మున్సిపాలిటీ కార్మికులు (ఇష్టపదులు):- ఎం. వి. ఉమాదేవి
ప్రభాతము నకముందె ప్రతిదినము బాధ్యతగ
వీధులను చిమ్ముదురు వేగమున కదులుతూ 

అద్దముల వలెచేసి అందమై రహదార్లు 
బాటసారుల కెంత బాగుగా యనిపించు 

ఉమ్ములూ చెత్తలను ఉదయమే తొలగించి 
ఒకచోట చేరుకొని ఒద్దికగ మాటాడు 

మూడేసి నెలలకె ముచ్చటగ దొరికేటి 
జీతభత్యములనూ జీవితం సాగించు 

నడిమిరాతిరిలోన నడివీధిలో జేరి 
కూనిరాగాలుతో కుక్కలకు భయపడక

పరిశుద్ధ దేవతలు!!పనివారు కాదమ్మ!
రెండురోజులు రాక రెచ్చిపోయే చెత్త 

గుట్టలుగ నేర్పడియు కుళ్ళుకంపుగ మారు 
వ్యాధులూ పెరుగుతూ వ్యతిరేక పవనాలు 

ప్రజారోగ్యము చెడును ప్రత్యేక సమస్యలు 
కాలువలు నిండినను  కాలుష్యమెంతయును 

చెత్త కుండీలలో చేరు సూక్ష్మ క్రిములు 
మురికి కుంటల్లోన ముమ్మర  విషవాయువు 

ఆసుపత్రుల లోని అతిభీకరాలైన
రక్తమలినాలనిదె రాశిగా తొలగించు 

పారిశుద్ధ కార్మిక పవిత్ర కర్తవ్యము
మరువరానిది సుమ్ము మహిలోన ముఖ్యమ్ము 

చేపల విఫణియందు చెడువ్యర్థము లన్ని 
మాంసపు యంగళ్ల మాలిన్య మంతయును 

మూగగా తొలగించు మూర్తిమంతము వీరు 
ఇట్టి త్యాగధనులను  ఇట దీవించుము హరి !

కామెంట్‌లు