మేఘం
నీటిచుక్కలై
నేలమీద రాసే ప్రేమ కవితే
వర్షం
ఈ కవిత ఒక్కొక్కరినీ
ఒక్కోలా పలకరించి పోతుంటుంది
చెట్టు చిగురించడానికి
నా దేహం పూర్తిగా తడవడానికి
కారుమబ్బులు
ఉరుములతో
మెరుపులతో పోరాడి
చిందించిన స్వేదబిందువులే జల్లులు
నువ్వు తడిపడంతో
స్త్రీకెంత అందమిస్తావో నువ్వు
భూమిని ముద్దాడి
పరవశించడానికి ముందు
నువ్వామెను తడిపే దృశ్యం
ఎప్పుడూ అందమే అనుకో...
వర్షంలో తడవడం అందం
వర్షం మధ్య ఎండ మహా అందం
ఎండా వానల మధ్య ఆకాశాన్ని
అలంకరించే హరివిల్లు మరీ మరీ అందం
వర్షంలో పిల్లలు
కాగితప్పడవలు వదలడం ఇంకా అందం
భగవంతుడిని నేరుగా చూడలేకపోయానే అని
బాధ పడే కళ్ళు కార్చే
కన్నీళ్ళని తుడవడానికి దేవుడు
పంపిన దూతే వర్షం....
భూమ్మీద పడే వర్షం
చెట్లకు అమ్మపాలులాంటిది
ఎన్నేళ్ళయినాసరే వర్షం మాత్రం తన పిల్లలకు
పాలివ్వడం మరచిపోదు...
వర్షం తర్వాత వచ్చే మట్టివాసన
అద్భుతం
ఆ వాసనే వేరు...
ఉచితంగా లభించడం వల్లే
చాలా మందికి నీ విలువేంటో తెలీడం లేదు
ఆకుల అంచున నుంచి
నేలను తాకి పరవశించే ముత్యాల జల్లుల సన్నివేశం
చూసి తరించాల్సిందే...
ఎన్నన్నో పార్శ్వాల వర్షం అంటే
అందుకే నాకు మహా మహా ఇష్టం...
వర్షం మీద నేను పెంచుకున్న ప్రేమతో
ఈర్ష్య చెందిన పిడుగు
కోపంతో పెను శబ్దం చేయడం తట్టుకోలేదీ మనసు
వర్షమా
నువ్వు లేని చోట భూమి ఎండిపోతుంది
నువ్వొచ్చిన చోట భూమ్మంతా
పచ్చగా నిగనిగలాడుతుంటుంది...
వర్షమా నీకెన్ని గుణాలో...
అమ్మాయిలను తడుపుతున్నప్పుడు
నోరారా నవ్వుతావు
కోపమొస్తే వరదవుతావు
గర్విష్టులను తలవంచేలా చేస్తావు
అప్పుడప్పుడూ
నువ్వు గుణం తప్పి
పేదవాళ్ళ గుడిసెలను తప్పతడిపి
నిలువీడ లేకుండా చేస్తుంటావు...
మట్టి మీది ప్రేమతో
అరికాలు నుంచి నడినెత్తి వరకూ
తడిపి ఆనందిస్తావు
వర్షమా
నువ్వొచ్చి
నన్ను స్పర్శించి పో
నీ మీది పరవశంతో
కవిత రాసి నీకు అంకితమిస్తాను...
స్త్రీని తడిపాక
నువ్వు నేలను ముద్దాడి చేసే శబ్దం
వినడానికెంత మధురమో తెలుసా...
ప్రేమ ఎవరిమీదైనా చూపించొచ్చు
కానీ
కోపం ప్రాణానికి ప్రాణమైన వారిపైనే
చూపించే హక్కున్నట్టే
వర్షమూ తననుకున్న వారిని తడిపి
పరవశించిపోతున్నప్పుడల్లా
మనసుకెంత ఆనందమో
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి