మా ఊరికి గుట్టకు మధ్యన అయ్యోరి కుంట,చాకలి కుంటల కింద ఆయకట్టు పొలాలు దాటంగనే చిన్నపాటి కుంటంత బాయి వుండేది బాయి ఒడ్డున్నే ముత్తాలమ్మ గుడి, దానికి ఎదురుంగ ఊడల మర్రి వుండేవి అందుకేదాన్ని ముత్తాలమ్మ బాయి అనేటోళ్ళు బాయికి ఆనుకొని ఎనక దిక్కు రెండు మళ్ళు ముందు దిక్కు రెండు మళ్ళు మా అమ్మమ్మ మోళ్ళకు ఆవిడ పుట్టింటోళ్ళు ఇచ్చిన వరి మళ్ళుండేవి ముందు దిక్కు రెండు మళ్ళూ బాయి నీళ్ళ జాలుతోనే పండితే ఎనకదిక్కు మళ్ళకు అయ్యోరి కుంట నీళ్ళొచ్చేవి అవిలేని రోజుల్లో ముత్తాలమ్మబాయి మోట నీళ్ళు కొట్టి పారించేది
అసలు కతంత ఇక్కడే వుంది
బాయికి దక్షిణం దిక్కున బాయిగడ్డపొడుగునా సచ్చు నేలనంతా తవ్వి గట్టినేలమీంచి రాతికట్టంకట్టి దాని లోపల్నుంచి బాయిలోపలికి గాల్లోకిచొచ్చుకు పోయ్యేటట్టు మూడు మూడు న్నర అడుగులు పొడుగున తొళ్ళు కొట్టిన నాల్గు పలకల రాతి కనీలు పొందిచ్చి
ఆ తొళ్ళల్లో చేవదేరిన సండ్ర దిమ్మెలకు చెవులుచెక్కి వాటిల్లో మోట బిళ్ళను అమర్చేది తరువాత బాయి లోతును బట్టి ఏటవాలుగా మోటదారిగాడి తీసేది మోటబొక్కెన, మోకు, తొండం, తొండం తాడుతో సహా మోటకు కావాల్సిన సమస్తం ఊళ్ళో వుండే వడ్డెర, జింకల, వడ్ల,కమ్మరి, మాదిగ లాంటి ఎందరో వృత్తికళాకారులు మోట ఎర్పాటులో తమ సామూహిక సహకారం అందించేది
అప్పుడే ఓ రైతు నిజమైన రైతుగా మన్ను నుండి అన్నాన్ని పుట్టించి జనానికి పంచేది
కథ ఇంతటితో అవ్వలేదు బాయికింద పారుగడిలో ఎంతమంది రైతులుంటె అంతమందికి అన్ని మోటపాల్లుంటాయి ఎక్కువ పారుగడి భూమి వున్న రైతుకు రెండు మోట పాల్లు వుంటాయి అతను పొద్దు మాపు మోట గొట్టుకోవచ్చు ఇక అతని కంటె తక్కువ పారుగడి భూమి వున్న రైతులకు బయిల వుండే భాగాన్ని దారి పాలు అంటారు
ఆ దారిపాలు కంటే ఇంకా తక్కువ పారుగడి వున్న రైతు భాగాన్ని గిలక పాలు అంటారు ఒక్కబాయి మీద ఇన్ని రకాల ఇస్సాలుంటాయి
ఒక్కబాయిమీద ఎన్ని మోటలు వున్నా ఎన్ని ఇస్సాలున్నా వందల వేల ఏండ్ల నుండి వర్షబావం అధికంగా వుండే బెట్ట ప్రాంతాల రైతులు ఏ కొట్లాటలు, పంచాయతీలు లేకుండానే ఎడగారుతో కలిపి ఏడాదికి మూడు పంటలు పండిస్తూ జనానికి బుక్కెడు బువ్వ పెడుతున్నారు. భూగర్భ జలాలను నిలబెట్టుకుంటూ వచ్చారు
కాలప్రవాహంలో ఎన్నెన్ని మార్పులో చూపించడానికి మోటబాయిల్ని మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు
రైతులు వందల ఏండ్ల నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూగర్భ నీటిమట్టాన్ని
ముందుగా అయిల్ ఇంజన్ల పేరుతోను ఆ తరువాత కరెంట్ మోటార్లపేరుతోనూ రెండు దశాబ్దాల్లో పాతాళానికి తొక్కేశారు నీళ్ళు లేని మోట బాయిలు పాడుబడిన బొందలై పోయాయి నాలుగుమోటలున్న
మా ఊరి ముత్తాలమ్మబాయిని సిమెంట్ రాళ్ళతో ఉచ్చుబోసి దగ్గరికి తెచ్చారు
అసలిప్పుడు ఊళ్ళో మోటబాయిలంటేనే తెలియక క్రమంగా దుర్భిక్షానికి గురి కాబోతున్న అమాయకపు తరానికి నాప్రగాఢ సానుభూతిని, జలవనరుల ఆవశ్యకతనూ చెప్పడంతప్ప ఏమిచేయగలం ?
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి