తెలంగాణ సాహిత్య మాగాణిలో
విరిసిన ఉద్యమ గులాబీ కాళోజీ
విద్యార్థి దశ రగిలించిన విప్లవ స్పృహ
ఎగసిపడే ఉద్యమ కెరటం అతని కలం
అక్షరజ్యోతిగ వెల్గిన జ్ఞానజ్యోతి స్వరూపం
నిజాం నిరంకుశ గుండెల్లో అంకుశం
ఖండించెను రజాకార్ల వికృత ఉన్మాదం
తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఘనుడు
భాషకు మకుటం తొడిగి యాసకు ప్రాణం పోసి
నిరాడంబర యోగి తెలంగాణ వైతాళికుడు
పలుకుబడుల పదాలకు పీఠమేసిన వైనం
తెలంగాణ పోరు జోరు చైతన్య సమాహారం
ప్రజల గొడవ తన గొడవగా తలచిన నైజం
కోట్లాది గుండెల్లో కొలువైన ధిక్కార స్వరం
సామాన్యుడే దైవమనే విశాల హృదయం
అన్యాయం అడ్డంకి నెదురించే ఉత్తుంగ తరంగం
అసమానత సహించని మానవతా దృక్పథం
పద్మ విభూషణ్ అందుకున్న తెలుగు తేజం
అణగారిన బతుకులకండగా నిలిచిన అక్షర తపస్వి
జయహో! నీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం
ఎక్కడ అధికారం పడగలిప్పి బుసకొడుతుందో
ఎప్పుడు పెత్తనం జడలు విప్పి చిందులేస్తుందో
కారణజన్ముడు కాలానికో కాళోజీ ఉదయించాలి
కణకణ మండే అక్షర సూర్యుడిగ నిప్పులు చెరగాలి
(9 సెప్టెంబర్ కాళోజీ జయంతి శుభాకాంక్షలతో...)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి