*వరద (వాస్తవ కథ)* డా.ఎం.హరికిషన్-కర్నూలు- 9441032212

  అద్దె ఇంటి కోసం సీక్యాంపు, వెంకటరమణ కాలనీ, కొత్తబస్టాండు పరిసర ప్రాంతాలలో వీధి వీధీ తిరుగుతున్నాడు వెంకటరెడ్డి . కానీ ఎక్కడా ఖాళీల్లేవు. అసలు చాలా ఇళ్ళు తాళాలేసి వున్నాయి. ఎప్పుడూ మనుషుల రాకపోకలతో గందరగోళంగా వుండే వీధులన్నీ గత మూడు రోజులుగా బోసిగా, నిశ్శబ్దంగా వున్నాయి. చాలా చోట్ల చాలామంది తనలాగే అద్దెఇళ్ళ కోసం వెదుకుతూ ఎదురుపడుతున్నారు.
వెంకటరెడ్డికి తిరిగీ తిరిగీ నీరసం వస్తూ వుంది. ఊరికి పోదామా అంటే అక్కడ వున్న ఇల్లు పడిపోయింది. ఇక్కడ వుందామా అంటే ఎక్కడా అద్దె ఇల్లు దొరకడం లేదు. ఊరిలో అందరి పరిస్థితి ఇలాగే వుంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందిస్తున్న సహాయం కోసం గ్రామస్తులంతా ఉదయమే ఊరు చేరుకొని, సాయంకాలం వరకూ ఎదురుచూస్తూ, దొరికింది చేజిక్కించుకుంటూ చీకటి పడే సమయానికి తిరిగి కర్నూలుకో, బంధువుల వూర్లకో, సహాయశిబిరాలకో చేరిపోతున్నారు. ఊరిలోకి ఏదయినా వాహనం వస్తే చాలు జనాలు ఎక్కడికక్కడ ఎగబడి, ఒకరినొకరు దొబ్బుకుంటూ, అరుచుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ వున్నారు. వెంకటరెడ్డికి అదంతా చాలా ఇబ్బందిగా అనిపించి ఊరికి పోవడమే మానేశాడు.
అసమయం మధ్యాహ్నం మూడవుతూ వుంది. ఉదయాన్నించీ తిండి లేక ముఖమంతా పీక్కుపోయింది. కడుపులో పేగులు అరుస్తూ వున్నాయి. నెమ్మదిగా పాతబస్టాండ్‌ వైపుకి ప్రయాణం మొదలుపెట్టాడు.
వెంకటరమణకాలనీ దాటగానే జాగ్రత్తగా పంచ పైకెగ్గట్టి నడవసాగాడు. రోడ్ల నిండా ఎక్కడ చూసినా ఒకటే బురద. అడుగు తీసి అడుగు వెయ్యడం చాలా కష్టంగా వుంది. ఇండ్లలోంచి, షాపుల్లోంచి బైట పడేస్తున్న ఆహార పదార్థాలతో, చచ్చిన జంతువుల కళేబరాలతో వీధులన్నీ కుళ్ళి కంపు కొడుతున్నాయి. ఏ ఇంటిలో చూసినా ఒకటే దృశ్యం. ఏ వీధిలో చూసినా ఒకటే రోదన. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్ళు లేవు. వుండడానికి వసతి లేదు. ఫ్యాన్లు, టీవీలు, మిక్సీలు, బోర్లు, బండ్లు, కార్లు... సర్వం బురదమయమై, ఇండ్లలోని ఫర్నిచరంతా నాని, ఉబ్బి, తలుపులు, కిటికీలు ఎక్కడికక్కడ ఊడి వస్తుంటే, జీవిత కాలమంతా పైసాపైసా దాచిపెట్టుకొని కొన్న వస్తువులు కళ్ళ ముందే బురదలో కూరుకుపోయి వుంటే... వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా బాగు చేసుకోవాలో తెలీక నిస్సహాయంగా కన్నీరు విడుస్తూ వున్నారు. రోడ్లు, కాలువలు అన్నీ బురదతో నిండిపోయి బాత్‌రూంలు, సెప్టిక్‌ ట్యాంకులు వెనక్కి తంతూ వున్నాయి. గోడలు చెమ్మపట్టి ఆరడం లేదు. కొందరు బురదతో నిండిన బట్టలు, సామాన్లు ఆటోలకు వేసుకొని శుభ్రం చేసుకోవడానికి నీళ్ళున్న ప్రదేశాలకు వెళుతూ వున్నారు. మరికొందరు నీళ్ళు లేక, కరెంటు లేక ఎలా ఆ బురదను తొలగించుకోవాలో అర్థంకాక, రోజురోజుకీ పెరిగిపోతున్న అంటువ్యాధులకు భయపడి ఇళ్ళను అలాగే వదిలేసి తాళాలేసుకొని బంధువుల ఊర్లకు వెళ్ళిపోతున్నారు.
వెంకటరెడ్డి అదంతా చూస్తూ ముందుకు పోతుంటే ఒకచోట కొందరు అన్నం పొట్లాలు తెచ్చి పంచుతూ కనబడ్డారు. అది చూడగానే ఒక్కసారిగా ఆకలి పెరిగిపోయింది. భోజనం వేళ దాటిపోవడంతో పెద్దగా ఎవరూ లేరు. చాలామంది జనాలు కంపు భరించలేక ముఖాలకు కర్చీఫులు కట్టుకొని తిరుగుతున్నారు. వెంకటరెడ్డి అటూ ఇటూ చూశాడు. తెలిసినవాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఎందుకయినా మంచిదని ముఖం కనబడకుండా తువ్వాలును మొహానికి అడ్డంగా కట్టుకొని వరుసలో నిలబడి ఒక ప్యాకెట్‌ అందుకున్నాడు. దూరంగా ఎవరూ లేని చోటకు చేరి ఒక చెట్టు కింద కూర్చొని పొట్లం విప్పాడు. అన్నం తింటూ వుంటే మూడురోజుల కిందట గాంధీజయంతి రోజున జరిగినదంతా గుర్తుకు రాసాగింది.
సుంకేసుల గేట్లు ఎత్తేస్తున్నారని, తుంగభద్రకు వరద నీరు వస్తుందని, దిగువ ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని దండోరా వినేసరికి ఊరంతా ఒకటే గందరగోళం, హడావుడి. నీళ్ళు ఎంతవరకు వస్తాయి, ఎవరి పొలాలు వుంటాయి, ఎవరివి మునుగుతాయి అని ఒకటే చర్చలు. కొందరు మేతకు పోయిన పశువులను పట్టుకోనొచ్చి ఇండ్ల దగ్గర కట్టేస్తున్నారు. వెంకటరెడ్డి గాసగాన్ని తీసుకొని పొలానికి పోయాడు. పిల్ల పెళ్ళి చేయాలనే ఉద్దేశ్యంతో మూడు ఎకరాల సొంత పొలంతో బాటు, ముందస్తుగా గుత్త చెల్లించి ఇంకో ఐదు ఎకరాల్లో వరి వేశాడు. పొలమంతా నిండుగా కళకళలాడుతూ వుంది. ఇంకో నెల దాట్తే చాలు పంట చేతికొచ్చేస్తాది. ఎందుకయినా మంచిదని వెంకటరెడ్డి పొలంలోని రెండు మోటర్లు ఇప్పించి ఇంటికి చేర్పించాడు.
ఉదయం పదయ్యేసరికి నెమ్మదిగా గ్రామ శివార్లలోకి నీళ్ళు రావడం మొదలయ్యింది. కింది గేర్లలో ఒకటే ఆందోళన. ''రేయ్‌... ఎంతొచ్చినా... చింతతోపు కాడున్న రంగన్న పొలం వరకేలేరా'' అన్నాడు ఒక పెద్దమనిషి ఆ హడావుడి అంతా చూస్తూ. కానీ అతను ఆ మాటన్నంతసేపు పట్లేదు నీళ్ళు ఆ పొలం దాటడానికి. పచ్చని పంటపొలాలను మింగుతూ నీరు ఊరికి దగ్గర కాసాగింది. నిమిష నిమిషానికి ఎప్పుడూ ఊహించని చోట్లకి చాలా వేగంగా చేరిపోతూ వుంది. దిగువ ప్రాంతాల్లోని ప్రజలు చాలామంది ఇండ్లకు తాళాలేసుకొని, బండ్లు కట్టుకొని, ట్రాక్టర్లేసుకొని నగరానికి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు.
చూస్తుండగానే నీళ్ళు కర్నూలుతో ఊరిని కలిపే తారురోడ్డు మీదకి ఎక్కి పారడం మొదలయ్యింది. అది చూసి వెంకటరెడ్డి కొడుకు ''నాన్నా... రోడ్డు పూర్తిగా మునగకముందే మనంకూడా బండ్లు కట్టుకొని బైటపడ్డం మేలు'' అన్నాడు. ఆ మాటలు విన్న ఒక ముసిలోడు నవ్వుతూ ''ఏం కాదులేరా... ఎన్ని చూళ్ళా ఇట్లాంటివి. మాతాత చెప్పినాడు ఒకసారి... దాదాపు వందేళ్ళ కిందట ఊరి బైట సుంకులమ్మ గుడి మునిగి గోపురం కనబడిందంట. ఊరంతా మిట్టమీదికి అదే ఇప్పుడు కొత్తగా బిల్డింగులు కట్టినారు చూడు అక్కడికి చేరి ప్రాణాలు కాపాడుకున్నారంట. మేం ఆయన నోట వినడమే తప్ప పుట్టి ఇంతవరకూ అట్లాంటి వరదను ఎప్పుడూ చూల్లేదు. ఎంతొచ్చినా సుంకులమ్మ గుడి మెట్లకాడికే'' అన్నాడు.
ఆ మాటలతో జనాలకి ఏదో ధైర్యం. అయినా ఎందుకయినా మంచిదని వెంకటరెడ్డి పరుగులాంటి నడకతో ఇంటికి చేరి ''ఏమే... నేను నీళ్ళు ఎంతవరకు వస్తున్నాయో చూసొస్తా... నువ్వు సామానంతా అటకలమీదకు చేర్చు'' అంటూ భార్యా బిడ్డలతో చెప్పి బైలుదేరాడు.
''నాన్నా... నేనూ వస్తా'' అంటూ వద్దన్నా వినకుండా కొడుకు వెంట నడిచాడు.
వెంకటరెడ్డి భార్య సుజాత కూతురుతో కలసి ఒక్కొక్క సామానే పైన పెట్టసాగింది. గంట గడిచిందో లేదో కొడుకు గసబెడుతూ పరుగెత్తుకుంటూ వచ్చి ''అమ్మా... మన పొలంలోకి నీళ్ళు వచ్చేసినాయంట'' అన్నాడు వగరుస్తూ...
ఆమాటినగానే సుజాత కాలూ చేయీ ఆడలేదు. చేస్తున్న పని ఆపి అలాగే గోడకు చేరగిలపడింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పెట్టిన పెట్టుబడి, ఎరువుల దుకాణంలో అప్పులు, పిల్ల పెండ్లి గుర్తుకు వచ్చి కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది.
''ఏమయిందే... ఏమట్లా ఏడుస్తా వున్నావు'' మంచమ్మీద నుంచే అత్త గట్టిగా అడిగింది. చెప్పడానికి ఆసక్తి లేక, చెప్పే ఓపిక లేక సుజాత అలాగే నేలమీద వాలిపోయింది.
అంతలో వెంకటరెడ్డి పంచ పైకెగ్గట్టి వురుక్కుంటా లోపలికి వచ్చాడు. కింద వున్న భార్యని చూసి ''లెయ్‌... లెయ్‌... ఏమట్లా పడుకున్నావు. అవతల నీళ్ళు బోయగేరి దాట్నాయి. మనింటికాడికి రావడానికి వుండేది నాలుగు సందులే. లే... లేసి అమ్మను, పాపను తీసుకొని మిట్టమీది మునిరెడ్డి ఇంటికి పో. ఈ నీళ్ళను చూస్తుంటే ఇప్పట్లో ఆగేటట్టు లేవు'' అంటూ కొడుకుతో కలసి ఎరువుల సంచీలు, విత్తనాల సంచులు, సంవత్సరానికి సరిపడా దాచిపెట్టుకున్న ధాన్యం అటకల మీదకు ఎక్కించసాగాడు. సుజాత నిర్లిప్తంగా అత్తను చేయి పట్టుకొని లేపి, కూతురితో బిల్డింగుల వైపుకి దారి తీసింది.
వెంకటరెడ్డి సామాన్లు పైకి సర్దుతుండగానే కాళ్ళ కింద చల్లగా అనిపించింది. చూస్తే ఇంటి గడపమాను దాటి నీళ్ళు లోపలికి దుంకుతూ వున్నాయి. ఏం చేయాలో తోచలేదు. కొడుకుతో ''రేయ్‌... నువ్వు పోయి అమ్మ దగ్గరుండు. నీళ్ళు చూద్దామని అటూ యిటూ ఎక్కడికీ కదలొద్దు. జాగ్రత్త'' అరటూ హెచ్చరించి బైటకు పంపాడు.
ఇంట్లో సామాన్లు ఏమీ కొట్టుకుపోకుండా గబగబా కిటికీలేసి, ఇంటి వెనుక వున్న తలుపు లోపల గడ పెట్టేసి, దానికడ్డంగా బీరువా జరిపి, వురుక్కుంటూ ముందుకొచ్చేసరికి నీళ్ళు మోకాలు లోతుకు వచ్చేశాయి. వరద పెరుగుతున్న వేగం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. తలుపులు రెండూ లాగి తాళమేశాడు. అంతలో ఇంటి వెనుక నుంచి యెద్దుల అరుపులు వినబన్నాయి. వేగంగా వెనుకనున్న గాటిపాడుకి చేరాడు. పోయిన సంవత్సరం తర్తూరు తిరుణాలలో కొత్తగా కొన్న ఎద్దులు.... భయపడి గింజుకుంటున్నాయి. ఒక్కుదుటున నీళ్ళలోకి చేయి పెట్టి గుంజకు కట్టిన దుసిముడి లాగాడు. పగ్గాలు చేత పట్టుకొని రోడ్డు మీదకు లాక్కొచ్చాడు. రోడ్డంతా జనాలతో, పశువులతో గందరగోళంగా వుంది. ఆడోళ్ళు పిల్లలను సంకనేసుకొని, ముసిలోళ్ళని చేయి పట్టుకొని పరిగెత్తుతూ వుంటే, మొగోళ్ళు, యువకులు ఇండ్లలోని సామాన్లను, పశువులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ వున్నారు. నడవలేని వాళ్ళను కొందరు ఎత్తుకొని వురుకుతున్నారు.
వెంకటరెడ్డి ఎద్దులను తోలుకుంటూ మిట్ట మీది బిల్డింగులకు దారి తీశాడు. ఊరికి అదే అన్నింటికన్నా ఎగువ ప్రదేశం. అప్పటికే చాలా మంది ముసలీముతకా అక్కడికి చేరుకున్నారు. అంతా గందరగోళంగా వుంది. గబగబా మునిరెడ్డి ఇంటి ముందున్న గుంజకు ఎద్దులను కట్టేసి తిరిగి ఇంటివైపుకు పరిగెత్తాడు.
అప్పటికే ఇల్లు సగం నిండిపోయింది. నీళ్ళు కిటికీలను తాకుతూ వున్నాయి. చూస్తూండగానే నిమిష నిమిషానికీ నీళ్ళు పెరుగుతూ... కిటికీలు దాటేశాయి. వెంకటరెడ్డిలో ఆందోళన పెరిగిపోసాగింది. ద్వారబంధం దగ్గర ఆగినా సుంచుల మీదున్న ధాన్యం బస్తాలు, ఎరువుల బస్తాలు మిగులుతాయనుకున్నాడు. కానీ... నీళ్ళు ఆగడం లేదు. చూస్తుండగానే సుంచులు దాటేశాయి. ఇంటి పైకప్పుకు ఎక్కేశాయి. పైన కనబడుతున్న పొగగొట్టం గూడా దాటేసి కళ్ళ ముందే మొత్తం మునిగిపోయింది. తరతరాలుగా తన తాతల కాలం నుంచీ వస్తున్న ఇల్లు. ఈసారి పంట పండి డబ్బులొస్తే మట్టిమిద్దె పడగొట్టి కొత్తది కట్టించుకోవాలనుకున్నాడు. వెంకటరెడ్డి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. విచారంగా మునిరెడ్డి ఇంటివైపుకు బైలుదేరాడు. కనుచూపుమేర చుట్టూ నీళ్ళతో దీవిలా వుంది.
జనాలంతా మిద్దెలు ఎక్కుతూ వున్నారు. ఎంతవరకు వస్తాయో, ఎప్పుడు ఆగుతాయో ఎవరికీ అర్థం కావడంలేదు. ముసిలోళ్ళ అంచనాలు, అనుభవాలు అన్నీ తారుమారయిపోతున్నాయి. నీళ్ళు నెమ్మదిగా కొత్త బిల్డింగుల్లోకి ప్రవేశించాయి.
వెంకటరెడ్డి మునిరెడ్డి ఇంట్లోకి అడుగుపెట్టాడు. అక్కడ అప్పటికే చాలామంది మూగబడి వున్నారు. బియ్యం, బ్యాళ్ళూ, మంచాలు, చాపలు ఇంటి మీదికి చేరుస్తూ వున్నారు. మరోపక్క చీకటి పడుతూ వుంది. కరెంటు లేదు. పెళ్ళాం బిడ్డల్ని తీసుకొని పైకి చేరుకున్నాడు. అందరి ముఖాల్లోనూ ఒకటే ఆందోళన. ఏడుపులు...
చుట్టూ వున్న ఇళ్ళ మీద నుంచి ఒకటే అరుపులు. నీళ్ళింకా పెరుగుతూనే వున్నాయి. ఇళ్ళు మునిగితే ఎలా.... ఎక్కడా మిద్దెలు లేవు. ఎలా తప్పించుకోవాలి. అందరిలోనూ ఒకటే భయం. నీళ్ళు పెరిగీ పెరిగీ ఆఖరికి కప్పుదాకా వచ్చి ఆగిపోయాయి. కేవలం ఒకడుగు. చావుకీ, బతుక్కీ మధ్య. జనాలు ఆశా నిరాశల్లో వూగుతూ వున్నారు. చుట్టూ చీకటి. మధ్యలో ఒక లాంతరు అంటించి పెట్టారు. అక్కడక్కడ ఇళ్ళ మీద లాంతరు వెలుగులు, అస్పష్టంగా కొన్ని ఆకారాలు కనబడుతున్నాయి. సమయం తొమ్మిదవుతూ వుంది. అప్పుడప్పుడు ఏవో ఇళ్ళు కూలిపోతున్న శబ్దాలు వినవస్తూ వున్నాయి. వెంకటరెడ్డి మునిరెడ్డి పక్కకి చేరి కూర్చున్నాడు. ఇద్దరి మధ్యా మాటల్లేవు.
సెల్‌ఫోన్లు ఎవరివో ఒకరివి వరుసగా మోగుతూ వున్నాయి. ఎక్కడెక్కడి నుంచో బంధువులు, స్నేహితులు ఆదుర్దాగా క్షేమసమాచారాలు విచారిస్తున్నారు. దాంతోపాటు టీవీలు చూస్తూ వివరాలు అందిస్తున్నారు. ''కర్నూల్లో కొండారెడ్డి బురుజు సగందాకా మునిగిపోయిందని... సుంకేసుల, గాజులదిన్నె డ్యాంలు పగిలిపోయాయని... రాజోలి, మంత్రాలయం, అలంపూరు జలసమాధి అయ్యాయని... ఏవేవో వార్తలు, భయాన్ని మరింతగా పెంచుతూ.
''అయిపోయింది. అంతా అయిపోయింది. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. కొండారెడ్డి బురుజు మీద కాకి కూచోని నీళ్ళు తాగే రోజొస్తుందని. ఏం చేయలేం. కలియుగం అంతమయిపోయే రోజొచ్చేసింది'' ఒక ముసలోడు గొణిగాడు.
ఆ మాటల్తో అందరి మనసుల్లోనూ ఒకటే భయం. ఒకటే ఆలోచన.
అసలు బతుకుతామా.... రేపు ఉదయాన్ని చూడగలమా...
పొలాలు, ఇళ్ళు, అప్పులు ఏవీ గుర్తుకు రావడం లేదు.
చావు భయం అందరినీ కమ్మేసింది.
సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌ అయిపోతున్నాయి. కొన్ని నెట్‌వర్క్‌లు పనిచేయడం ఆగిపోయాయి. ప్రపంచంతో వున్న చివరి సంబంధం గూడా తెగిపోతూ వుంది.
చుట్టూ నీళ్ళ హోరు...
చావు నిర్ణయమయినప్పుడు, సర్వమూ ఎదురు తిరుగుతున్నట్లు, ఏమీ సహకరించనట్లు అంతా నిశ్శబ్దం. ఒకరితో ఒకరు పంచుకోలేని ఆందోళన. ఒకొక్క నిమిషం నెమ్మదిగా గడుస్తూ వుంది. రాత్రి పది దాటిపోయింది. ఆకలవుతూ వుంది గానీ ఎవరికీ తినాలనిపించడం లేదు. మెడ మీద వేలాడుతున్న కత్తిలా నీళ్ళు అలాగే నిలకడగా వున్నాయి. ఎక్కడెక్కడి భూమిని కోసుకుంటూ, తనలో కలుపుకొంటూ... నీళ్ళు నల్లని రంగులో సుడులు తిరుగుతూ పరుగులు పెడుతున్నాయి. పెద్దపెద్ద చెట్లు, చనిపోయిన పశువులు, కళ్ళాల్లోని గడ్డివాములు, ఇండ్లలోని సామాన్లు... సర్రున కొట్టుకుపోతున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీళ్ళే. అల్లకల్లోలమయిన సముద్రం మాదిరి వుంది.
రాత్రి పదకొండు కావస్తోంది.....మరోగంట భారంగా గడిచింది.....
అంతలో వెంకటరెడ్డి ఫోను మోగింది.
''రేయ్‌... వెంకా... నేను మీ చిన్నాయనను. హైదరాబాదు నుండి ఫోన్‌ చేస్తున్నా... ఎక్కడున్నావ్‌'' అంటూ పలకరించి ''రేయ్‌... జాగ్రత్త... పన్నెండు దాటితే కర్నూలు అస్సలు వుండదంట. నీళ్ళు ఏ నిమిషంలోనైనా మరింత పెరుగుతాయంట. టీవీలో పదేపదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి గూడా చేతులెత్తేసినాడు. జాగ్రత్త.... ఏమాత్రం అవకాశం దొరికినా...'' చెబుతుండగానే ఫోన్‌ కట్టయింది.
అంతలో మెసేజ్‌ల మీద మెసేజ్‌లు. అందరి ఫోన్‌లకు.
''ఊరు విడిచి పారిపోండి''
''ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోండి''
''అర్ధరాత్రి దాటితే కర్నూలు జిల్లానే వుండదు''
''ఏ మాత్రం అవకాశం దొరికినా పారిపోండి''
''ఇళ్ళ మీద వుండొద్దండి.. వేగానికి కూలిపోతాయి.''
ఒక్కసారిగా ఇళ్ళ మీద అలజడి. అందరికీ మెసేజ్‌లు అందుతున్నట్టున్నాయి. ఇంత రాత్రిపూట రాష్ట్రం మొత్తం మేలుకొని నలుమూలల నుండి మెసేజ్‌లు పంపుతున్నారంటే... మొత్తానికి ఏదో జరగబోతుందని తెలిసిపోతూ వుంది.
వెంకటరెడ్డి మనసంతా ఒకటే గందరగోళం...ఎలా తప్పించుకొనేది. కింద చూస్తే మునిగిపోయేంత నీళ్ళు. ఈదుకుంటూ పోదామంటే గడ్డ ఎక్కడుందో గూడా తెలియడం లేదు.
ముసలిదయి అడుగు తీసి అడుగు వేయలేని తల్లి... ఈదటం చేతగాని భార్యా, కూతురు... రెక్కలింకా బలం పుంజుకోని కొడుకు... వీళ్ళందరితో ఎలా...
ఒక్కన్ని తప్పించుకుంటే....ఛ.... ఛ... ఇంత బతుకూ బతికి ఇదేం ఆలోచన...
చచ్చినా.... బతికినా.... అంతా కలిసికట్టుగానే.
అంతలో దూరంగా ఒక పెద్ద మొద్దు కొట్టుకొస్తూ కనిపించింది. అది దగ్గరకు రాగానే అంతవరకూ మౌనంగా చూస్తున్న సుంకన్న ఎగిరి దబ్బుమని నీళ్ళలోకి దుంకాడు. ''రేయ్‌... వద్దురా... గడ్డ ఎక్కడుందో తెలీదురా'' అంటూ గట్టిగా అరుస్తున్నా వినకుండా గబగబా ఆ మొద్దును చేరుకొని దానిపైన ఎక్కేశాడు. ప్రవాహంతోపాటు ముందుకు పోతూ చీకటిలో కలిసిపోయాడు.
అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం.
''శ్రీశైలం డ్యాం తెగితే తప్ప మనం బ్రతికి బయటపడలేంరా'' మునిరెడ్డి నిర్వేదంగా అన్నాడు.
''అసలు ఏం జరుగుతోంది..... నీళ్ళు వెనక్కి తన్ని ఊళ్ళకు ఊళ్ళు మునిగిపోతా వుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తా వుంది... పైన ఎంత వాన పడుతుంది. ఎంత వరద వస్తుంది. ఎప్పుడు ఎన్ని గేట్లు ఎత్తాలి, జనాల్ని ఎట్లా కాపాడాలి... అనే ప్రాథమిక విషయాలు గూడా తెలీనప్పుడు ఆనాకొడుకులకు ఉద్యోగాలెందుకు? జీతాలెందుకు? వున్నవి నిర్వహించడమే చాతగానప్పుడు మరలా అడుక్కొక్కటి చొప్పున కొత్తవెందుకు'' అన్నాడు ఒకడు ఉక్రోషంగా...
కర్నూలు నుంచి వచ్చి అక్కడే వరదలో చిక్కుకుపోయిన ఇంకొకతను ''నువ్వు చెప్పింది కరెక్టన్నా... రెండు సంవత్సరాల కిందట్నే కర్నూలు మధ్యలో ప్రవహిస్తూ తుంగభద్రలో కలిసే హంద్రీనదికి... గాజులదిన్నెడ్యాంలో ఒక్కసారిగా గేట్లు ఎత్తేస్తే... వరదొచ్చి దాని దెబ్బకు కర్నూలు పావు భాగం సర్వనాశనమైపోయింది. ఆ రోజు తుంగభద్రకు నీళ్ళు లేవు. అదే తుంగభద్రకు నీళ్ళుండి హంద్రీ గనుక ఇలా ఉప్పొంగితే... ఆ వరద నీళ్ళు ఎటూ పోలేక వెనక్కి వస్తే... అసలు కర్నూలు వుంటుందా.... అని అప్పుడే సందేహం వచ్చింది. అడుగడుగునా ఆక్రమణలకు గురయి కుంచించుకుపోయిన హంద్రీకి, తుంగభద్రకు సేఫ్టీవాల్‌ కట్టాలనే ప్రతిపాదనా వచ్చింది. కానీ రెండు సంవత్సరాలు దాటినా ఎక్కడి గొంగళి అక్కన్నే.... ముఖ్యమంత్రుల నుంచి, కార్పొరేటర్లదాకా సందు దొరుక్తే చాలు ఎక్కడ ఎట్లా నొక్కేయాలనే గానీ, ప్రజల బాధలు ఏనాకొడుకుకైనా పడుతుంటే గదా''
ఆ మాటల మధ్యలోనే ''అన్నా.... నీళ్ళు తగ్గుతున్నాయి'' గుంపులోంచి ఒకడు గట్టిగా అరిచాడు.
అందరూ మాటలాపేసి ఒక్కసారిగా అటువైపు తలతిప్పారు. వాడు టార్చిలైటు ఇంటికెదురుగా వున్న ఇంకో గోడ మీదకు వేస్తూ... ''చూడనా.... ఇంతకు ముందు నీళ్ళు అక్కడ పైన అంచులదాకా వుండెనా.... ఇప్పుడు చూడు కొంచం కిందకి దిగినాయి'' అన్నాడు.
''నీళ్ళు గాలికి కదులుతుంటాయి కదరా... అందుకే తడిచిన గుర్తు కాస్త పైన పడింది'' అన్నాడు ఒకడు నిరాశగా.
''లేదు... లేదు... సుబ్బన్నగాడు చెప్పింది కరెక్టే. తగ్గుతున్నాయి. ఇంతకుముందు పూర్తిగా మునిగుండె'' ఇంకొకడు సంతోషంగా అరిచాడు.
అందరిలోనూ ఆశలు చిగురించాయి.
గంటకంతా ఒకడుగు తగ్గాయి.
పూర్తిగా తగ్గకముందే పైనుంచి మళ్ళా వస్తాయేమోనని ఒకటే ఆందోళన. ఏదేమైనా ఏ మాత్రం అవకాశం దొరికినా ఆలస్యం చేయకుండా పారిపోవాలని అందరూ నిశ్చయించుకున్నారు.
అరగంటకొకసారి టార్చిలైటు వేసి చూస్తూ వున్నారు. కిటికీ కొంచం కొంచం బైట పడుతూ రెండుకల్లా మధ్య వరకు బైటపడింది. నాలుగుకల్లా కిటికీ కింది వరకు నీళ్ళు తగ్గాయి. కింద చీకటిగా వుంది. ఐదుకంతా నేల బైట పడింది. చీకటి పోయి మసకమసకగా వెలుతురు వచ్చేసింది. కిందంతా బురద బురదగా వుంది. అప్పటికే కొన్ని చోట్ల ఇళ్ళ మీద నుండి జనాలు దిగుతూ వున్నారు.
వెంకటరెడ్డి భార్యాపిల్లల్ని తీసుకొని అందరితోపాటు కిందకి దిగాడు. ఎద్దులు పొట్ట ఉబ్బి బురదలో పడివున్నాయి. వాటికేసి తల తిప్పకుండా నడవసాగాడు. కింది గేరిలోకి వస్తూ వుంటే అక్కడ నీటి మట్టం చాలా లోతుగా వుంది. ఒకరినొకరు చేయి పట్టుకొని ముందుకు కదలసాగారు. కరెంటు స్తంభాల మీద గడ్డి వేలాడుతూ వుంది. రోడ్డుకు ఇరువైపులా ఇళ్ళు చాలా వరకు పడిపోయి వున్నాయి. పిల్లల్ని భుజాల మీదకు ఎక్కించుకున్నారు. దూరంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లు మొదళ్ళ వరకూ మునిగి కనబడుతున్నాయి. నెమ్మదిగా ఒకొక్క అడుగు వేసుకుంటూ, కలసికట్టుగా రోడ్డు మీదకు చేరుకున్నారు. రోడ్డు కొంచెం పైకుండడం చేత నీళ్ళు నడుం వరకూ తగ్గాయి. ఆనీటిలో ప్రయాణం మొదలుపెట్టారు. ఎంత దూరం అని ఎవరూ ఆలోచించడంలేదు. అందరిలోనూ ఒకటే కోరిక. బతకడం కోసం దాదాపు పన్నెండు కిలోమీటర్లు నడుస్తూ నడుస్తూ నగరానికి చేరుకున్నారు. అందరూ తలా ఒక దిక్కు చీలిపోయారు. వెంకటరెడ్డి భార్యాపిల్లల్తో కర్నూల్లోకి ప్రవేశించాడు.
ఎంత ఆపుకుందామన్నా వాళ్ళకు కన్నీళ్ళు ఆగడం లేదు. ఏం చేయాలో ఎక్కడికి పోవాలో దిక్కు తోచడం లేదు. ఒంటి మీద కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ఒక్కరోజులో ఇలా రోడ్డు మీద పడతామని ఏనాడూ వూహించలేదు.
కర్నూల్లో బంధువుల ఇండ్లలో తలదాచుకోవాలనుకున్నారు. కానీ అక్కడి పరిస్థితి ఇంకా దారుణంగా వుంది. సగం కర్నూలు ఇంకా నీళ్ళలోనే వుంది. రోడ్ల మీద అసలెక్కడా మనుషుల జాడే కనబడ్డంలేదు. దాదాపు సగం జనాభా రాత్రికి రాత్రి ఏది దొరికితే అది పట్టుకొని వేరే వూర్లకు పారిపోయారు. పేదలు, చేతగానివాళ్ళు జగన్నాథగట్టుకు చేరుకున్నారు. వరదలో చిక్కుకుపోయిన కొందరు మిద్దెల మీద బిక్కుబిక్కుమంటూ కనబడుతున్నారు. రోజా, ప్రకాష్‌నగర్‌, కొత్తపేట, కండేరి, ఓల్డ్‌టౌన్‌, బండిమిట్ట, కుమ్మరిగేరి తదితర ప్రాంతాలన్నీ రెండో అంతస్తు దాకా మునిగి వున్నాయి. కర్నూలు జిల్లాకు గుండెకాయ లాంటి హోల్‌సేల్‌ వ్యాపార ప్రాంతమంతా నీటిలోనే వుంది.
వెంకటరెడ్డికి ఆ గొడవలో ఎక్కడికి పోవాలో... ఎవరింటికి పోవాలో అర్థం కాలేదు. అక్కడ ఊరు... ఇక్కడ నగరం... రెండూ శ్మశానాల మాదిరే కన్పిస్తున్నాయి.
తనకు తెలిసిన బంధువులు, స్నేహితుల్లో చాలా మంది ఇళ్ళు దెబ్బతిన్నాయి. ఏం చేయాలో అర్థంగాక ఎక్కడయినా, ఏదయినా ఇల్లు దొరికితే అద్దెకు తీసుకొని ఊరు బాగుపడ్డాక తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు.
కానీ నగరంలో ఎక్కడ చూసినా ఇళ్ళకు తాళాలేసి కనబడుతున్నాయి.
రాత్రికి రాత్రి మరలా వరద వస్తుందని, ఈసారి మొత్తం నగరమంతా మునిగిపోతుందనే భయంతో ముంపుకు గురికాని ప్రాంతాల ప్రజలు కూడా వేరే ఊర్లకు పారిపోయారు.
వాళ్ళు తిరిగి వచ్చే వరకు అద్దెకు ఇల్లు దొరకదు. దాంతో వెంకటరెడ్డి ఒక నిశ్చయానికి వచ్చి ''ఇప్పట్లో మనం ఊరికి పోయేటట్టు లేదు. ఇక్కడి పరిస్థితి గూడా ఎవరింటికీ పోయేటట్టు లేదు. కానీ తప్పదు. ఎవరికీ భారం కాకుండా అందరమూ తలా ఒక ఇంటికి పోదాం. నువ్వు మా అమ్మను తీసుకొని డోన్‌లోని మీ చిన్నమ్మ ఇంటికి వెళ్ళు. నేను పాపను, పిల్లోన్ని బీక్యాంపులోని సుబ్బారెడ్డి ఇంట్లో వదుల్తా'' అన్నాడు.
''మరి నువ్వు'' ప్రశ్నించింది సుజాత.
''మా స్నేహితుడు మద్దిలేటిలేడూ కొత్తబస్టాండ్‌ కాడ. వానింట్లో వాడొక్కడే వున్నాడంట. అక్కడుండి ఏదయినా ఇల్లు బాడుగకు దొరుకుతుందేమో చూస్తా... దొరగ్గానే అందరూ వచ్చేయండి'' అన్నాడు.
''ఏరా... వెంకటరెడ్డి ఏం ఇక్కడ కూచున్నావ్‌, ఊరంతా మునిగిందట కదా'' అనే పలకరింపుతో ఆలోచనల్లోంచి బైటకి వచ్చాడు. ఎదురుగా చిన్ననాటి స్నేహితుడు నారాయణ.
అవునంటూ తలూపుతూ ''మీ ఇల్లెక్కడ'' అన్నాడు.
''ఓల్డ్‌ బస్టాండ్‌ దగ్గర'' చెప్పాడు నారాయణ.
ఇక మాట్లాడ్డానికి, అడగడానికి ఏమీ లేదు. ఎవర్ని కదిలించినా ఒకటే బాధ. ఐనా మాటలు కూడబలుక్కుంటూ ''ఎలా వుందిరా మీ పరిస్థితి'' అన్నాడు.
''ఏముందిరా... చేతిలోని డబ్బంతా క్లీనింగ్‌లకూ, రిపేర్లకే సరిపోతా వుంది. మా యజమాని ఇల్లుండేది గూడా మిన్చిన్‌ బజార్‌లోనే. షాపూ, గోడౌను అంతా మునిగిపోయాయి. ముప్పైలక్షల దాకా నష్టం. తిరిగి షాపు తెరుస్తాడో, తెరవడో... తెరిచినా మాకంతా పని దొరుకుతుందో, దొరకదో... ఏమీ అర్థం కావడం లేదు. కొత్తగా వేరేచోట పని వెదుక్కుందామన్నా, ఇప్పట్లో ఈ నగరం కోలుకునేటట్టు లేదు. ఉపాధి అందించేటట్టూ లేదు. అందుకే ఆదోని దగ్గర మా అత్తోళ్ళున్నారు. అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నా'' అన్నాడు.
''ఊరుగాని ఊరు పోయి బతకడం కష్టం గాదా'' అన్నాడు వెంకటరెడ్డి.
నారాయణ నవ్వుతూ ''రేయ్‌... సావడానికి ఒకటే దారేమో గానీ, బతకడానికి వంద దారులుంటాయి. ఇక్కడ కాకపోతే ఇంకొకచోట, ఈ పని కాకపోతే ఇంకొక పని... ఊరికే చూసుకుంటూ, తిట్టుకుంటూ, బాధపడుతూ.... ఎన్ని రోజులని కూచుంటాం చెప్పు... చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. తప్పదు. బతకడానికి, మనల్ని నమ్మిన వాళ్ళని బ్రతికించుకోడానికి'' అన్నాడు వెళ్ళిపోతూ.
వెంకటరెడ్డికి నారాయణ మాటలే పదేపదే గుర్తుకు రాసాగాయి. ''చిన్నదో, పెద్దదో, ఎక్కువనో, తక్కువనో ముందు ఒక ఇల్లు చూసుకోవాలి. పంట పోయినా, ఎద్దులు పోయినా, ఇల్లు పోయినా, ఎంత కష్టమైనా చేయగల భార్యాపిల్లలు వున్నారు. అది చాలు... తొందరగా ఊరు చేరి పనులు మొదలు పెట్టాలి'' అనుకున్నాడు. లేచి అద్దెఇంటి కోసం వేట మొదలు పెట్టాడు.
********************************
డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212
********************************
2009 అక్టోబర్ 2 వ తేదీ కర్నూల్ జనజీవనాన్ని చిన్నాభిన్నం చేసిన వరద బీభత్సాన్ని గురించి రాసిన కథ
కామెంట్‌లు