ఆరోజు ఆదివారం. ఎప్పటిలాగే సాయంకాలం పిల్లలు తాత దగ్గర చేరారు. "తాతయ్యా!చదివేటప్పుడు ఏకాగ్రత ఉండాలి.అప్పుడే చదివిన అంశాలు అర్థమవుతాయి. బాగా గుర్తుంటాయి. ఏకాగ్రతలేని పని వ్యర్థమని మాస్టారు చెప్పారు.ఏకాగ్రత గురించి ఏదైనా కథచెప్పవా?"అని అడిగాడు రవీంద్ర.
"అలాగే చెబుతా వినండి" అంటూ ప్రారంభించాడుతాత.
అరుంధతీ రాజ్యాన్ని అమరసేనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.ఆయన శివభక్తుడు. రాజభవనానికి కొద్దిదూరంలో పెద్ద శివాలయం ఉంది. అక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి.
ప్రతిరోజూ రాజు ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటాడు.ఆలయ పూజారి విశ్వేశ్వరశాస్త్రిగారు ప్రతిరోజూ ఉదయం గర్భగుడిలో కూర్చొని ప్రజాక్షేమాన్ని కోరుతూ పూజలు చేసేవారు. వయస్సు ఎక్కువ కావడంతో ఆయన ఓరోజు మరణించాడు.
ఆయన అనంతరం ఆలయానికి పూజారిని నియమించాల్సి వచ్చింది. విశ్వేశ్వరశాస్త్రిగారికి,శంకరశాస్త్రి,నీలకంఠశాస్త్రి,శివశాస్త్రి అనే ముగ్గురు కుమారులున్నారు. ముగ్గురినీ పరీక్షిస్తే అన్నివిషయాల్లోనూ సమానులని తేలింది. ఎవరిని ఆలయపూజారిగా నియమించాలో రాజు కు అర్థం కాలేదు. బాగా ఆలోచించి ముగ్గురినీ పిలిచి రోజుకొకరు చొప్పున ఆలయంలో పూజాకార్యక్రమాలు నిర్వహించమని చెప్పాడు.
మొదటి రోజు శంకరశాస్త్రి సూర్యోదయానికి ముందే లేచి స్నానంచేసి ఆలయానికి వెళ్ళాడు.ప్రజాక్షేమాన్ని కోరుతూ పరమేశ్వరుని స్త్రోత్రం చేయసాగాడు. ఆ సమయాన అమరసేనుడు అక్కడ కొచ్చాడు.గర్భగుడి బయట నిలబడి 'శంకరశాస్త్రీ!'అని పిలిచాడు. రాజు గొంతు వినగానే శంకరశాస్త్రి స్త్రోత్రం ఆపి రాజు వద్దకొచ్చాడు.
"శంకరశాస్త్రీ!ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా మన రాజ్యం మీద ఉండాలని ప్రార్థించు."అని చెప్పి పరమేశ్వరుడికి నమస్కరించి వెళ్ళిపోయాడు రాజు.
రెండవరోజు నీలకంఠశాస్త్రి పూజలో ఉండగా వచ్చి "శాస్త్రిగారూ!"అంటూ రెండుసార్లు పిలిచాడు. నీలకంఠశాస్త్రి పలకకుండా పూజ పూర్తయ్యాక గర్భగుడి నుండి బయటకు వచ్చి "మహారాజా!ఇందాక మీరు రెండుసార్లు పిలిచారు. పూజలో ఉండి పలకలేదు. విషయమేమిటో చెప్పండి"అన్నాడు.
"పూజా కార్యక్రమం చూద్దామని వచ్చాను" అని చెప్పి వెళ్ళిపోయాడురాజు.
మూడవ రోజు శివశాస్త్రి పూజలో ఉండగా రాజు వచ్చాడు." శివశాస్త్రీ" అని పిలిచాడు. పూజలో నిమగ్నమై వున్న శివశాస్త్రికి ఆ పిలుపు వినిపించలేదు. మూడుసార్లు పిలిచి మౌనంగా ఉండిపోయాడు రాజు. ప్రార్థన పూర్తయ్యాక శివశాస్త్రి గర్భగుడి బయటకు వచ్చి రాజును చూసి "మహారాజా!మీరు వచ్చి ఎంతసేపయింది?" అన్నాడు వినయంగా .
"రాగానే మూడుసార్లు పిలిచాను. మీరు పలకలేదు"అన్నాడుఅమరసేనుడు.
"దైవధ్యానంలో ఉండి మీ పిలుపు వినలేకపోయాను. క్షమించండి "అన్నాడు శివశాస్త్రి.
తాను వచ్చిన అలికిడిగానీ, తన పిలుపుగానీ ధ్యానంలో నిమగ్నమై ఉన్న శివశాస్త్రి చెవికి చేరలేదని అర్థంచేసుకున్న రాజు అంతటి ఏకాగ్రతతో భగవంతుని మీద మనస్సు నిలిపిన శివశాస్త్రిని భక్తుల్లో అగ్రగణ్యుడిగా గుర్తించాడు. శివశాస్త్రిని శాశ్వతంగా ఆలయ అర్చకుడిగా నియమించాడు.
తాతయ్య కథచెప్పి "ఏకాగ్రత అంటే చేస్తున్న పనిమీద ఏ ఇతర ఆలోచనలు లేకుండా పూర్తిగా మనసు నిలపటం. అప్పుడే మనపని విజయవంతమవుతుంది" అని ముగించాడు.
ఏకాగ్రత:-డి.కె.చదువులబాబు.ప్రొద్దుటూరు.వై.యస్. ఆర్.కడపజిల్ల్లా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి