మా ఊరేగాదు చుట్టపక్కల నాలుగూళ్ళకు గాజుల సాయిబ్ ఒక్కడే వుండేటోడు
తను కులానికి సాయిబే అయినా పంతుల్తో
పంచాంగం చెప్పిచ్చుకోకుంట ఏపని చేసేటోడుకాదు
నెలకోపాలి పట్నం బొయ్యి సాదాగాజులు, పూలగాజులు, కటింగ్ గాజులు, గోట్లు, కంకణాల్తో పాటు బాలనాగమ్మ గాజులు, మల్లీశ్వరి గాజులు మాయాబజార్ గాజులు, సువర్ణసుందరి గాజులంటూ కొత్త కొత్త గాజులు తెచ్చేది
మబ్బు రంగు రెక్కదుప్పటి బట్టతోటి భుజానికి రొండు దిక్కల వచ్చేటట్టు మేరోళ్ళ కాడ మలారం సంచి కుట్టిచ్చి దాన్నిండ కొత్త కొత్త గాజుల కర్రలు సర్ధిపెట్టుకొని పొద్దున్నే ఊళ్ళ మీదికి బయలుదేరేటోడు ఏ ఊల్లెకు బోయినా బజార్ బజార్ బీరుబోకుంట తిర్గెటోడు ఇంటింటికీ బొయ్యి అందర్ని వరసలుపెట్టి పిల్సుకునేటోడు రైతులు తమ ఇండ్లల్ల పండిన సకలం అతనికి పెట్టేటోళ్ళు వాళ్ళింట్లే దొంతుల్ల సమస్తం వుండేటియి పెండ్లిల్లకు బత్కమ్మ పండుగ పెత్రమాసకు మస్తు దందా జేసేటోడు ఊల్లె పెద్దకోయిల్ల రాములవారి జాతర తొమ్మిదొద్దులు జరిగేది
అన్నొద్దులు మా ఊరి గాజుల సాయిబ్ దుకాణం ఆడోళ్ళతోటి చూడ వశంగాకుంట వుండేటిది
రథ శావనాడు ఆలుమగలు గూడి ఐదు కొబ్బరికాయలు ముడుపు జెల్లిచ్చుకొనేది
ఏ ఊళ్ళే ఏ వాడకు బోయినా ఎవరో ఓ అమ్మ పిల్చి చాప పర్సిందంటే ఆ చుట్టుపక్కల పదిండ్ల ఆడోళ్ళు అతని మలారం చుట్టు సీతాకోక సిలకల్లెక్క ముసిరేటోళ్ళు
గాజులేయించుకున్న ఇల్లాలు మలారానికి మనస్పూర్తిగా మొక్కంగనే నూరేండ్లు పస్పుకుంకుమల్తోటి సల్లంగా బత్కమంటూ దీవించేటోడు
అదే పెండ్లిగాని యువతులనైతే దబ్బున పెండ్లై మంచి పెనిమిటి రావాల్నని దీవించెటోడు
చిన్నపిల్లల్ని మంచిగ సద్వు కొవ్వాల్నని దీవెనార్తు
లిచ్చెటోడు
మొత్తం మీద ఏవూరికిబోయిన అందరికి తల్లో నాల్కె లెక్క మసులు కునేటోడు, మంచికి సెడ్డకు ముందు నడ్సెటోడు
కాలం పాడుబడ అది ఎప్పుడు ఒక్కతీర్న వుండదు గద?!
బస్తీలల్ల మొదలైన ఫ్యాన్సీ దుకాణాల గాజుల దందా మెల మెల్లగ పల్లెలగ్గూడ పాకింది ఆడోళ్ళంత ఆదుకాణాలకు బొయ్యి నచ్చిన గాజులు కొనుక్కొచ్చుకొని స్వంతంగ ఏసుకొనుడు మొదలుబెట్టిండ్రు
అగో అప్పట్నుంచి మా ఊరు గాజుల సాయిబ్ బత్కుబజార్న బడ్డది కొన్నాళ్ళపాటు చిన్న చిన్న చిల్లర దందాలు ఎన్ని జేసినా పూటకు పది కంచాలు లేప లేక ఇంటి ఆడి మనిషి రందిల బడింది
ఓరోజు పట్నం కెల్లి నుంచి అన్న తమ్ముళ్ళను పిలిపిచ్చుకున్న బూబమ్మ వాళ్ళతోటి ఏం మొరబెట్టుకుందో ఏమోగాని కొన్నాళ్ళకు మాఊరి గాజుల సాయిబు కుటుంబం పట్నానికి బత్కబోయింది
పోయింది గుత్త మల్ల మా ఊరి మొకం తిరిగి చూల్లే!
గాజులమలారం ..!! >రచయిత > శీరంశెట్టి కాంతారావు >పాల్వంచ *
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి