రవి అదిరిపడి లేచి కళ్ళు తెరిచాడు. పడుకున్న మంచం అటూ ఇటూ ఉయ్యాలలాగా ఊగిపోతోంది. బయటనుంచి పెద్దగా అరుపులు కేకలు వినబడుతున్నాయి. ఇంటిలోంచి కంగారుగా బయటకు వచ్చి చుట్టూ చూశాడు. జనాలంతా తలా ఒక వైపుకు పారిపోతున్నారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోవడం లేదు. అందరి మొహాల్లోనూ ఏదో భయం. నగరమంతా గందరగోళంగా అల్లకల్లోలంగా వుంది.
ఏమైంది.. ఎందుకలా పారిపోతున్నారు అని ఒకతన్ని గట్టిగా పట్టుకొని అడిగాడు.
అతను ఆయాసపడతా ఏందీ... నీకింకా ఏమీ తెలీదా... పిచ్చోని లెక్క ఉన్నావే. మన నగరం మీదికి వింత జంతువులు దాడి చేశాయి. దొరికిన వారిని దొరికినట్టు చంపుతా ఉన్నాయి. వాటి చేతికి చిక్కితే అంతే. పద పద తొందరగా పారిపోయి ఎక్కడన్నా దాక్కో అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.
రవికి అంతా గందరగోళంగా ఉంది. దూరంగా పెద్ద పెద్ద ఆకారాలు కనపడ్డాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద కొండంత ఉన్నాయి. కొన్ని చీమ తల కాయలతో... మరికొన్ని పక్షుల తలలతో... ఇంకొన్ని జంతువుల తలలతో... భయంకరంగా ఉన్నాయి.
వాటి అడుగుల కింద పడి పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అవుతున్నాయి. మనుషులు నుజ్జు నుజ్జు అవుతున్నారు. రవి అది చూసి వణికిపోయాడు. ఇంకా అక్కడే నిలబడి వుంటే తనకు గూడా అదే గతి పడుతుంది అనుకోని వెనక్కి తిరిగి వురక సాగాడు. అవి భయంకరంగా కేకలు పెడుతా, పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటా విమానాల్లా వేగంగా దూసుకు రాసాగాయి.
రవి అలా కొంత దూరం పారిపోయాడో లేదో ఒక పెద్ద చీమ తల వున్న రాకాసి వానికి అడ్డం వచ్చింది. రవి దాన్ని చూసి వణికిపోతా పారిపోవడానికి వెనక్కి తిరిగాడు. అంతలో రాకాసి చీమ చటుక్కున రవి జుట్టు పట్టుకొని పైకి లేపింది. ఏరా నా నుంచే తప్పించుకొని పారిపోదాం అనుకుంటా ఉన్నావా ... వుండు నీ పని చెబుతా అంటూ రవి కాలు పట్టుకొని చటుక్కుమని విరిచేసింది. అంతే రవి ఆ దెబ్బకు బాధతో గట్టిగా అరిచాడు. నొప్పితో విలవిలాడసాగాడు.
వద్దు... వద్దు... నన్నేమీ చెయ్యొద్దు. నేను చిన్న పిల్లవాన్ని. చానా మంచివాన్ని. ఎవరికీ ఎప్పుడూ ఎటువంటి ఆపదా తలపెట్టలేదు. నన్నొదులు నీకు దండం పెడతా అంటూ కళ్లనీళ్లతో వేడుకుంటా గింజుకోసాగాడు.
అలాగా... నువ్వు అమాయకునివా... ఎవరికీ ఏ ఆపదా తన పెట్టలేదా. ఆహా ఏం అబద్ధాలు ఆడుతా వున్నావురా... మా జాతికి చెందిన చిన్న చిన్న చీమలు ఎక్కడ కనపడినా ఊరికే వాటిని తొక్కి తొక్కి చంపుతా వుంటావు. నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా. వాటికి ఎవరూ లేరనే కదా... ఇప్పుడు చూడు నీవు వాటినెలా చంపుతావో అలాగే నిన్ను కూడా కాలికింద వేసి నలిపి చంపుతా... ఎవడు అడ్డం పడతాడో చూద్దాం అంటూ కిందపడేసి కాలు పైకెత్తింది.
వద్దొద్దు. ఇంకెప్పుడూ చిన్న చీమలను చంపను. నన్నేమీ చెయ్యొద్దు అంటూ గట్టిగా అరిచాడు రవి.
కానీ ఆ రాకాసి చీమ రవి మాటలను కొంచెం కూడా పట్టించుకోలేదు.
కాలు అలాగే రవి మీద పెట్టి గట్టిగా నొక్కసాగింది. రవికి ఎముకలన్నీ ఎక్కడివక్కడ ఫటఫటమని విరిగి పోసాగాయి. నొప్పితో విలవిలలాడిపోతా కాపాడండి... కాపాడండి... నన్ను ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అరవసాగాడు.
అప్పుడే రవి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది.
బాధతో కేకలు పెడతా వున్న రవిని చూసింది.
వెంటనే ఉరుక్కుంటా దగ్గరికి వచ్చి రేయ్ రవీ.. లెయ్ లెయ్... నిదురలో ఏమలా కేకలు పెడతా వున్నావు. ఏమైంది. అనింది గట్టిగా కుదుపుతా.
రవి అదిరిపడి నిదుర లేచాడు.
చుట్టూ చూశాడు. ఎదురుగా అమ్మ.
భయంకరమైన జంతువులు ఏవీ లేవు.
తను తన మంచం మీదనే ఉన్నాడు. ఒళ్లంతా భయంతో చమట పట్టి తడిసిపోయింది.
అమ్మో... ఎంత భయంకరమైన కల అనుకున్నాడు.
ఏమైందిరా అడిగింది అమ్మ.
రవి తనకు వచ్చిన కలంతా వివరించాడు.
రవి వాళ్ళ అమ్మ కాసేపు ఆలోచించి మన కలలో అప్పుడప్పుడూ మనం చేసే వెధవ పనులే కనపడుతుంటాయి. నిజం చెప్పు... నువ్వు జంతువులను, పక్షులను ఏమైనా బాధ పెడతా వున్నావా అనడిగింది.
అప్పుడే అక్కడికి రవి చెల్లెలు రమ వచ్చింది.
అమ్మా... నువ్వు చెప్పింది నిజమే. అన్నయ్య బడికి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు దారిలో చీమల పుట్టలు కనపడితే చాలు ఎగిరి వాటిమీద దూకుతాడు. ఏదైనా చెట్టు మీద పక్షుల గూళ్ళు కనపడితే చాలు కట్టెతో చిందరవందర చేసి పగల కొడతాడు. రాళ్లతో పిట్టలను పావురాలను చిలకలను గురిచూసి బలంగా కొడతాడు. కుక్కలు పందులు కనపడితే చాలు రాళ్లు విసురుతాడు. అవి బాధతో మూలుగుతావుంటే ఎగురుతా సంబరపడతాడు. మా తరగతి పిల్లలందరూ మీ అన్న చానా చెడ్డ పిల్లోడు అంటూ తిడతారు. ఆ మాటలకు వాళ్ల ముందు తలెత్తుకొని తిరగ లేకుండా ఉన్నాను అని చెప్పింది.
ఆ మాటలకు అమ్మ చానా బాధపడింది.
రవిని దగ్గరికి తీసుకుని... చూడు రవీ... మన చెయ్యో కాలో విరిగితే మనం ఎంత బాధ పడతామో, వాటి చెయ్యో కాలో విరిగితే అవీ అంతే బాధ పడతాయి. చీమయినా , కుక్కయినా, పందయినా , మనిషయినా అన్నింటికీ నొప్పి ఒకటే కదా. అవి మూగ జీవులు కాబట్టి ఆ బాధను బయటకు చెప్పుకోలేవు. చిన్నచిన్న జంతువులకు చేతనైతే సాయం చేయాలి... అంతేగాని బాధ పెట్టకూడదు. నీవు వాటినలా బాధపెడతా ఉన్నందుకే నీకు ఈ రోజు ఇలాంటి కల వచ్చింది అనింది.
రవికి మరలా కల కళ్ళముందు మెదిలింది.
చీమ కాలు విరగ్గొడతా వుంటే బాధతో కేకలు పెట్టడం, గిలగిలా కొట్టుకోవడం అంతా మతికి వచ్చింది. నుదిటి మీద చిన్నగా చెమటలు పట్టాయి. సిగ్గుతో తల వంచుకున్నాడు. కళ్ళలోంచి నీళ్ళు కారాయి.
నిజమే అమ్మా... నువ్వు చెప్పింది. ఇంకెప్పుడూ ఏ చిన్న జంతువుకూ ఎటువంటి ఆపదా తల పెట్టను. కలతో నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు.
అమ్మ ఆనందంతో రవి నుదిటి మీద చిన్నగా ముద్దుపెట్టుకొంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి