జ్ఞాపకాల పుటల్లో మా హిష్టరీ మాష్టారు:-- యామిజాల జగదీశ్





 మా రామకృష్ణా మిషన్ హై స్కూల్లో చరిత్ర పాఠాలు చెప్పిన వారు ఎం. నమశ్శివాయ పిళ్ళై (1918 – 1994) గారు. 
ఓ నెల క్రితం తెలుగు ప్రొఫెసర్ కాసల నాగభూషణం గారితో మాట్లాడినప్పుడు మాటల మధ్యలో నమశ్శివాయ పిళ్ళైగారి ప్రస్తావన వచ్చింది. ఆయన దగ్గర మంచి లైబ్రరీ ఉండేదని చెప్పడంతోపాటు వారి అబ్బాయి ఇప్పటికీ తనతో కాంటాక్టులో ఉన్నారని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. అదే రోజు నమశ్శివాయ పిళ్ళైగారి అబ్బాయి వెంకట సత్యనారాయణగారితో  ఫోన్లో మాట్లాడాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. సత్యనారాయణగారు మరెవరో కాదు, మా తమ్ముడు గణపతి క్లాస్ మేట్ అని తెలిసింది. 
మీ నాన్నగారి గురించి కొన్ని విషయాలు చెప్పమని అడిగితే సత్యనారాయణ గారు చెప్పుకొచ్చారు. అంతేకాదు,వాళ్ళ  నాన్నగారి ఫోటోలుకూడా పంపారు. ఓ ఫోటోలో నమశ్శివాయగారితోపాటు కోట సత్యరంగయ్య శాస్త్రి గారు(తెలుగు మాష్టారు), కోరాడ రామచంద్ర శాస్త్రిగారు (సైన్స్ మాష్టారు) తదితరులున్నారు. ఇది అరుదైన ఫోటో అని భావిస్తున్నాను. సత్యనారాయణగారికి ధన్యవాదాలు.
నమశ్శివాయ పిళ్ళైగారు శ్రీ రామకృష్ణా మిషన్ హైస్కూలులో 1956 – 1976 సంవత్సరాల మధ్య ఉపాధ్యాయులుగా పని చేశారు. ఆయన ఇంటి పేరు మంగాపురం.
ఆరో ఏట తండ్రిని కోల్పోయిన నమశ్శివాయ పిళ్ళైగారు ఇద్దరు అన్నయ్యల కనుసన్నల్లో పెరిగారు. ఆయన పెద్దన్నయ్య శ్రీ రామకృష్ణ పిళ్ళై. ఈయన చంద్రగిరిలోని జిల్లా పరిషత్ హైస్కూలులో డ్రాయింగ్ మాష్టారుగా పని చేసేవారు. తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నదే చంద్రగిరి. 
విజయనగర రాజుల కాలంలో చంద్రగిరికి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానముండేది. శ్రీ కృష్ణదేవరాయలవారు తమ చిన్నతనంలో చంద్రగిరి కోటలోనే పెరిగారు. పదిహేడో శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ వారు చంద్రగిరి రాజా నుంచి కొంత భూమి కొనుగోలు చేశారు. ఆ ప్రాంతమే ఆ తర్వాత మద్రాసుగా మారింది. ఇప్పుడు చెన్నై గా పిలువబడుతోంది. 
నమశ్శివాయ పిళ్ళైగారి మరొక అన్నయ్య సాంబశివపిళ్ళై. ఈయన తెలుగు పండితులుగా చిత్తూరు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పని చేశారు.
నమశ్శివాయ పిళ్ళైగారు చంద్రగిరిలో ఎస్ఎస్ఎల్సీ దాకా చదువుకున్నారు.  అనంతరం ఓ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా పని చేశారు. జీతం నామమాత్రంగా ఉండేది. ఆ సమయంలోనే ఈయనకు పోస్టల్ శాఖలో పని చేస్తున్న శేషయ్యగారు పరిచయమయ్యారు. ఆయన నుంచి హిందీ నేర్చుకున్న నమశ్శివాయ పిళ్ళైగారు ప్రవేశిక ప్యాసయ్యారు. ఆయన నేతృత్వంలోనే నమశ్శివాయగారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమ కాలంలోనే శేషయ్యగారు ఉద్యోగం కోల్పోవడమే కాక అరెస్టయి జైలుపాలయ్యారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మళ్ళీ శేషయ్యగారు ఉద్యోగంలో చేరారు.
ఈలోపు నమశ్శివాయ పిళ్ళైగారు హిందీ టీచర్ అవాలనే లక్ష్యంతో దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.  అప్పట్లో హిందీ టీచర్ కావాలంటే ఈ శిక్షణలో పాల్గొనడం తప్పనిసరి. ఈ క్రమంలోనే ఓ మిత్రుడి ద్వారా రామకృష్ణా మిషన్ పాఠశాలలో జూనియర్ హిందీ పండిట్ పోస్టుకి ఖాళీ ఉందని తెలుసుకున్న నమశ్శివాయపిళ్ళై గారు ఆ పోస్టుకోసం దరఖాస్తు పెట్టుకున్నారు. అలా ఆయన రామకృష్ణా మిషన్ హైస్కూల్లో 1956లో జూనియర్ హిందీ పండిట్ గా చేరారు.
తెలుగు సాహిత్యంపట్ల మక్కువ ఉన్న నమశ్శివాయగారికి  హిందీ, ఇంగ్లీషులలో మంచి పట్టుంది. అలాగే సంస్కృతంలోనూ పరిచయముంది. 
బిఎ ప్యాసైన తర్వాత మాష్టారుగారు ఇంగ్లీషు, చరిత్ర పాఠాలుకూడా చెప్పే అవకాశమొచ్చింది. బి.టి. సర్టిఫికెట్ కూడా పొందడంతో ఆయన జీతమూ కాస్త పెరిగింది.
నమశ్శివాయగారు తరచూ పాత పుస్తకాలమ్మే దుకాణాలకు వెళ్ళి అరుదైన, విలువైన మంచి పుస్తకాలు కొంటుండేవారు. అప్పట్లో వావిళ్ళ, ఎన్.వి.గోపాల్ వంటి సంస్థలు ప్రచురించే పుస్తకాలనుకూడా ఆయన కొనేవారు. ఇలా ఆయన దగ్గర ఓ మంచి లైబ్రరీ ఉండేది.
ఆయన ఉదయం నాలుగున్నర కల్లా నిద్ర లేచేవారు. ఆంధ్ర మహాభాగవతం, మహాభారతం, శతకాలు, గీత, వాల్మీకి రామాయణం శ్లోకాలు అవీ ఇవీ చదివేవారు. వాటిని రాగయుక్తంగా పఠించేవారు. అవి విని మేము నిద్ర లేచేవారమన్నారు సత్యనారాయణగారు. అదొక మరవలేని మధురానుభూతి అని చెప్పారు. తాను అవలీలగా చాలా శ్లోకాలు నేర్చుకున్నానన్నారు.
నమశ్శివాయగారికో మిత్రుడు ఉండేవారు. ఆయన పేరు పచ్చయ్యప్పన్. ఈయన రెవెన్యూ డిపార్ట్ మెంటులో పని చేసేవారు. ఈయన ఇంగ్లీషు, తమిళంలో దిట్ట. సెలవు రోజుల్లో మిత్రులందరూ వీరింట కలిసేవారు. వారి సందేహాలను పచ్చియప్పన్ తీర్చేవారు. ఈయన దగ్గరకూడా విలువైన పుస్తకాలు ఉండేవి.
పచ్చయప్పాస్ కాలేజీ ప్రొఫెసర్ శ్రీ సుబ్బారావుగారు కూడా మాష్టారుగారికి ఆదర్శప్రాయులు. ఆయనను తరచూ కలుస్తుండేవారు. 
మద్రాసు యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ రీడరుగా పని చేసిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డిగారిని కూడా నమశ్శివాయగారు తరచూ కలిసేవారు. ఆయన ఇల్లు కూడా వెస్ట్ మాంబల్లోనే ఉండేదట. 
అప్పుడే డాక్టర్ గంధం అప్పారావు గారు కూడా తెలుగు డిపార్ట్ మెంట్లో రీడర్ గా చేరారు. ఈయనతోనూ నమశ్శివాయగారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.
మా స్కూల్లోనే ఉపాధ్యాయులైన టీ.కె. కృష్ణమూర్తిగారు సెలవు పెట్టి పచ్చయప్పాస్ కాలేజీలోఎంఎస్సీ కెమిస్ట్రీ చదివారు. అనంతరం ఆయన వివేకానందా కాలేజీలో కెమిస్ట్రీ విభాగంలో డెమాన్ స్ట్రేటర్ గా చేరారు. ప్రొఫెసర్ వెంకట సుబ్రమణ్యన్ గారి నేతృత్వంలో పొందిన పిహెచ్.డీ. పట్టాను  నమశ్శివాయ పిళ్ళై గారింటికెళ్ళి చూపిం చారట. కృష్ణమూర్తిగారి తండ్రి కుప్పన్న శాస్త్రిగారు పండితులు. ఆయన కుప్పుస్వామి శాస్త్రి సంస్కృత విద్యాలయంలో పని చేసేవారు. ఈయన కూడా నమశ్శివాయ పిళ్ళైగారిని కలుస్తుండేవారు.
ఇక మా స్కూల్లోనే ఇంగ్లీష్ టీచర్ గా పని చేసిన అర్ధనారీశ్వరన్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఈయన ఇంగ్లీష్ మాట్లాడే తీరు ఎంతో బాగుండేదట. ఆయన తర్వాతి కాలంలో గురునానక్ కాలేజీలో ఇంగ్లీష్ శాఖలో పని చేశారు. ఇంగ్లీష్ పద ఉచ్చారణ కోసం ఆయనను ఎంతో మంది సంప్రతిం చేవారు.ఈయన కూడా నమశ్శివాయ పిళ్ళైగారికి సన్నిహితులే.
ఆరోజుల్లో మా స్కూల్లో ఎంతో మంది ఉన్న తశ్రేణి ఉపాధ్యాయులుండేవారు. వారిలో కొందరు టి.ఎస్.రంగనాథ అయ్యర్, స్వామినాథ అయ్యర్ (మా హెడ్మాష్టర్), అన్నాజీ రావు, నారాయణ అయ్యంగార్  (సైన్స్ మాష్టారు, అనేక పుస్తకాలు రాశారు), ఓ.వీ. గోపాలన్ (లెక్కల పుస్తకాల రచయిత), కోరాడ రామచంద్ర శాస్త్రి గారూ (సైన్స్ మాష్టారు).
నమశ్శివాయపిళ్ళై గారు చాలా స్ట్రిక్టుగా  ఉండేవారు. క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చేవారు. అయితే అదే సమయంలో సరదాగానూ ఉండేవారు. ఇంట్లోనూ ఆయనది ఇదే తీరు. పిల్లలను నిజాయితీగా ఉండాలనేవారు. మంచి మంచి పుస్తకాల గురించి చెప్తూ వాటిని పిల్లలతో చదివించేవారు. ఆయన పెద్ద కుమార్తె చెన్నై డిప్యూటీ కలెక్టరుగా రిటైరయ్యారు. ఒక కొడుకు సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్ స్పెక్టర్.  మరొక కొడుకు అడ్వొకేటుగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. లీగల్ డాక్యుమెంటేషన్ లో బ్యాంకులవారు ఆయనను సంప్రతిస్తుండటం గమనార్హం.  ఈ విషయాలన్నీ చెప్పిన సత్యనారాయణ గారు మద్రాస్ ఐఐటీలో ఫిజిక్స్ డిపార్టుమెంటులో ప్రొఫెసరుగా ఉన్నారు. మా తమ్ముడి క్లాస్ మేట్ జి. మార్కండేయులుకూడా ఇదే డిపార్టుమెంటులో ప్రొఫెసరుగా ఉన్నట్టు సత్యనారాయణగారు చెప్పారు. సత్యనారాయణగారు ఉద్యోగంలో చేరినప్పుడు పాఠాలు ఎలా బోధించాలి విద్యార్థులతో ఎలా ఉండాలి వంటివన్నీ నేర్పారట నమశ్శివాయపిళ్ళైగారు.
నమశ్శివాయపిళ్ళైగారు రిటైరైన తర్వాతకూడా ఆయనను చూడటానికి పూర్వ విద్యార్థులు వస్తుండేవారు. ఆయన సలహాలు అడిగేవారు. 
సివిల్ సర్వీసస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఓ పూర్వ విద్యార్థి ఆయన దగ్గరకు వచ్చి తను రాసిన వ్యాసాలను దిద్దించుకునే వాడట.
సత్యనారాయణ గారు అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో నమశ్శివాయ పిళ్ళైగారు అనేక ఇంగ్లీష్ మాటలు పంపుతూ వాటిని అమెరికన్లు ఎలా పలుకుతారో చెప్పమని అడిగి తెలుసుకునేవారట. అమెరికన్ల జీవనవిధానం, అలవాట్లు, వారి సంస్కృతి తెలుసుకునేవారు.
ఈ విధంగా నమశ్శివాయ పిళ్ళైగారు జీవితాంతమూ ఏదో ఒకటి చదువుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండేవారు. 
ఇలా ఉండగా నమశ్శివాయ పిళ్ళైగారి గురించి నా క్లాస్ మేట్ కోరాడ సూర్యనారాయణతో మాట్లాడుతుండగా నమశ్శివాయ పిళ్ళైగారి గురించి ఓ విషయం చెప్పాడు. చరిత్ర పాఠాలు చెప్పడంతోపాటు ఆయన భగవద్గీత శ్లోకాలు బోర్డు మీద రాసి వాటి భావం చెప్పడం ఇప్పటికీ గుర్తేనన్నాడు సూరి. 
మా నాన్నగారు యామిజాల పద్మనాభస్వామిగారు వచనంలో రాసిన భాగవతం పుస్తకం సంతకం చేసి నమశ్శివాయ పిళ్ళైగారికి ఇచ్చారట. ఈ విషయాన్ని సత్యనారాయణగారు చెప్పారు.
మొత్తంమీద మా హిస్టరీ మాష్టారుగారిని గుర్తు చేసుకునే అదృష్టం కలిగినందుకు ఆనందంగా ఉంది.

కామెంట్‌లు