మానసిక పరిపక్వత లేని వయసులో చేసే చేష్టలు, విధానాలు, చాలావరకు ఎదుటివారికి ఇబ్బంది కలిగించే విధంగానే ఉంటాయి .కానీ ఆ వ్యక్తి మరొక సందర్భంలో ఆనాటి సామాజిక కట్టుబాట్లను కాదని, వారు అవలంభిస్తున్న విధానం మంచో, చెడో అని తెలియకుండానే ...ఈ విధానమే ఎందుకు ... మరో విధంగా ఎందుకు చూడకూడదు ,అనే ఆలోచన కార్యరూపం దాల్చి, ఆ కొత్త విధానం ద్వారా కాలక్రమేనా ఏదో విధంగా లబ్ధి పొందిన వారి నుండి పొందే పొగడ్తలు తలుచుకుంటే మనసుకు చాలా హాయిగా ఉంటుంది.
అది నేను 5 ,6 వ తరగతులు చదువుతున్న రోజులు. అంటే దగ్గర దగ్గర 1967, 68 మధ్యకాలంలో. మాది అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గిద్దలూరు తాలూకాలో ఒక చిన్న గ్రామము. పేరుకు గ్రామం అయినప్పటికిని మా ఊళ్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పదిహేను నుండి ఇరవై వరకు ఒక మోస్తరు భూమి కలిగిన రైతు కుటుంబాలు, అన్ని రకాల కుల వృత్తుల వారు, (ఒక్క బ్రాహ్మణ కుటుంబం తప్ప) ముస్లిం, క్రిస్టియన్స్ మొదలగు వారు అందరూ ఉండేవారు .
ఇందులో క్రిస్టియన్ని వారు చేసే కుల వృత్తుల ఆధారంగా చర్మకారుడు అంటే మాదిగ అని, హరిజనులను మాల అని ,పిలిచేవాళ్ళు. ముఖ్యంగా ఈ రెండు తెగల వారిని నిమ్న జాతి గా భావించారో.. ఏమో కానీ ,వారిని ఊరికి బయట ఆ మూలకు ఒక తెగ, మరో మూలకు మరొక తెగ 10 ,15 కుటుంబాలు గా ఉండేవారు. కానీ రైతు కూలీలు ,రైతుల ఇళ్లలో పనిచేసే వారు , సంవత్సర జీవితానికి ఉండే జీతగాళ్లు అందరూ ఈ వర్గానికి చెందిన వారే. మా ఇళ్ల దగ్గరకు పనులకు వచ్చినప్పుడు బయటనే నిలబడేవారు .ఈ రెడ్డి సమాజానికి చెందిన పెద్ద రైతులు అందరూ వయసుతో సంబంధం లేకుండా వాళ్లందరినీ ఒరేయ్! అని ,అది ఇది అని సంబోధించేవారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు,పిల్లలందరు కూడా పేరు పెట్టి పిలువవలిసివస్తే పేరు చివరన గాడు ,అది ,అని తోక తగిలించే వారు . వాళ్లు పనులు చేసేటప్పుడు మంచినీళ్లు కూడా యజమానికి సంబంధించిన వారు ఎత్తునుండి పోస్తే దోసిలి పట్టి తాగేవాళ్ళు. జీతగాళ్లు భోజనం చేయడానికి విడిగా ఒక సత్తు పళ్లెము ,సత్తు గ్లాసు వాళ్లకి ఇస్తే వాటిని ఉపయోగించి తిరిగి వాళ్ళు అక్కడ పశువుల కొట్టంలో చూరు కింద భద్రపరచుకునే వాళ్ళు. కారణం ఆ వస్తువులను యజమాని పిల్లలు ముట్ట కూడదు అని ...ఈ కులస్తులు ఏదైనా బయట ఊళ్లకు పనుల నిమిత్తము గాని ,శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకుని రైతులకు ఎదురు పడకుండా పొలాల గట్ల వెంట వెళ్లేవారు .
అటువంటి దురాచారాలు ఉన్న ఊళ్లో స్కూల్ మాత్రము చర్చిలో క్రిస్టియన్ పిల్లల మధ్య ఉండేది. అది RCM స్కూల్ .అన్ని వర్ణాల కు చెందిన పిల్లలు ,అగ్ర కులస్తులు అనుకునేవారు కూడా తమ పిల్లలను ఈ స్కూల్ కే పంపేవారు. అలా అన్ని వర్గాల పిల్లలతో ఉన్న స్కూల్ కి వెళ్ళటం వలన ఏమో కాని ,నాకు చిన్నప్పటి నుండి ఈ సామాజిక అసమానత తప్పు కదా ...అనే బీజము ఆ లేత వయసులోనే నాటుకుంది .ఇలాంటి మానసిక సంఘర్షణల మధ్య నేను అప్పుడప్పుడు మా జీతగాడికి కేటాయించిన సత్తు పళ్లెము మరియు గ్లాసును ముట్టుకుంటూ ఎవరైనా చూస్తున్నారేమో అని అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆ గ్లాసులో, ఇంట్లో నుండి వేరే గ్లాస్ తో నీళ్లు తెచ్చి ఇందులో పోసుకుని తాగి ,నాకు ఏమీ కాలేదు కదా... అని అనుకుని దానిని తిరిగి యధాస్థానంలో పెట్టేవాడిని .
అప్పుడే ఇలాంటి ఆలోచనలతో ఉన్న మరొక విద్యార్థితో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. మా పొలాలు ,వాళ్ళ పొలాలు దగ్గరదగ్గరగా అవి కూడా ఈ మాల సమాజానికి చెందిన వాళ్ళ కాలనీ వైపు ఉండేవి .అప్పుడప్పుడు మేము ఇద్దరము పంట పొలాలను చూడాలనే నెపంతో అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకు వెళ్లి ముందుగా మంచినీళ్లు తాగి ఆ తర్వాత ఎప్పుడైనా భోజనం చేయాలని నిర్ణయించుకున్నాము. ఒక రోజు మధ్యాహ్నం ఇద్దరము మాకు రెగ్యులర్గా పొలం పనులకు వస్తూ మాతో సాన్నిహిత్యంగా ఉండే వాళ్ళ ఇంటికి వెళ్లి ,వారి మంచం మీద కూర్చుని మంచినీళ్లు ఇవ్వమన్నాము.వాళ్ళు అప్పుడు అయ్యా... మీరు ఇక్కడకు రాకూడదు ,మీ ఇల్లు ఇక్కడికి దగ్గరే కదా.. ఇంటికి వెళ్లి తాగండి ..అని వాళ్లు పదే పదే చెప్పినా, పట్టుబట్టి మేం వాళ్ళ గ్లాస్ తోనే వాళ్ళ నీళ్ళు తాగాము. ఒకరోజు ఆకలి లేకపోయినా ఆకలిగా ఉంది అని చెప్పి వాళ్ల గుడిసెలకు వెళ్లి వాళ్ళు తయారు చేసుకున్న సంకటి ,పచ్చడి పెట్టించుకుని తిన్నాము .అప్పుడు వాళ్ళు భయపడుతూ అందించినా వాళ్ళ కళ్ళలో దాగిఉన్న ప్రేమ, ఆప్యాయతలు ఇప్పటికీ నాకు గుర్తుకు వస్తున్నాయి.
తర్వాత వాళ్ళ కోరిక మేరకు ఈ విషయాలను ఎవరితో కూడా చెప్పలేదు. ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మా లేత మనసులకు బరువుగా అనిపించిందేమో గాని, అంతటితో మా ప్రయత్నాలు ఆగిపోయినా... నా ఆలోచనలు మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ వర్గాలకు చెందిన ఎందరో సంపన్నులై ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందుతూ ఉన్నారు.
వీరందరూ కూడా మన వాళ్లే కదా అనే భావంతో 17 సంవత్సరాల క్రితం మా అమ్మాయి వివాహ సందర్భంగా వాళ్ల ఇళ్లకు వెళ్లి శుభలేఖ అందించి, పెళ్లికి రమ్మని ఆహ్వానించినప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించిన ఆనందము , ఆప్యాయత.. ఎప్పుడైనా తలచుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది.
" విత్తే..వికసిస్తే.....
పువై పరిమళిస్తుంది !"
విత్తే ..వికసిస్తే ...!!:- -----బి.రామకృష్ణా రెడ్డి-సఫిల్ గూడ- సికింద్రబాద్ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి