ఎప్పటికప్పుడే...!!:-- యామిజాల జగదీశ్

 ఒకే చెట్టు పువ్వు నుంచే కాయ, పండు వస్తాయి. 
పువ్వై ఉన్నప్పుడు ఆఘ్రాణించేందుకూ, పండయ్యాక తినడానికీ వీలవుతుంది.
పండు మధురంగా ఉంటుంది.
ఈ మధురమైన రుచికి పూర్వం ఎలా ఉండేదో ఆలోచించేరా? 
పువ్వుయి ఉన్నప్పుడు చేదుగా
పిందెగా ఉన్నప్పుడు వగరుగానూ
కాయగా ఉన్నప్పుడు పుల్లగానూ
పండైనప్పుడు మధురంగానూ ఉంది.
మధురమనేది శాంతం.
శాంతముంటే అన్ని ఆశలూ ఎగిరిపోతాయి.
పండులో మాధుర్యం నిండుగా ఉన్న తర్వాత రాలిపోతుంది. 
 
అలాగే, హృదయంలో అంతటా మధురిమ ఆవరిస్తే తానుగా అన్ని ఆశలూ పోతాయి.
పులుపు ఉన్నంత వరకూ ఆశ ఉంటుంది.
అప్పుడు కాయను కోస్తే కాడలో తడి ఉంటుంది. అంటే చెట్టు కాయను వదిలించుకోవడానికి ఇష్టపడదు. కాయసైతం చెట్టునొదిలిపెట్టదు. 
కానీ కాయ పండై మాధుర్యం నిండటంతో ఆశా పోతుంది. తానుగా పండూ రాలి పోతుంది. అంటే చెట్టు పండని ఆలోచించక విడిచిపెడుతుంది. పండూ చెట్టుని విడిచిపెడుతుంది.
 
అంచెలంచెలుగా ఎదిగి మధురమైన తర్వాత ప్రతి ఒక్కరూ ఇలాగే ఆనందంగా సంసార వృక్షం నుంచి విడివడుతాడు.
పండు కావడానికి ముందు ఆరంభ దశలో పులుపు, వగరు ఎలా అవసరమవుతాయో అలాగే కామం, వేగం, తహతహ అన్నీ కావలసి ఉంటాయి.
వీటి నుంచి మనం దశలో పూర్తిగా విడివడలేం. కానీ ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? అని తరచూ కాకపోయినా అప్పుడప్పుడైనా ఆలోచించాలి.
 ఇప్పుడీ అనుభూతి కలిగిందే
ఇప్పుడీ ఆశ పుట్టిందే
గొప్పతనం వచ్చిందే
అబద్ధం వచ్చిందే
వీటివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? 
ఈ అనుభూతులన్నీ అనవసరంగా కలిగేయా?
లేక తప్పనిసరై వచ్చేయా?
అని ఆలోచించాలి. సమీక్షించుకోవాలి.
అలా అనుకోలేదంటే అవి మనల్ని మోసగిస్తాయి. మోసపోతాం.
 
పులుపు ఉండాల్సిన సమయంలో ఉండాలి. వగరు కూడా కావలసినప్పుడు ఉండాలి.
కానీ ఆయా ప్రాయాలలో ఉండవలసిన మేరకు ఉండక పిందె పెరిగి పండైనట్టు మనమూ మరింత మాధుర్యమైన ప్రేమనూ
శాంతస్వభావాన్ని ఆలోచిస్తూ వస్తే మనంతట మనమే మోక్షాన్ని అన్వేషించాలి.
ఏ ప్రాయంలో ఆ ప్రాయానికి తగ్గట్లు ఉంటే తానుగా మోక్షం అనే మాధుర్య స్థితి వచ్చేస్తుంది.

కామెంట్‌లు