీ
దూరమన్న సంశయం గానీ
చేరలేమనే అనుమానంగానీ
ఇసుమంతైనా లేనేలేదు
ఉన్నదల్లా ఒక్కటే లక్ష్యం
పుట్టి పెరిగిన మట్టి చూడాలన్న తపన!

ఒక్క అడుగై సాగాలంటూ
దూర ప్రాంతాలకు ప్రయాణం
విసుగు లేడు విరామం లేదు
సొంతూరు చేరేదాకా
విజయం సాధించే దాకా

కరోనాకు ప్రపంచం భయపడ్డా
వలస కూలీలకు భయం లేదు
సొంతింటికి వెళ్ళాలన్న ఆశ తప్ప
తన వాళ్ళ మధ్య ఉండాలన్న కోరిక తప్ప 

ఆత్మవిశ్వాసానికి చిరునామా
అత్మస్తైర్యానికి కేరాఫ్ అడ్రస్
అనుకున్నది సాదించాలంటే దృఢసంకల్పం
ఉక్కు పిడికిలి లాంటి గట్టి పట్టుదల
ఒంట్లో అలుపులేదు గెలుపు వచ్చేదాకా

పిజ్జా ఆర్డర్ చేస్తే
పఫ్ తెచ్చాడని అలిగే ఈ తరం
వందకు తొంబైతోమ్మిదిన్నరే మార్కులోచ్చాయని
తెగ భాధపడే ఈతరం
పేరున్న కాలేజిలో
సీటు రాకపోతే చింతించే ఈతరం
క్యాంపస్ సెలెక్షన్ లో
ప్లేస్ మెంట్ రాలేదని నిరాశచెందే ఈతరం
వలస కూలీలను చూసి నేర్చుకోవాలి ఎంతైనా

మిన్ను విరిగి మీదపడ్డా
నిబ్బరంగా ఉండాలని
ఎన్ని ఆటంకాలు ఎదురైనా
నిమ్మళంగా పరిష్కరించాలని
మొక్కవోని దీక్షతో
తుది దాకా సమరం సాగించాలని

కామెంట్‌లు