కృపానంద వారియార్:-- యామిజాల జగదీశ్







 కృపానంద వారియార్...మల్లయదాసర్, కనకవల్లి దంపతులకు 1906లో తమిళనాడులోని వేలూరు పరిధిలోని గాంగేయనల్లూరులో నాలుగవ సంతానంగా జన్మించారు. ఈయన కుమారస్వామి భక్తుడు.ఆయనకు తండ్రే గురువు. ఎనిమిదో ఏట కవిత్వం చెప్పి అందరినీ ఆశ్చర్యపరచిన కృపానంద వారియార్ పన్నెండో ఏట పదహారు వేల శ్లోకాలు కంఠస్థం చేసి తడబడకుండా చెప్పారు. పద్దెనిమిదో ఏట ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఈయనను వారియార్ స్వామిగళ్, అరవై నాలుగో నాయన్మార్ అని కూడా పిలిచేవారు.
శివకవి అనే సినిమాకు సాహిత్య రచన చేసిన వారియార్ ఎవరికి ఏం చెప్పాలి‌, ఎలా చెప్తే  బోధపడుతుంది అనేది అప్పటికప్పుడు అంచనా వేసి చెప్పడంలో సిద్ధహస్తులు. కథాకాలక్షేపాలలో ఆయన చెప్పే పిట్టకథలు అందరినీ ఆకట్టుకునేవి. అవి హాస్యపూరితమైనవి. అదే సమయంలో మంచిని ప్రబోధించేవిగానూ ఉండేవి. ఆదంతా ఆ దైవకృపే అనుకునేవారు. ఆయన గొంతే ఓ ప్రత్యేకం. రాయడంలోనూ తనదైన శైలిని పాటించారు. తిరుపుగళ్ అముదం (అమృతం) అనే పత్రిక కూడా నడిపారు. అయిదు వందలకుపైగా ఆధ్యాత్మిక వ్యాసాలు రాశారు. 
తాత చెప్పిన చిన్న కథలు, పాంబన్ స్వామిగళ్ జీవిత చరిత్ర తదితర పుస్తకాలు రాశారు.
శైవ సిద్ధాంతం, భక్తి మార్గం, దైవకృప వంటి వాటి గురించి గంటల కొద్దీ ప్రసంగించడంలో ఆయనకాయనే సాటి. మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ వేదికపైన ఆయన ప్రవచనాలు వినే భాగ్యం కలిగింది నాకు. సంగీతంమీదా పట్టుండటంతో తేవారం, తిరుమంత్రం, తిరుప్పుగళ్ వంటివాటిని భక్తితో రాగయుక్తంగా పలికేవారు. వాటికి అర్థాలు చెప్పే తీరు ఇట్టే ఆకట్టుకునేది. ఆయన నవ్వకుండా మనల్ని నవ్వించేలా చేసేవారు తమ ప్రసంగాలతో! 
సమయస్ఫూర్తికి పెట్టింది పేరు. ఓమారు ఆయన ఉపన్యసిస్తుంటే కొందరు లేచి వెళ్ళిపోతుండటం గమనించి తాను చెప్తున్న విషయాన్ని ఓ క్షణం ఆపి మళ్ళీ కొనసాగించారు. 
"నాకెందుకు మాటల దాత అనే బిరుదు ఎందుకిచ్చారో తెలుసా? ఆ బిరుదు నాకు ప్రదానం చేస్తున్నప్పుడు తెలీలేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది" అన్నారు.
 లేచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఆ మాటతో మళ్ళీ ఎక్కడివారక్కడ కూర్చుండిపోయారు, ఆయన ఏం చెప్తారా అనే ఆరాటంతో! 
ఆయన తన ఉపన్యాసం కొనసాగించారు "నేను మాట్లాడుతున్నాను. వాళ్ళేమో వెళ్ళిపోతున్నారే....నా పని చెప్పడం. వాళ్ళ పని వెళ్ళడం....అందుకే నాకా బిరుదు ఇచ్చారు" అన్నారు. 
1993లో ఇంగ్లండ్ వెళ్ళి తమిళనాడుకి తిరిగొస్తుండగా విమానంలోనే తుదిశ్వాస విడిచారు. 
వేలూరు జిల్లా కాట్పాడిలో ఆయనను కీర్తించేలా ఓ ఆలయం నిర్మించారు.
ఆయన ఉపన్యాసాలు ఎనబైకిపైగా సిడీలలో అందుబాటులో ఉన్నాయి. అవి ఉంటే మనసుకు హాయి. ప్రశాంతత. 
ఆయన చెప్పిన ఆణిముత్యాలలో కొన్ని....
ప్రేమను పంచండి! కృతజ్ఞత అనే చందనాన్ని చల్లండి! దయ అనే దీపాన్ని వెలిగించండి! ప్రపంచం నిన్ను మానవరూపంలో ఉన్న భగవంతుడు అని కీర్తిస్తుంది!!
మీకు కోపం వచ్చినప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. సిగ్గుతో తలదించుకుంటారు. వెంటనే కోపం ఎగిరిపోతుంది.
దాతృత్వ మార్గాన్నెప్పుడూ వీడకూడదు. 
అబద్ధాలు, కుతంత్రాలు, మోసాలతో సంపాదించే డబ్బు వచ్చినట్టే వచ్చి లేకుండా పోతుంది. 
జీవితంలో ఉన్నత శిఖరాలనేవి ఆలోచనలపై ఆధారపడి ఉంటాయి. మంచి విషయాలు మాత్రమే ఆలోచించండి. మంచి విషయాలు మాత్రమే మాట్లాడండి.
వృద్ధులు మాత్రమే పెద్దవారు కాదు. ఇతరులను నిందించకుండా, ఉదారత ఉన్నవారు కూడా మహానుభావులవుతారు. గొప్పవారవుతారు.
వ్యాపారంలో లాభనష్టాలు లెక్కించే వ్యాపారిలా, మదిలో మెదిలే వ్యాపారిలా, పరిశోధించి, భయపెట్టే మంచి - చెడు ఆలోచనలను బేరీజు వేసుకోవాలి. మనల్ని మనం సమీక్షించుకోవాలి.
మనిషికి క్రమశిక్షణ ముఖ్యం. ప్రగతికి సోపానమవుతుంది.
భార్యను తప్ప ఇతర మహిళలను తల్లులుగా భావించండి.  
సమాజంలో శాంతి నెలకొంటే ఆనందమూ ఉంటుంది. 
జీవించడానికి దేవుడు అన్నీ సమకూర్చాడు. కోరికలు, పనితనం నియంత్రించుకునే దృక్పథం ఉంటే ప్రతి ఒక్కరూ సంవృద్ధిగా జీవించగలరు.
దేవుడితో బేరసారాలు చేయకూడదు. ఇవ్వడమొకటే మన బాధ్యత.

కామెంట్‌లు