నిస్సహాయత రోడ్డెక్కితే...! :-మచ్చరాజమౌళి దుబ్బాక.. (సిద్దిపేట జిల్లా)

రోజురోజుకూ మనిషి బంధం తెగిపోతుంది
ఆచూకీకి అందనంత దూరంగా
మానవత్వం ఆనవాళ్ళు 
కనబడని దూరానికి కదులుతున్న వేళ

రాలుతున్న ఆకులకేంతెలుసు
లేత చిగురు ఉదయిస్తూ
పండుబారిన అనుభవసారాన్ని
అదోలా చూస్తుందని
వెకిలినవ్వులకు వేదిక చేసుకుని

మెలికలు తిరుగుతున్న పేగు
మొలిచిన ప్రశ్నను నింపాదిగా చూస్తుంది
చీకటిలో కనిపించిన స్వార్థాన్ని 
కాలం తన తలపాగాగా చుట్టుకుంటుంటే

నిస్సహాయత రోడ్డెక్కితే 
సమాజపు పోకడల నగ్నదృశ్యాలు
త్రీడీ మెఱుపులతో స్పష్టంగా కనబడుతాయి

ప్రతి నిముషాన్ని 
కాలం శరాలుగ సంధిస్తూనే వుంది 
నిశీధిలో కలుస్తున్న
నిశ్శబ్ధం శబ్దాన్ని ప్రశ్నించే సమయం రావాలి.. 

కామెంట్‌లు