కాలోజీ-తెలంగాణా ఖలేజా :-డాక్టర్ అడిగొప్పుల సదయ్య--జమ్మికుంట, కరీంనగర్చరవాణి: 9963991125
బక్క పలచని ఉక్కు పిండం
నిక్క పొడచెడి శంఖు కంఠం
రుధిర జ్వాలల రుద్ర నేత్రం
పిడికిలికి నిలువెత్తు సాక్ష్యం...

బడుగు జీవుల అడుగు మడుగుల
కొత్త జాడలు విత్తుటకు నొక
కలము హలముగ కైత పంటను
కూర్చి నూర్చిన కృషీవలుండు...

బాస యందలి యాసపైపడి
దాడి చేసెడి చెనటిగాళ్ళకు
పాడె కట్టియు కాటి కంపిన
తెలంగాణా నుడికి కాపరి...

నిజాం రాజుకు నివురు గప్పిన
నిప్పు కణికై నిల్చి వెలిగిన
తెలంగాణా తెగువదనముకు
చురుకు మెరుగులు దిద్దినోడు...

 *కా* లమును, *లో* కమును కలిపియు
 *జీ* తమును వడబోసి యిచ్చిన
తెలంగాణా కల్పవల్లికి
ధీర మానస పుత్ర రత్నం...



కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
కాలోజీ కాదండీ
కాళోజీ ...అని ఉండాలి.
----డా.కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ.