ఆ ఊళ్ళో....:-- జగదీశ్ యామిజాల

 నా తమిళ మిత్రుడు రచయిత ఎస్. రామకృష్ణన్ స్వస్థలం తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో మల్లాన్ కినరు. ఈ ఊళ్ళోని ఓ ఆచారంతోపాటు ఆయన చెప్పిన ఓ రెండు సంఘటనలు నన్ను ఆకట్టుకున్నాయి. 
మల్లాన్ కినరులో గర్భవతి భర్త మరణిస్తే ఓ పద్ధతిని పాటిస్తారు. ఫలానా మనిషి చనిపోయిన విషయం తెలియడంతోనే ఆ ఊళ్ళోని వారు చావు ఇంటికి వెళ్తారు. అప్పుడు వచ్చిన వారందరికీ ఒక చెంబులో నీరుపోసి అందులో ఒకటో రెండో మూడో నాలుగో అయిదో ఆరో ఇలా పువ్వులుంచి చూపిస్తారు. అందరూ చూడటం అయ్యాక దానిని పక్కన పడేస్తారు. అలా ఎందుకు చేస్తారంటే చనిపోయిన మనిషి తాలూకు భార్య ఆ సమయానికి గర్భిణి అయి ఉంటే ఎన్నో నెల సూచించేదిగా చెంబులోని నీటిలో అన్ని పువ్వులు వేస్తారు. ఒకటో నెలైతే ఒక పువ్వు, రెండో నెల గర్భిణి అయితే రెండు పువ్వులు ఇలా పువ్వులు వేస్తారు. దానినిబట్టి భర్త పోయాక కొన్ని నెలలకే ఆ స్త్రీ శీశువుని కంటే ఎవరూ అపార్థాలు తీయకుండా ఉండటానికి చేసే ఏర్పాటది. 
ఈ ఊళ్ళోనే రాజామణి అనే అతను ఓళ ఫలహార శాల నడుపుతున్నాడు. అతను తన ఫలహారశాలకు పిల్లలకు ఉచితంగానే ఫలహారం పెడతాడు. పిల్లలు తినే వాటికి డబ్బులు తీసుకోడు. ఈ విషయం తెలిసి చాలా మంది పెద్దలు పిల్లలను తప్పనిసరిగా ఆ ఫలహారశాలకు తీసుకుపోతుంటారు. వాళ్ళకిలా ఉచితంగా పెట్టడంవల్ల నష్టంకాదా అని అడిగితే పిల్లలెంత తింటారండి అని నవ్వి వూరుకుంటాడు. 
అలాగే డెబ్బయ్ ఏళ్ళు పైబడిన ఓ వృద్ధ మహిళ ఇంటింటికి వెళ్ళి ఆకుకూరలు అమ్ముతుంది. ఆమె బుట్టలో కొన్ని జామపండ్లనూ ఉంచుకుంటుంది. ఏ ఇంట పిల్లలు కనిపించినా వారికి ఆ పండ్లను లేదనక ఇస్తుంది. పండ్లు లేని రోజు ఆమె ఆకుకూరలు అమ్మడానికి రాదు.
ఆ ఊళ్ళోని వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళేమీ కాదుగానీ ఇటువంటి విషయాలతో ఆ ఊరు పేరు ఇరుగు పొరుగు ప్రాంతాల వారందరినోటా నానుతుండటం సహజమేగా....!

కామెంట్‌లు