బాల్య చాపల్యము తో చేసే కొన్ని తుంటరి పనుల యొక్క దుష్పరిణామం భావి జీవితం మీద పడకుండా ఉండాలంటే సరైన సమయంలో , సరైన మార్గంలో పెద్దల యొక్క పర్యవేక్షణ ఎంతో అవసరం .
నేను చిన్నతనంలో అంటే 7 నుండి 12 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నప్పుడు చాలా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడిని .నిలకడగా ఒకచోట ఉండకపోవడం, ఎవరెవరితోనో చిన్నచిన్న తగాదాలు పెట్టుకోవడం, వాటిని సరదాగా తీసుకొని అంతటితో మర్చిపోయి తిరిగి కలిసి పోవడం ...ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఇలా వీధుల్లోనూ ,పొలాల గట్ల వెంట పరుగెత్తుతూ ఉంటే నాకు "జింకపిల్ల "అనే ముద్దు పేరు పెట్టారు ఊర్లో పెద్దలు .ఇంటి పట్టున ఉండటం చాలా తక్కువ. కులమతాలతో సంబంధం లేకుండా తెలిసినవారి ఇళ్లలోకి స్వేచ్ఛగా వెళ్లి వారితో అవ్వా తాత ,చిన్నమ్మ చిన్నాన్న ,అక్క బావ, అంటూ వరసలు కలుపుకుని వాళ్ళ ఇంట్లో ఏదైనా వంటకాలు చేస్తే అడిగి పెట్టించుకునే వాన్ని.ముఖ్యంగా చేపల కూర ,సజ్జ రొట్టె అంటే చాలా ఇష్టం . అందరితో చనువుగా ఉండటం వల్ల తెలిసిన వారు,వాళ్ల ఇంట్లో ఏదైనా వంటకం చేస్తే దారిన వెళ్తున్న నన్ను మరీ పిలిచి పెట్టేవారు.
నాకు చిన్నతనంలో పాల మీద మందంగా కట్టిన మీగడ అంటే కూడా ఎంతో ఇష్టం .మాది రైతు కుటుంబం కావున ఎప్పటికీ రెండు, మూడు పాడి గేదలు ఉండేవి. ఆ రోజుల్లో ఎన్ని పాలు వచ్చినా అమ్మకం అనేది తెలియదు . అన్ని ఇంట్లోనే వాడుకోవటం ,లేదా పాలు లేని వారికి ఇవ్వడం జరిగేది. ఈ పాలను ఒక కుండలో పోసి వంట అయిన తర్వాత నిప్పుల సెగ మీద పెట్టి వేడి చేయడం వలన పాలు చిక్కగా తయారై మీగడ అరచేతి మందంతో మిలమిలలాడుతూ కనిపించేది .అమ్మ ఆ మీగడలో కొంత భాగం పిల్లలందరికీ భోజనాలప్పుడు కూరల్లో వడ్డించేవారు. అది సరిపోక నేను మిగిలిన మీగడను ఎవరూ లేనప్పుడు దొంగతనంగా తినేసి ,ఆ విషయాన్ని అమ్మ, అక్కలతో చెప్పేవాడిని .ఎందుకు తిన్నావు.. మందం చేస్తుంది కదా.. అని పప్పు గుత్తి లేదా తెడ్డు కర్రతో బెదిరిస్తూ ఉంటే వెనక పిల్లి వచ్చి పాలు తాగి పోతుంది ,అని అబద్ధం చెప్పడం, వాళ్ళు వెనక్కి తిరిగి చూసే లోపలే నేను తప్పించుకొని పరిగెత్తే వాడిని .
ఇదంతా నాణానికి ఒక ఒకవైపు. రెండో వైపు అతి చెడ్డ పాపపు పనులు. మా నాన్నగారికి బీడీలు తాగే అలవాటు మొదటి నుండి ఉండేది . ఆ అలవాటు ఆయనకు 65 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఉండేది. ఆయనకు బాధ్యతలు అయిపోయిన తర్వాత క్రమంగా ఆధ్యాత్మిక చింతనలో పడిపోయి ఈ అలవాటు నుండి పూర్తిగా బయటపడ్డారు. ఆయన ప్రతి నిత్యము ఎనిమిది లేదా పది బీడీలు వరకు కాల్చేవారు. ఎక్కువ మోతాదులో అవసరం కనుక ఇంట్లో ఎప్పటికీ ఒక బురుజు( అంటే దాదాపు 200 బీడీలు ఒక 15 ,20 కట్టలుగా అమర్చటం) ఉండేది.. అలాగే కొన్ని అగ్గిపెట్టెలు .వీటిని ఎప్పుడైనా టౌన్ కి వెళ్ళినప్పుడు మిగతా సరుకులతో పాటు తెచ్చుకునేవారు. ఆయన అలా బీడీలు తాగుతూ ఉంటే అది ఎలా ఉంటుందో అని, అది రుచి చూడాలని నాకు కుతూహలంగా ఉండేది .ఇంట్లో నుండి బీడీలు తీసుకుంటే ఎవరైనా కనిపెడతారని భయం.
ఆ రోజుల్లో అంగట్లో ఏదైనా వస్తువు కావాలంటే డబ్బుకు బదులు దాన్యం తీసుకొని కూడా ఇచ్చేవారు . అంటే వస్తుమార్పిడి అన్నమాట .అది వరి పంట కోసే సమయం. వడ్లు రాల్చిన తర్వాత వాటిని 4 ,5 రోజుల పాటు ఊరి బయట ఉన్న కళ్ళములో ఆరబెట్టే వారు . ఆ ధాన్యానికి కాపలాగా నేను అప్పుడప్పుడు పగటిపూట వెడుతుండే వాడిని. రాత్రికి నాన్న వచ్చి నన్ను ఇంటికి పంపేవారు. నాకు బీడీ రుచి చూడాలని కోరిక ఉంది కదా...! అందుచేత ఒకరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత మా పొలం పని చేసే వాళ్ళ అబ్బాయిని పిలిచి ,కొంత ధాన్యం అతనికి ఇచ్చి ఒక బీడీ కట్ట, ఒక అగ్గిపెట్టె మా నాన్నకు కావాలి అని చెప్పి తెప్పించాను .మా నాన్న వచ్చేలోపే వీటి పని పట్టాలని ఒక బీడీ వెలిగించి పొగ తాగటం మొదలు పెట్టాను .విపరీతమైన దగ్గు .అప్పట్లో పల్లెల్లో కరెంటు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు ఎవరైనా బీడీ వెలుతురు గమనిస్తున్నారేమోనని అక్కడ ఒక పెద్ద బుట్ట ఉంటే దాని లో కూర్చొని బీడీ కాల్చిన తర్వాత, ఛీ ఛీ... ఇదేం బాగోలేదని వాటన్నిటిని పక్కన పొలంలో మట్టి కింద కప్పి పెట్టేశాను .తర్వాత ఈ బాగోతం అంతా మా నాన్నగారికి ఎలాగో తెలిసిపోయింది. అప్పుడు ఆయన ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎద్దులను కొట్టే చర్నాకోలతో వాయించి ,ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు అని బెదిరించారు. అప్పటి నుండి ఈ నాటి వరకు వాటి వాసనకు కూడా పోలేదు.
అదే వయసులో ఒక దుర్మార్గపు పాపం పని కూడా చేశాను. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అనే మాట ఎంత వరకు నిజమో తెలియదు కానీ, ఈ చేసిన తప్పును నేను ఇంతవరకు ఎవరితోనూ సిగ్గువిడిచి చెప్పుకోలేదు. ఇప్పటికైనా బహిర్గతం చేస్తే ఈ ఆత్మన్యూనతాభావం కొంతవరకైనా తగ్గుతుందేమో అని అనిపించి ఇలా రాయటం జరిగింది. ఆ రోజుల్లో జంతువులు కూడా మనుషుల మాదిరిగానే అమాయకంగా ఉండేటివి అనుకుంటాను. ఊర్లో ఊర కుక్కలు ఎక్కువగా ఉండేవి. చిన్న పిల్లలు వాటి దగ్గరకు వెళ్లి వాటితో ఆడుకుంటున్నాఎటువంటి హాని చేసేటివి కావు. మా ఇంటికి ఎదురుగా ఉన్న రైతుకూలీ కొడుకు నాతో ఎక్కువ సన్నిహితంగా ఉండేవాడు .ఏ పనికైనా ఇద్దరం కలిసి వెళ్లేవాళ్లం .ఊరి బయట చెరువు గట్టుపై కుక్కలు తిరుగుతూ ఉంటే ఆ కుక్కలను నీళ్ళల్లోకి లాక్కెళ్లి వదిలిపెట్టే వారం. అవి ఈదుతూ బయటకు వస్తూ ఉంటే అది చూసి మేము సంబరపడిపోయి పోయే వారం .
ఒకసారి మాకు ఒక దురాలోచన వచ్చింది .ఇలా చెరువు మధ్యలో వదిలినా బయటకు వస్తున్నాయి, దీని మెడకు ఒక బండరాయి కడితే ఎలా వస్తుందో చూడాలి అని అనిపించి ,ఒక తాడుతో ఒక బండరాయిని దానికి నడుముకు కట్టి నీళ్లల్లో దూరంగా తీసుకెళ్లి వదిలి పెట్టాము.పాపం అది బయటకు రాలేక నీళ్ళల్లో మునిగి పోయింది .ఎంతకు అది బయటకు రాకపోవడంతో భయపడి ఇంటికి వచ్చేసాం. మరుసటి రోజూ ఆ చెరువు వైపు వెళితే ఎవరో ఆ చనిపోయిన కుక్కను ,ఆ బండరాయిని బయటకు తీసి ఈ పని చేసిన వాడిని నానా బూతులు తిడుతున్నారు .ఆ చిన్న వయసులోనే అది మహా పాపం అనిపించి సిగ్గుపడుతూ మౌనంగా ఇంటికి వచ్చేసాను .అప్పటి నుండి ఈ నాటి వరకు నాకు తెలిసి ఏ జీవికి హాని తలపెట్ట లేదు. బాల్యం అలాంటిదేమో !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి