రెండు కంచాలు: కంచనపల్లి వెంకట కృష్ణా రావు

  మన అలవాట్లు, మన ప్రవర్తనకు మనం ఉపయోగించే వస్తువులు కూడా స్పందిస్తాయని మన పెద్దలు చెబుతుంటారు.
         కొందరు ఆనందంగా ఉంటారు,వారి ఇళ్ళు ఎంతో కళగా కనబడటం చూస్తుంటాము.కొందరు వాడే వస్తువుల్లోకూడా వారి వ్యక్తిత్వం బయటపడుతూ ఉంటుంది!
         దీనికి సంబంధించిన కథే ఇప్పుడు చెప్పుకుందాం.
          సిరిపురంలో రాము,గోపి ఇద్దరు అన్నదమ్ములు. రామూకి అన్నీ మంచి అలవాట్లు, బట్టలు శుభ్రంగా ఉంచుకుంటాడు.ఆహారాన్ని శుభ్రంగా తింటాడు.మెతుకులు కంచం చుట్టూపోయడం,కొంత ఆహారాన్ని పారవేయడం వంటివి అస్సలు చేయడు!అదే గోపీ అయితే బట్టలు శుభ్రంగా ఉంచుకోడు,అన్నం తిన్నప్పుడు కంచం చుట్టూ మెతుకులు పడేస్తాడు.ఒక్కొక్కసారిఅవసరం ఉన్నదానికన్నా ఎక్కువ కలుపుకుని ఆహారాన్ని పారవేస్తుంటాడు! గోపీ తల్లిదండ్రులు,రాము గోపీకీ ఈ అలవాట్లు మార్చుకోమని ఎన్నోమార్లు చెప్పారు.అయినా గోపి తన అలవాట్లు మార్చుకోలేదు!
         ఈ విషయం ప్రస్ఫుటంగా వారు తినే కంచాల్లో కనబడుతుంది. రాము కంచం తోముతే తళతళలాడుతూ ఉంటుంది.అదే గోపీ కంచం ఎంత తోమినా దానిలో మెరుపు కనబడదు,ఎందుకంటే గోపి ఆహారం పారవేయడంవలన ఆ కంచంలో మెరుపు కనబడదు!అంటే ఆ కంచంలో ఆనందం లేదు!
          ఓ రోజు గోపీ కంచం రాము కంచంతో ఇలా అంది, "రాము అన్నం పారవెయ్యడు,కావలసినంత శుభ్రంగా తింటాడు! మరి నాలో(కంచంలో) తినే గోపి ఆహార పదార్థాలు పారవేస్తాడు, 'అన్నం పరబ్రహ్మ స్వరూపం'అనే సూక్తి గుర్తు పెట్టుకోడు. అతని చెడ్డ అలవాటు వలననాలోమెరుపు లేదు"అని దిగులుగా చెప్పింది గోపీ కంచం.
          "ఏమో,అతనిలో మార్పు వస్తుందేమో చూద్దాం,కొందరుతమ తప్పు తెలుసుకుని మారుతారు" అని మెరుస్తూ చెప్పింది రాము కంచం.
       ఇలా ఉండగా ఒక రోజు వాళ్ళింటికి వీరాస్వామి అనే బంధువు వచ్చాడు. ఆయన పెళ్ళిళ్ళకు,శుభకార్యాలకు భోజనాలు,విందులు అమర్చిపెట్టే వృత్తిలో ఉన్నాడు.
          వీరాస్వామి కూడా రాము,గోపీ తో భోజనానికి కూర్చున్నాడు,ఆహార పదార్థాలు ఎంతో రుచిగా ఉన్నాయి.రాము ఆహార పదార్థాలు పారవేయకుండా చక్కగా,శుభ్రంగా తిన్నాడు.అదే గోపి తన అలవాటు ప్రకారం కంచం చుట్టూ మెతుకులు పోసి, కొంత కూర,పచ్చడి వదలి వేశాడు!
       గోపీ తినే విధానాన్ని వీరాస్వామి నిశితంగా గమనించాడు.
        భోజనాలు అయ్యాక,వీరాస్వామి గోపీతో ఈ విధంగా చెప్పాడు.
        "చూడు గోపి,ఆహార పదార్థాలు రుచిగా ఉన్నా ఎందుకు పారవేశావు? రోజూ ఇలాగే పారవేస్తుంటావా?"అని అడిగాడు.
        "అవును, మా తమ్ముడికి ఆ అలవాటు ఉంది"అని రాము చెప్పాడు.
           "తప్పు బాబు, అన్నంగాని,ఏ ఆహార పదార్థాలు గానీ పారవేయకూడదు,అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆహారం దేవుడి రూపం,అది తృప్తిగా తింటేనే కదా మనకు శక్తి,జ్ఞానం వచ్చేది.రేపు ఈ ఊరిలో ఒక పెళ్ళి ఉంది ,దానికి మేమే విందు భోజనాలు వడ్డిస్తున్నాము.నీవు నాతో ఆ పెళ్ళికిరా,నీకునేను కొన్ని దృశ్యాలు చూపిస్తాను"అని చెప్పాడు వీరాస్వామి.
        "సరే,వస్తాను మామయ్యా"అని చెప్పాడు గోపి.
      రెండోరోజు వీరాస్వామితో గోపి ఆపెళ్ళికి వెళ్ళాడు.భోజనాలు చేసే హాలులో'అన్నం పరబ్రహ్మ స్వరూపం,దయచేసి పదార్థాలు పారవేయకండి,కావలసినంత తృప్తిగా తినండి' అనే ఫ్లెక్సి బోర్డులు ఉన్నాయి.
     భోజన సమయానికి అందరూ వచ్చి కూర్చున్నారు,ఎన్ని ఫ్లెక్సి బోర్డులు పెట్టినా కొంత మంది వేయించుకున్న స్వీట్లు,కొన్ని పదార్థాలు పారవేశారు! చాలామంది మటుకు అర్థం చేసుకుని చక్కగా కావలసినంత మాత్రమే వేయించుకుని శుభ్రంగా తిన్నారు.వారందరూ తిన్నాక వారి విస్తళ్ళు శుభ్రంగా కనబడ్డాయి.అదే పదార్థాలు వదిలేసిన వారి విస్తళ్ళు వదిలేసిన పదార్థాలతో వికృతంగా కనబడ్డాయి! 
         "చూడు గోపీ,పదార్థాలు ఎలా పారవేశారో,వారి పద్దతి బాగలేదు కదా!"అన్నాడు వీరాస్వామి.
          మిగిలి పోయిన పదార్థాలు, పారవేసిన పదార్థాలతో ఆకులు వికృతంగా కనబడి,తాను పారవేస్తున్న పదార్థాలు గుర్తుకు వచ్చాయి!
        అంతా అయ్యాక, గోపీని వీరాస్వామి కల్యాణ మంటపం బయటకు తీసుక వెళ్ళాడు అక్కడ కొంత మంది బీదవారు గిన్నెలు,సంచీలు పట్టుకుని నిలబడి బేలగా భోజనశాల వైపు చూస్తున్నారు.
        "చూశావా,గోపీ ఎంతోమంది అన్నం లేక ఆకలితో అలమటిస్తూ,మన దగ్గర మిగిలి పోయిన భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు.అందుకే మనం అన్నం, పదార్థాలు పారవేయకూడదు.ఎంతోమంది ఆహార పదార్థాలు వృధా చేస్తుంటారు,అవి మిగిల్చి ఆకలితో ఉన్న బీదవారికి పెడితే తృప్తిగా తింటారు కదా!ఒకరి ఆకలి తీర్చడం లోగల ఆనందం ఎందులో వస్తుంది? సోమాలియా వంటి దేశాల్లో ఆహారం లేక పెద్దలు,పిల్లలు ఎంతోమంది చనిపోతున్నారు. 
దేవాలయాల్లో,ఆశ్రమాల్లో ఎంతోమందికి ఉచిత భోజనం పెట్టి ఆకలి తీరుస్తుంటారు.ఇవన్నీ చూశాక నీవు ఏమి అనుకుంటున్నావు?"అని గోపీని అడిగాడు వీరాస్వామి.
        "మామయ్యా, నాకు పరిస్థితి అర్థం అయింది,ఇక మీదట నేను కూడా అన్నం పారవేయను,కావలసినంత మాత్రమే తింటాను,శుభ్రత పాటిస్తాను"అని తృప్తిగా చెప్పాడు.గోపీలో కలిగిన మార్పుకి వీరాస్వామి సంతోషించాడు.ఇద్దరూ శుభ్రంగా పెళ్ళి భోజనం చేశారు.
        ఆ రోజునుండి గోపి శుభ్రంగా తినడం వలన గోపీ కంచం తోముతే చక్కగా మెరుపు వచ్చింది!
      "నేను చెప్పలా,గోపీలో ఒక రోజు తప్పక మార్పు
వస్తుందని"అన్నది రాము కంచం సంతోషంగా.
    గోపీలో కలిగిన మార్పుకి ఇంట్లో అందరూ సంతోషించారు.
కామెంట్‌లు