ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సర్.. !:-సమ్మెట ఉమాదేవి

 డాక్టర్ రామ్ కిషోర్ సార్ మాకు మేము 1981 లోమంచిర్యాలలో డిగ్రీ చదువుతుండగా రాజనీతి శాస్త్రం బోధించేవారు. అప్పుడే కొత్తగా సర్వీసులోకి వచ్చినా.. అప్పటికే బోధనలో మంచి అనుభవం ఉన్న ఆ సార్ ఎంత ఓపికగా మాకు పాఠాలు చెప్పేవారు. వల్లూరిపల్లి శాంతి ప్రబోధ బీ కామ్, మా చెల్లి సమ్మెట విజయ బీ ఎస్సీ, నేను బీ ఏ  ఏక కాలంలో అదే కాలేజీలో చదువుకున్నాం. అప్పటినుండీ ఇప్పటిదాక వారు మాకు గురువుగానే కాకుండా మా కుటుంబానికి ఎంతో ఆప్తమిత్రులుకూడా. నాకు ఒక గాడ్ ఫాదర్. నాకు ఏదైనా బాధకలిగితే తానెంతో బాధపడిపోతుంటారు నా విజయాన్ని తన విజయంగా భావించి మురిసిపోతుంటారు నా ప్రతీ పుస్తకానికి వారి ఆర్థిక సహకారం ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. అంతేకాదు జీవితంలో వచ్చే కష్టసుఖాలను ఇప్పటికీ పంచుకుంటూ ఉంటాము. నిత్యం గొప్ప గొప్ప పుస్తకాలను ఎన్నింటినో చదువుతుంటారు, వీరి ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉన్నది.  
వందలాది మంది విద్యార్థులకు ఆయన ఆర్థిక సహకారం చేయడమే కాదు.  ఎంతో మందికి  నైతిక బలాన్ని ఇచ్చారు. 
మిముల్ని ఎంతో ఆశ్చర్యపరిచే ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను. చదువంటే ఈయనకు ఎంత ఆసక్తంటే..  ఇప్పటికీ నిత్య విద్యార్థిలాగా ఎక్కడైనా ఎవరైనా తరగతులను నిర్వహిస్తే తాము హాజరవుతుంటారు. ఎన్నో పాఠాలను వాయిస్ రికార్డ్ చేసినప్పటికీ, ఎన్నో గొప్ప గొప్ప  లెక్చర్స్ ఇచ్చినప్పటికీ, ఎంతోమంది పీహెచ్డీ సంపాదించడానికి వెన్నుదన్నుగా నిలిచినప్పటికీ.. ఇప్పటికీ ప్రతీ సంవత్సరం ఏదో ఒక పరీక్ష రాసి అత్యధిక మార్కులు సాధించి ఉత్తీర్ణులు అవుతుంటారు. ఇప్పటికి డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్ గారు దాదాపు 20 డిగ్రీలను పూర్తి చేశారు. ఇటీవలే కరోనా సోకి ఈ మధ్యన కోలుకుంటున్నారు. ఇప్పటికీ ఇప్పటికీ ఏదో ఓ చదవాలనే తాపత్రయం. పరీక్షలు వాయిదా పడ్డాయని, ఇంకా ఏదో చదువుకోవాల్సి ఉందని వారు అంటుంటే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. మా సర్ పరిపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రశాంత జీవితం గడుపుతూ మరెంతో మందికి సాయపడాలని మనసారా కోరుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సర్..

కామెంట్‌లు