*పేను.... నల్లి..... చీమల కథ (సరదా జానపద నీతి కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయన చానా పేదోడు. ఆయనకు ముగ్గురు నెమలీకల్లాంటి అందమైన ఆడపిల్లలున్నారు. వాళ్ళు ఎంతటి అందగత్తెలంటే ఆ చుట్టుపక్కల రాజ్యాలలో యాడ కూడా అంతటి అందమైన ఆడపిల్లల్లేరు. వాళ్ళ నాయన చానా పేదోడు గదా... అందుకే వాళ్ళు చిన్నప్పట్నించీ ఎండనకా, వాననకా ఒళ్ళోంచి  పొలం పనులైనా, ఇంటిపనులైనా బాగా కష్టపడి చేసేటోళ్ళు. ఒకరోజు ముగ్గురు రాజులు ఆ రాజ్యానికొచ్చి వాళ్ళ అందాన్ని చూసి "చేస్కుంటే ఇట్లాంటోళ్ళనే చేసుకోవాల" అనుకోని వాళ్ళు పేదోళ్ళైనా సరే పెండ్లి చేసుకోని వాళ్ళ రాజ్యాలకు తీసుకొని పోయినారు.
ఆ రాజులు ముగ్గురు చానా మంచోళ్ళు. పెండ్లాలను బాగా ప్రేమగా కాలు కింద పెట్టనీయకుండా చూసుకొనేటోళ్ళు. ఏదడిగినా కాదనకుండా తెచ్చిచ్చేటోళ్ళు. వాళ్ళకు సేవలు చేయటానికని పదిమంది దాసీలను పెట్టినారు. అట్లా కొన్నేళ్ళు తిరిగేసరికి వాళ్ళు బాగా తినీ తినీ సుఖం మరిగినారు. పెళ్ళైన నాటి నుండీ చిన్నపని కూడా చేసి ఎరుగరు కదా దాంతో నెమ్మదిగా వాళ్ళకు బాగా పొగరు బట్టింది.
ఒకరోజు పెద్దామెకు పొద్దుపోకుండా వుంటే సరదాగా పాలు పిండుదామని కుండ తీసుకోని బరగొడ్డు దగ్గర కూచోని పాలు పిండడం మొదలు పెట్టింది. పనిచేసే అలవాటు తప్పిపోయింది గదా... దాంతో పాలధార వచ్చి ఆమె కాలు మీద పడింది. అంతే... ఆ కాసింత దానికే ఆమె కాలు సుర్రుమనింది. అదే సమయంలో అటువేపుగా వచ్చిన ఆమె మొగుడు అది చూసి కూడా చూడనట్లుగా వెళ్ళిపోయినాడు.
దాంతో ఆమెకు తెగ కోపమొచ్చేసింది. “అరెరే... వీడేం మొగుడు. పాలధార వచ్చి నా కాలు మీద పడి నొప్పితో విలవిలలాడుతా వుంటే.... చూసి కూడా... అయ్యో! పాలధార పడి నీకాలెంత నొచ్చిందో... ఏమో... అని ఒక్క మాట కూడా అనకపాయనే. ఇట్లాంటి మొగున్తో కాపురం చేస్తేనేమి.... చెయ్యకుంటేనేమి" అని అలిగి మొగున్నొదిలేసి పుట్టింటికి బైలుదేరింది.
అదేరోజు నడిపామె దాసీలను పిలిచి “చానా రోజుల నుండి నాకు బాళ్ళపాయసం తినాలనుంది. నెయ్యి, జీడిపప్పు వేసి ఘుమఘుమలాడేలా బాగా చెయ్యండి" అనింది. సరేనని వాళ్ళు బాళ్ళపాయసం చేసి ఒక పెద్దచెంబు నిండా పోసుకోనొచ్చినారు. ఆమె ఒక్కసారిగా చెంబెత్తి పాయసం మొత్తం గటగటా తాగేసరికి గొంతు నొచ్చింది. అదే సమయంలో అటువేపుగా వచ్చిన ఆమె మొగుడు అది చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయినాడు. దాంతో ఆమెకు తెగ కోపమొచ్చేసింది. “అరెరే... వీడేం మొగుడు. చెంబుడు పాయసం కష్టపడి తాగేసరికి నా గొంతు నొప్పి పెడితే... చూసి కూడా... అయ్యో ఇంత పాయసం తాగేసరికి నీ గొంతు ఎంత
నొచ్చిందో... ఏమో... అని ఒక్కమాట గూడా అనకపాయనే. ఇట్లాంటి మొగున్తో కాపురం చేస్తేనేమి... చెయ్యకుంటే నేమి” అని అలిగి మొగున్నొదిలేసి ఆమె కూడా పుట్టింటికి బైలుదేరింది.
అదేరోజు చిన్నామె “ఎప్పుడూ దూది పరుపు మీదనే పన్నుకుంటే ఏం సుఖముంటాది... ఒక్క రోజన్నా మల్లెపూల మంచం మీద పన్నుకోని సూడాల" అనుకోని దాసీలతో గంపలు గంపలు మల్లెపూలు మంచం పైన పరిపిచ్చుకోని పండుకోనింది. ఆ మల్లెపూలు ఆమెకు గుచ్చుకోని ఆ కాసింత దానికే ఆమె నడుం
ఎర్రగా కందిపోయింది. అదే సమయంలో అటువేపుగా వచ్చిన ఆమె మొగుడు అది చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోయినాడు.
దాంతో... ఆమెకు తెగ కోపమొచ్చేసింది. “అరెరే... వీడేం మొగుడు. మల్లెపూలు గుచ్చుకోని నా నడుం కందిపోతే... చూసి కూడా... అయ్యో... మల్లెపూలు గుచ్చుకోని నీ నడుం ఎంత కందిపొయిందో... ఏమో... అని ఒక్కమాట కూడా అనకపాయనే... ఇట్లాంటి మొగున్తో కాపురం చేస్తేనేమి... చేయకుంటే నేమి” అని అలిగి ఆమె కూడా మొగున్నొదిలేసి పుట్టింటికి బైలుదేరింది.
అట్లా వాళ్ళు ముగ్గురూ మొగుళ్ళనొదిలేసి పుట్టింటికి వస్తా వస్తా దారి మధ్యలో కలుసుకున్నారు. “ఏంది నీ కత అంటే ఏంది నీ కత' అంటూ జరిగిందంతా ఒకరికొకరు చెప్పుకుని బోరుమన్నారు.
అట్లా ముగ్గురూ ఏడ్చుకుంటా... అడవిలో పోతా వుంటే దారిలో ఒక ముని కనబడి “ఏందమ్మా మీ బాధ... ఏమట్లా ఏడుస్తా వున్నారు" అనడిగినాడు.
దానికి వాళ్ళు కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతా వుంటే వెక్కి వెక్కి ఏడుస్తా “ఏం చేద్దాం సామీ! అంతా మా కర్మ. మా నాయన మంచి సంబంధాలని చెప్పి ఆ మాయదారి సచ్చినోళ్ళకిచ్చి పెండ్లి చేసినాడు. వాళ్ళ కసలు పెండ్లాలను ఎట్లా ప్రేమగా చూసుకోవాల్నో గూడా తెలీదు. అందుకే అట్లాంటోళ్ళతో కాపురం చేయలేక వదిలేసొస్తిమి" అంటూ జరిగిందంతా చెప్పినారు.
వాళ్ళు చెప్పిందంతా వినేసరికి ఆ మునికి చానా కోపమొచ్చేసింది. “ఓరినీ... ఏమో... అనుకుంటిని గానీ... మీ ముగ్గురికీ పనీపాటా లేక... బాగా ఒళ్ళు కొవ్వు పట్టినట్టుంది. అందుకే ఇంత సిన్న సిన్న దాన్లక్కూడా ఓ అని మొగుళ్ళనొదిలేసి వస్తా వున్నారు. వుండు మీ పని చెబుతా" అని పెద్దామెను పేను కమ్మని, నడిపామెని నల్లి కమ్మని, చిన్నామెను చీమ కమ్మని శపించినాడు. అంతే... ముని శాపం తగిలి పెద్దామె పేనైపోయింది. నడిపామె నల్లయిపోయింది. చిన్నామె చీమైపోయింది. ఇదీ నల్లి, పేను, చీమల కథ.
కామెంట్‌లు