అలిగిన బలపం:-;ద్వారపురెడ్డి. జయరాం నాయుడు--కైకలూరు, కృష్ణా జిల్లా

   అనగనగా ఒక పలక ఉండేది.అది ఆకుపచ్చ రంగులో ఉండి ఫ్రేమ్స్ గులాబీ రంగులో తళతళా మెరిసిపోతూ ఉండేవి. పలక తన అందానికి తానే మురిసి పోయేది. నా అంత అందం ఎవరూ లేరు అని అనుకొనేది. 
   ఒక రోజు పలక, బలపం బడికి బయలు దేరి వెళుతున్నాయి. పలక వయ్యారంగా నడుస్తూ "ఏయ్!బలపం నీతో కలసి రావడం, నీతో కలిసి ఉండడం నాకు 
నామోషీగా ఉంది. నీవు ఎక్కడ నేను ఎక్కడ నీవు నల్లగా, పొట్టిగా ఉంటావు. నేనైతే గంధర్వకన్యలా ఎంత అందంగా ఉన్నానో ! నీఅనాకారి రూపం చూసి నాకు అసహ్యం వేస్తుంది. నా విలువ 100 రూ|| నీ విలువ కేవలం ఒక రూపాయి. నీవు ఏ విధంగానూ నాతో సరితూగలేవు" అని హేళన చేసింది. 
   పలక ఆడిన మాటలకు బలపం చిన్నబుచ్చు కుంది. గులాబీ రంగు పలక మీద బలపం రాయడం మానేసింది. నేను చిటికేస్తే  నీవు కాకపోతే నీలాంటోళ్ళు వంద మంది వస్తారు అని పొగరుగా చెప్పింది పలక. ఈ విషయం మిగతా బలపాలకు తెలిసి ఆ పలక మీద రాయడానికి ఏవీ ముందుకు రాలేదు. దానితో రాజు ఆ పలకను ప్రక్కన పడేసి కొత్త పలక కొనుక్కున్నాడు.  ఇక ఈ గులాబీ రంగు పలకను ప్యాడ్ గా, ఆటల సమయంలో బ్యాట్ గా ఉపయోగించేవాడు రాజు. బంతి దెబ్బలకు తాళలేక బాధతో విలవిలలాడేది.ఇలా మరో రెండు రోజులు నన్ను ఉపయోగిస్తే నేను ముక్కలు అయిపోవడం ఖాయం అని ఏడుస్తూ కూర్చుంది. 
   పలక దుస్థితిని గమనించిన తోటి పలక వచ్చి 'చూశావా నీ పొగరు, అహంకారం వల్లనే నీకీ దురవస్థ దాపురించింది. ముత్యాల్లాంటి అక్షరాలతో అందంగా తళతళా మెరిసిపోయే దానివి. ఇప్పడు ఎందుకూ పనికి రాకుండా పోయావు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. తప్పయిపోయిందని బలపాన్ని క్షమాపణ కోరు" అని సలహా ఇచ్చింది. తన తప్పు తెలుసుకొని క్షమించమని బలపాన్ని వేడుకుంది. 
   బలపం లేనిదే పలకకు విలువ లేదు పలక లేకపోతే బలపానికి విలువ లేదు. మీరు ఇద్దరూ కలిసి ఉంటేనే అందమైన అక్షరాలు జాలువారేది. అని రెండింటికీ హిత వచనాలు చెప్పి బుద్ధిగా ఉండమని చెప్పింది. అప్పటి నుండి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదాభిప్రాయాలు లేకుండా రెండూ కలిసి మెలసి ఉంటున్నాయి.

కామెంట్‌లు