వినాయకచవితి పండుగ సందర్బంగా గణపతి మట్టి విగ్రహాలను తయారు చేసి, పలురకాల రంగులు పూసి, సంతలో తన కుండలతో పాటు అమ్మకానికి ఉంచాడు కుండలు తయారు చేసే రంగయ్య. 'పాలుతాగే గణపతి విగ్రహాలు' అని గట్టిగా కేకలు వేస్తూ గణపతి విగ్రహాలు అమ్మసాగాడు.
"అయ్యా! గణపతి విగ్రహం ఎలా పాలు తాగుతుందో చూపించ గలరా?" అని అడిగారు అక్కడికి వచ్చిన వారు.
"నేను చూపించడం ఎందుకు అక్కడ పాలగిన్నె ఉంది. అందులోని పాలు కొద్దిగా ఆ స్పూన్ తో తీసుకుని మీరే గణపతి విగ్రహానికి తాగించండి" అన్నాడు రంగయ్య.
అందరికి కనిపించే విధంగా గిన్నెలోని పాలను స్పూన్ నిండుగా తీసుకుని అందుబాటులోని గణపతి విగ్రహాన్ని చేతిలోనికి తీసుకుని పాలతో ఉన్న స్పున్ ను గణపతి బొమ్మ తొండాని తాకించాడు వారిలో ఒకరు. క్రమంగా స్పూన్ లోని పాలు తగ్గి పోసాగాయి.
'జై గణేశా' అంటూ గుంపులో ఎవరో కేకపెట్టారు. గుంపుగా ఉన్న జనం 'జైగణేశా' అంటూ మరోమారు కేకపెట్టారు. అప్పటికే విషయం ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. వేగంగా రంగయ్య గణపతి విగ్రహాలు అమ్ముడు పోసాగాయి.
"ఆగండీ! ఇది మోసం విగ్రహాలు పాలు తాగడం, ఫలహారాలు తినడం జరగదు. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా,ఎక్కడైనా విన్నామా? ఇంత కాలంగా ఎక్కడా జరగనిది ఇప్పుడు మాత్రం ఎలా జరుగుతుంది? సహజత్వానికి విరుధ్ధంగా ఇలాంటి చర్యలు జరగడం అసంభవం. దైవత్వం అనేది ఓ నమ్మకం. దేవునికి పెట్టే ప్రసాదం రూపంలో వడ, పొంగలి, పానకం ప్రతిది మనమే పూజ అనంతరం స్వీకరిస్తాం. ఇది అందరికి తెలుసు. ఇందులో దేవుని ప్రమేయం ఉండదు" అన్నాడు ఆ గుంపులోని ఓ యువకుడు.
"ఎవరయ్య నీవు ఇందులో మోసం ఏముంది కళ్ళముందు కనిపిస్తుంటే" అన్నాడు రంగయ్య.
"అలాగా! అందరూ చూడండి. గణపతి విగ్రహమేకాదు ఈ కుండ కూడా పాలు తాగుతుంది. గమనించండి" అని అక్కడ ఉన్న కుండను ఎడమ చేతిలోనికి తీసుకుని, కుడిచేతిలో స్పూన్ నిండుగా పాలు తీసుకుని కుండకు తాకించాడు. క్రమేపి స్పూన్ లోని పాలు తగ్గిపోయాయి. అది చూసిన జనం ఆ యువకుడిని అభినందిస్తు చప్పట్లు కొట్టారు. మట్టితో చేయబడిన ఏ వస్తువైనా తయారు చేయబడిన తరువాత దాన్ని కాల్చుతారు.(ఇటుకలు కాల్చినట్లు) కాలిన ఏ వస్తువైనా తనకు చేరువగా వచ్చిన నీరు, పాలు వంటి ద్రవపదార్ధాలు పీల్చుకుంటుంది. ఇది సహజ చర్య. బాగా ఎండిన మట్టిగడ్డ వద్ద స్పున్ తో కొద్దిగా ఏదైనా ద్రవపదార్ధం ఉంచి చూడండి. క్రమంగా మట్టిగడ్డ ఆ ద్రవ పదార్ధాన్ని పీల్చుకుంటుంది. ఏ వ్యాపారైనా తన వస్తువు మంచిది, నాణ్యమైనదే అని చెపుతాడు. అది వ్యాపార లక్షణం. కొనుగోలుదారుడే తను కొనబోతున్న వస్తువు నాణ్యత పరిశీలించుకోవాలి. అది మన బాధ్యత అన్నాడు ఆ యువకుడు.
రంగయ్య తెల్లమొఖం వేసాడు. మరో పర్యాయం అక్కడి జనం ఆ యువకుని అభినందించారు. పొట్ట కూటి కోసం ఈ పని చేశానని ఒప్పుకోక తప్పలేదు రంగయ్యకు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి