వడ్డాది పాపయ్య.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 

ఇష్టమైన పనిలో కష్టంతెలియదు అంటారు పెద్దలు బాల్యంనుండి తనకు ఇష్టమైన చిత్రకళపట్ల మక్కువచూపి కీర్తి శిఖరం అధిరోహించారు ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య .వీరు పవిత్ర నాగావళి నదీ తీరాన శ్రీకాకుళం పట్టణంలో రామమూర్తి, మహాలక్ష్మి దంపతులకు సెప్టెంబరు 10, 1921 న జన్మించారు. తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి . తండ్రి బొమ్మలు గీచే పద్ధతిని చాలా శ్రద్ధతో పరిశీలించేవారు. క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారు. పట్టుదలతో సాధన చేశారు.రంగులు కలపడం, వాటిని ఉపయోగించే పద్ధతిని తండ్రి వద్దనే నేర్చుకున్నారు. తండ్రి బొమ్మలు వేస్తున్నంతసేపూ ఆయనకంటే దీక్షగా పరిశీలించుతూ కచ్చితమైన పెర్‌ఫెక్టివ్‌నెస్ జాడలను తెలుసుకొనేవారు. రంగులు కలపడం, బ్రష్ లు ఎప్పటి కప్పుడు శుభ్రం చేయడం వంటి పనులన్నీ వినయ విధేయలతో నెరవేరుస్తూ తండ్రి వద్ద శిష్యుడి పాత్రను అద్వితీయంగా నిర్వహించారు. ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన ఇంటిలో ఉన్న రవివర్మ చిత్రం "కోదండ రామ"ను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసారు. పాపయ్య చిన్న తనంలో తండ్రి భారత, భాగవతాలను వినిపిస్తుండేవారు. ఆ ప్రభావం వలన పాపయ్య ఆధునికత కంటే ప్రాచీనత మీద, ముఖ్యంగా భారతీయ శిల్ప, చిత్ర కళల మీద మక్కువ పెంచుకొన్నాడు.
ఆయన ఊహ ఎదిగాక, చేతివేళ్ళతో వంపుసొంపులు ఇమిడిన అర్వాత రాజా రవివర్మ, దామెర్ల రామారావు ల చిత్రకళా తపస్సును ఆదర్శంగా ఎంచుకున్నారు. అంతరాంతరాలలోని "ఇన్‌ట్యూషన్"తో ఉండే సౌందర్య కాంక్షను దామెర్ల ప్రతిభా వ్యుత్పత్తుల నుండి పుణికి పుచ్చుకున్నారు. అందుకు హస్త కౌశాలం కూడా జత పడింది. మరి కొంత కాలానికి మహారాష్ట్ర ప్రభుత్వ చిత్రకారుడు దురంధర్ నుంచి స్ఫూర్తి పొందారు. దురంధర్ చిత్రాలను తమ మనోఫలకంలో శాశ్వతంగా ముద్రించుకున్నారు. దేవతా చిత్రాలను గీసే ప్రేరేపణను ముఖ్యంగా రవివర్మ నుంచి పొందారు. కేవలం ఊహ అయినప్పటికీ దేవతల బొమ్మలు, వెనుక పరివారాన్ని చిత్రీకరించడంలో తండ్రి, ఆ తర్వాత రవివర్మ నుంచి నేర్చుకున్నారు. కొంతలో కొంత అనుకరించారు కూడా. అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. తనదైన ప్రత్యేక శైలిని రూపొందించుకున్నారు. అడవి బాపిరాజు నుంచి గొప్ప భావుకతను అంది పుచ్చుకున్నారు. ప్రతి కళాకారుడికి వ్యక్తిత్వమూ, సొంత బాణి ఉండాలని, అప్పుడే ప్రత్యేకత ఏదో ఒకటి వారిలో కన్పిస్తుందని ప్రగాఢంగా నమ్మి, ఆ ప్రకారంగానే తనను తాను మలుచుకున్నారు.
ఒకానొక చిత్రకారునిగా 1938 లో తనను తాను గుర్తింపజేసుకున్నాడు. 17 వయేట ప్రారంభించిన ఈ తపస్సు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లకు గురయినా రాణించే వరకు ఆగలేదు. కళాసృష్టి హృదయం నుంచి వెల్లుబుకుతుంది. మేధస్సు నుంచి పుట్టిన హేతువాదానికి ఈ అంశం అందదు. ఆస్తికత్వ, నాస్తికత్వాల ప్రసక్తికి దూరంగా ఉన్నా ఎగురుతున్న హనుమంతుడు, గోపికాకృష్ణుల రాసలీల దృశ్యం మొదలైన ఎన్నెన్నో అతిరమణీయ చిత్రాలతో పాటు, పార్వతి, శకుంతల, లక్ష్మి, ధనలక్ష్మి, శివపార్వతులు, గంగావతరణం మొదలైన పౌరాణిక ఊహాత్మక బొమ్మలను గీచారు. అయితే లౌకిక ప్రపంచానికి తామంత తాముగా దూరమైపోయారు. రేరాణి, అభిసారిక, భారతి పత్రికలలో ప్రచురితమైన బొమ్మలలో ఒక సంచలన చిత్రకారుడుగా పత్రికా ప్రపంచానికి చేరువయ్యారు. తత్ఫలితంగా తెలుగు సినీ ప్రముఖుడు చక్రపాణి తమ సంస్థ ప్రచురణలైన చందమామ, యువ పత్రికలలో బొమ్మలు వేసే ఉద్యోగం ఇచ్చారు. ఒక్క "చందమామ" పత్రికలోనే దాదాపు మూడు దశాబ్దాల పర్యంతం తన సహజ శైలిలో బొమ్మలు చిత్రిస్తూ, ఒకే పత్రికలో కొనసాగటం తెలుగు పత్రికా రంగంలో ఒక పెద్ద రికార్డు! అభిసారికకు 1949-59 మధ్య కాలంలో గీసిన అపురూప ముఖచిత్రాలను, వాటికి శోభ చేకూర్చిన 'కరుణశ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి పద్యాలను చూసి తీరవలసిందే.చిత్రకళ నేర్చుకొంటున్న తొలినాళ్ళలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పాపయ్య చిత్రాలు పత్రికలలో ప్రచురించి ప్రోత్సహించాడు. ఆ తరువాత వ.పా రేరాణి, మంజూష, అభిసారిక, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో చిత్రాలు గీయటం ప్రారంబించాడు.
కొంతకాలం తరువాత చందమామ సంపాదకులు చక్రపాణి పరిచయంతో దాదాపు అర్ధ శతాబ్దం పాటు చందమామను తన కుంచెతో తీర్చి దిద్దాడు. అప్పటిలో చందమామ ఎనిమిది భాషలలో వెలువడుతుండటంతో పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రచారం పొందాయి. యువ మాసపత్రికలో చిత్రకారులు ఒక చిత్రం గీసే అవకాశం అరుదుగా వచ్చే రోజులలో నెలకు నాలుగు ఐదు చిత్రాలు గీసేవాడు పాపయ్య. చందమామ, యువ తర్వాత స్వాతి వార, మాస పత్రికలలో దశాబ్ధకాలం పైగా ఈయన చిత్రాలు ప్రచురించబడ్డాయి.
వడ్డాది పాపయ్యగారు గీసిన చిత్రాల క్రింద 'వ.పా.' అనే పొడి అక్షారాల సంతకం వారి ప్రత్యేకత. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు '0|0' అని వుండడం. ఇందు గురించి ఆయన చెప్పిన భాష్యం - "గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నానని".వ.పా. కేవలం చిత్రకారుడే కాదు. రచయిత కూడా. చందమామలో కొడవటిగంటి కుటుంబరావు మొదలు పెట్టిన 'దేవీభాగవతం' కథలను పూర్తి చేసింది ఆయనే. 'విష్ణుకథ' పౌరాణిక సీరియల్ కూడా ఆయన వ్రాసిందే.చరిత్రలో తనకంటూ ఒకస్ధానాన్ని సుస్ధిరపరచుకున్న ఈమహనీయుడు 1992 అక్టోబర్ 30న తుదిశ్వాసవిడిచారు.

కామెంట్‌లు