అపకారికి ఉపకారం:- - బోగా పురుషోత్తం, తుంబూరు.

  రంప  చోడవరంలో  రంగయ్య, రామారావు  అనే  ఇద్దరు మిత్రులు ఉండేవారు .
ఇద్దరిదీ  ఒకే  ఊరు  కావడంతో  ఒకే  స్కూలులో  చదువుకున్నారు.  రంగయ్యది
చాలా  పేద  కుటుంబం.  అర  ఎకరా  పొలం  వుంది.  దాని  నుంచి  వచ్చే
తిండిగింజలే జీవనాధారం. రామారావుది  చాలా సంపన్న  కుటుంబం. అతని
తల్లిదండ్రులు  బాగా  డబ్బున్న  మనుషులు.  మొదట  నుండి  రత్నాల  వ్యాపారం
చేస్తుండడంతో  దానిపై  ఆసక్తి  పెంచుకున్నాడు  రామారావు. అందువల్లే
తండ్రికి  వ్యాపార  వ్యవహారాలలో  సాయం  అందించేవాడు.  దీంతో  అతని చదువు
పదవ  తరగతితోనే  ఆగిపోయింది.
             రంగయ్య  బాగా  కష్టపడి ఉన్నత చదువు  చదువుకున్నాడు.
ప్రభుత్వ  అగ్రికల్చర్  ఆఫీసరు  గా  ఉద్యోగం  వచ్చినా  సుదూర  ప్రాంతం
కావడంతో  తగిన  ఆర్ధిక  స్థోమత  లేకపోవడంతో  అతని  తల్లిదండ్రులు
ఉద్యోగం  చేయడానికి  పంపలేకపోయారు. కొన్నాళ్ళకు  వివాహమై ఓ కుమార్తె
కలిగింది. అతని  తండ్రి  హఠాత్తుగా  మృతి  చెందడంతో  కుటుంబ  పోషణ  భారం
పూర్తిగా  అతనిపై  పడింది. కొన్నాళ్ళు  వ్యవసాయం  చేశాడు.  అది  తగినంత
లాభం  చేకూర్చకపోవడంతో  అది  వదిలి పెట్టాడు.  కొన్నాళ్లు  ఓ బండి
కొనుక్కుని టిఫన్  అమ్మి  కుటుంబాన్ని  పోషించాడు.  ఓ  రోజు  అదే  దారిలో
 కారులో  వెళుతున్న రామారావు  మిత్రుడు రంగయ్యను  చూశాడు.
కారుదిగి  తనవద్దకు  వచ్చి మిత్రుడిని కౌగలించుకుని :బాగున్నావా..? ఎంత
బాగా  చదివినోడివి  ఎలా  వీధుల్లో పడడం నీకు  తగదు.  ఒక సారి  నా  వద్దకు
 రా.  నీకు  ఏదైనా సులభంగా  బతికే  వ్యాపార సలహా  ఇస్తాను.. " అని
కారెక్కి  వెళ్లి పోయాడు రామారావు.
        ఆ  సాయంత్రం  మిత్రుడు  రామారావు  వద్దకు  వెళ్లాడు రంగయ్య. ధగధగ
 వెలుగుతున్న లైట్లతో  మెరిసిపోతున్న  ఆ  భవనంలో కి  అడుగు పెట్టాడు
రంగయ్య.  అక్కడే  వున్న సెక్యూర్టీ  రంగయ్యను బయటకు  తోశాడు.  గేటువద్దే
పడిగాపులు కాశాడు  రంగయ్య.  మధ్యాహ్నం  భోజనం  సమయానికి  బయటకు  వచ్చిన
రామారావుని అతికష్టంమీద కలిశాడు రంగయ్య.
          రామారావు  ఎంతో ఆప్యాయంగా  పలకరించి నువ్వు  ఏదైనా  బంగారం
దుకాణం పెట్టుకో.. " అని  సలహా ఇచ్చాడు.
         తనకు  అంత స్థోమత  లేదని తల  అడ్డం  తిప్పాడు.  అయితే తనకు  అర
ఎకరా  పొలం  ఉందని  అది ఓ  నాల్గు  ఖరీదు  చేస్తుందని  చెప్పాడు.  అయితే
ఆ  పొలం  తాకట్టు పెట్టుకుని కొన్ని  బంగారు  ఆభరణాలు ఇస్తానని చెప్పాడు
రామారావు.
మరుసటిరోజే  పత్రాలపై  సంతకాలు  పెట్టి పొలాన్ని రామారావుకి  అప్పగించాడు  రంగయ్య.
      అతను  ఇచ్చిన  కొన్ని  ఆభరణాలను  తీసుకుని  ఇంటికి  వెళ్లాడు
రంగయ్య.  ఓ  చిన్న  నగల  దుకాణం  ప్రారంభించాడు. ఎక్కువ  లాభం  లేకుండా
విక్రయించసాగాడు. ఆనతి  కాలంలోనే  ప్రజాదరణ  పొంది లక్షలు
ఆర్జించసాగాడు. దీనికి తోడు బంగారు  ఆభరణాలు  అవసరం  అధికం  కావడంతో
రామారావు  వద్దకు  వెళ్లడం  మానుకున్నాడు.  తనే  నైపుణ్యులను  ఏర్పాటు
చేసుకుని నగలను  తయారు చేసి  విక్రయించసాగాడు.  తాను తాకట్టు పెట్టిన
పొలాన్ని  కూడా  వడ్డీతో  సహా  చెల్లించి  పత్రాలను  వెనక్కి
తీసుకున్నాడు. తన  కళ్ళ  ఎదుటే ఇంత  స్థాయికి  ఎదగడం
జీర్ణించుకోలేకపోయాడు రామారావు. అప్పటికే  అతని వ్యాపారం  కాస్త
మందగించింది.  తన  వ్యాపారాన్ని  చక్క దిద్దుకోవడానికి  అక్రమమార్గం
వెతికాడు. రంగయ్య  వ్యాపారాన్ని ఎలాగైనా  దెబ్బ తీయాలనుకున్నాడు.  తన
వద్దకు  కుదువ  బెట్టేందుకు  బంగారు  ఆభరణాలతో  వచ్చే  వారిని  రంగయ్య
దుకాణం  వద్దకు  వెళ్లాలని  సలహా  ఇచ్చాడు రామారావు.
   రంగయ్య  వారిని  అనుమానించలేదు. మిత్రుడిపై  నమ్మకంతో  ఆభరణాలను
తాకట్టు  పెట్టుకోసాగాడు. దీన్ని  ఆసరాగా  తీసుకుని  రామారావు  నకిలీ
ఆభరణాలను తయారుచేసి కొందరివద్ద  ఇచ్చి  పంపించసాగాడు. ఇదేమీ  గ్రహించని
రంగయ్య  మిత్రుడు  అన్న  అభిమానంతో తాకట్టు  పెట్టుకోసాగాడు. అలాగే  అతను
 తెచ్చి  ఇచ్చిన  రత్నాలను  కొన్నింటిని తన ఆభరణాలలో  అమర్చి విక్రయించ
సాగాడు. క్రమంగా  జనంతో  కిటకిటలాడే  దుకాణం  వెలవెలపోయింది.  :ఏమిటా?"
అని  ఆలోచించసాగాడు రంగన్న.  రామారావు  ఇచ్చిన  ఆభరణాలను , రత్నాలను  ఓ
సారి  పరీక్షించాడు రంగయ్య.  అవి  నకిలీవి  అని తేలింది.  తాకట్టు
పెట్టిన  నగల్లోనూ  కొన్ని నకిలీవి  ఉన్నాయని  గ్రహించాడు. నమ్మకంగా
వున్న  మిత్రుడు  ఇలా  ద్రోహం  చేస్తాడని  కలలో  కూడా  ఊహించలేదు. వెంటనే
 వాటన్నింటిని  పక్కనపెట్టి  నాణ్యమైనవి  తయారుచేసి  విక్రయించసాగాడు.
నెమ్మదిగా  రంగయ్య  వ్యాపారం అభివృద్ధి  బాట  పట్టింది.
     రామారావు  వ్యాపారం  రోజురోజుకూ  క్షిణించ సాగింది. గోల్డ్ స్కీము
పేరుతో  డబ్బులు కట్టిన  వారు  తమకు నగలు  వద్దని  నగదు  ఇచ్చేయాలని
ఒత్తిడి  చేశారు.  అప్పటికే  నష్టాల  ఊబిలో  కూరుకుపోయిన రామారావుకు
ఏమిచేయాలో  దిక్కు తోచలేదు. మిత్రుడు  రంగయ్యను  ఆశ్రయించాడు. " నా
పరిస్థితి  అగమ్య  గోచరంగా  తయారయిందని జీవనం  గడవడం  కష్టంగా  మారిందని
తన  కుమారుడికి  ఏదైనా  ఉద్యోగం  ఇచ్చి చేతులు  జోడించాడు.
               అతడికి  తన దుకాణంలో  సేల్స్  మేనేజరుగా  ఉద్యోగం
ఇచ్చాడు. అతడు  బాధ్యతలు  చేపట్టిన  తరువాత ఆ  దుకాణాల  రూపురేఖలన్నీ
మారిపోయాయి.చూస్తుండగానే తన  ఆలోచనలతోనే కొత్తకొత్త  పథకాలు  అవలంబించి
ఫైనాన్స్  వ్యాపార  సంస్థగా  విస్తరింప చేశాడు. దీంతో  రంగయ్య  పేరు
దశదిశలా  పాకింది.  అంత  అనందం  వున్నా తన అమ్మాయికి  వివాహం  కాలేదన్న
బాధ  రంగయ్య  మదిలో  ఉండేది. రామారావు  కుమారుడి  ప్రవర్తన  నచ్చడంతో
రంగయ్య  తన  కుమారైను  ఇచ్చి  వివాహం  చేశాడు.
    ఇప్పుడు  రంగయ్య  ఆస్తులన్నింటికీ సంరక్షుకుడిగా  పెద్దదిక్కు
అయ్యాడు  రామారావు  కుమారుడు. దురుద్దేశంతో మిత్రుడి పతనం కోరుకుని చేసిన
 ద్రోహం మరిచి  తనకు  మళ్లీ  ఉన్నత  స్థితి  తెచ్చిన మిత్రుడి  మంచి
మనసుకు లోలోన  కృతజ్ఞతలు  తెలుపుకున్నాడు  మిత్రత్వానికి  మచ్చ  తెచ్చిన
రామారావు.

                                           
కామెంట్‌లు