రంగు రంగుల బట్టముక్కలకు
సూదీ దారపు అల్లికతో
నేర్పుగా ఓ సంచీలాంటి
రూపమిచ్చేది మా అవ్వ
కొన్ని రూపాయి కాగితాలు
గలగలలాడే నాణేలు కొన్ని
తిరుమణి చూర్ణం
చిన్ని నశ్యపు డబ్బా
తన ట్రంకుపెట్టె తాళంచెవి
అవి ఇవి కాదు
అవ్వ సమస్త జీవనావసరాలు
అందులో దాక్కునేవి
ధవళవస్త్రాలతో పోటీ పడే ముగ్గుబుట్టజుత్తుని
వేలెడు ముడి చుట్టుకొని
తీర్థవడి పుచ్చుకొని
చాయ్ తాగి గుడివైపు
తొవ్వ బట్టిందంటే చాలు
సంచీ బొడ్ల చెక్కాల్సిందే
దైవం దానం ధర్మం అన్నీ
అందులోంచే సమకూర్చే
అక్షయపాత్ర ఆ బొడ్లసంచీ
పెరటివైద్యంతో చేతికందిన సొమ్ము
మదుపు చేసి పిల్లలమైన
మా ముచ్చట్లు తీర్చే కిడ్డీబాంక్ ఆ సంచీ
తేలికగా ఖాళీగా ఆ సంచీని
మేమెప్పుడూ చూళ్ళేదు
సంచీ అంటే బట్టముక్కల కూర్పే కాదు
ఆనాటి అవ్వల నాయనమ్మల
ఆర్థిక స్వావలంబన సారం ,సారస్వం
మా అవ్వ సాదాసీదా జీవనశైలి
తన బొడ్లసంచీ నియంత్రణ
గీతని ఎప్పుడూ దాటలేదు
ఎక్కడా చేయిచాచి ఎరుగదు
ప్లాస్టిక్ కరెన్సీ చలామణీ పెరిగి
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సామాన్యమైపోయి
బ్రాండెడ్ పర్సులు,వాలెట్లు
ఇప్పుడెన్ని వచ్చి చేరినా
నాలుగు రూపాయలు
నాలుగుచోట్ల దాచిపెట్టమని
మంచం ఉన్నంతలో
కాళ్ళు చాచి బతకమని
మనీ మానేజ్మెంట్ నేర్పించే
ఓ బిజినెస్ స్కూల్ కి తక్కువేమీ కాదు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి