మా సైన్స్ మాస్టారు!:-- యామిజాల జగదీశ్

 ఇక్కడి ఫోటోలో మీరు చూస్తున్న ఈయన మా సైన్స్ మాస్టారు, కోరాడ రామచంద్ర శాస్త్రిగారు. 
ఈయన ఈ జూన్ పదిహేనో తేదీన నూట మూడో వసంతంలోకి అడుగుపెట్టారు.
ఆయన కుమారుడు సూర్యనారాయణ నా సహవిద్యార్థి. 
నేను మద్రాసులోని త్యాగరాయనగర్లో పానగల్ పార్కు ఎదుట ఉన్న శ్రీరామకృష్ణామిషన్ (మెయిన్) బాలుర పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఎస్ ఎస్ ఎల్ సీ వరకూ చదువుకున్నాను.
నేను యావరేజ్ స్టూడెంటునే. ఒక్క తెలుగు సబ్జెక్టుతప్ప మిగిలినవేవీ బుర్రకెక్కేది కాదు. అయితే ఒక క్లాసు నుంచి మరో క్లాసుకి ప్రమోట్ అవడానికి ఎన్ని మార్కులు అవసరమో అన్ని మార్కులు మాత్రమే వచ్చేవి. తెలుగులో మరో పది పదిహేను మార్కులు ఎక్కవ వచ్చేవి. 
సైన్స్ మాస్టారుగారితోసహా టీచర్లందరూ బాగానే పాఠాలు చెప్పేవారు. కానీ నాకే బుర్రకెక్కలేదు. ఎక్కువ వాక్యాలు రాస్తే ఎక్కువ మార్కులు ఇస్తారనుకునే భ్రమతో ప్రశ్నలకు జవాబులు పెద్దగానే రాసేవాడిని. కానీ నేను రాసిన జవాబులలో విషయం పూజ్యం అన్నది మాస్టార్లకు తెలిసిపోయేది. సైన్స్ మాస్టారైతే పచ్చ సిరాతో పేపర్లు దిద్దేవారు. లేక ఎర్ర రంగు సిరా కావచ్చేమో. గుర్తుకు రావడం లేదు కానీ ఆయన జవాబుమీద ఇంటూ మార్క్ పెట్టి "గ్యాస్" అని రాయడం బాగా గుర్తు. అందుకే ఆయన ఆన్సర్ షీట్స్ దిద్దాక పేర్లు పిలుస్తూ ఇచ్చే రోజు గుండెలో భయం పరుగులు తీసేది. ఫిజిక్స్ పాఠాలైతే అస్సలు గుర్తుండేవి కావు. అంతా తికమకే. ఆయన పీరియడ్ నలభై అయిదు నిముషాలూ అయిదు నిముషాల్లో అయిపోతే బాగుండేదని మనసులో అనుకునేవాడిని. కానీ అలా ఎప్పుడూ జరిగేది కాదు. అప్పట్లో నా దస్తూరీ బాగుండేది తప్ప రాతలో కోతలే ఎక్కువ ఉండేవి. కాబట్టే మార్కులూ తక్కువగా వచ్చేవి. ఫెయిలవకుండా ప్యాసవుతూ వచ్చానే తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేవు.

కామెంట్‌లు