శూన్యం:- ప్రతాప్ కౌటిళ్యా

మాటల  పూల తోటల్లో
 చెవులు సీతాకోక చిలుకలై
  వాలి పోతున్నవి
 నోటికి నోటికి
 మధ్య కట్టుకున్న
 గోడలన్నీ  కూలిపోతున్న వి
 నాలుకలు నాలుగు దిక్కులా
 బంగారు  తీగల్లా
  నదుల్లో ఈదుతున్నవి
 లెక్కలేని చక్కని
 చలువరాతి మెడల్లా 
 తెల్లని పళ్ళు
 మెరిసే  అద్దాల్లో
 చిక్కుకున్న  శబ్దాలు
 శతాబ్దాల నాటి
 చెక్కుచెదరని   కోటలా
 మురిసిపోతుంది మనసు

 ముక్కలు ముక్కలుగా
 శిథిలమైన దేహ దేవాలయ
 గర్భ గుడిలో
 ఆరోగ్య విగ్రహం
 ఇంకా భద్రంగానే
  ధూప దీప నైవేద్యాలతో
 వెలిగిపోతున్నందుకు
 చీకట్లో చింతిస్తున్న
 నీడలకు వెలుగు
 ఆడపడుచులా
  ఆహ్యానిస్తూనే మంగళ హారతి ఇచ్చి
 ఆగిపోయింది ఇప్పుడే

 వెనుకటి యోధుల జడల్లా
 అల్లుకున్న ఆ  ఖడ్గాలు
 విరబూసిన వెంట్రుకల్లో
 ఒక్కొక్కటి విరిగిపోయి
 శరీరాల్లో గుచ్చుకుని
 పచ్చి రక్తం వాసనల్లో
 తలస్నానం చేసినట్లు
  ఒక్కొక్కటి   భూమిపై 
 వాలి పోతున్నవి

 చేతులకి వేళ్ళు 
 శరీరానికి
 గుళ్ళు గోపురాలు ఒకటే
 అవి ఎప్పటికీ ఒకటిగా
 కలిసి ఉంటావి
 కలిసికట్టుగా పనిచేస్తావి
 కలిసి వాటి నవి కొట్టుకుంటావి
 కాళ్లకు దండం పెట్టుకుంటావి

 నిజాలు దాచిపెట్టిన ఖజానాలు
 ఆ గుప్త నిధుల గదులెక్కడున్నావో
 అక్కడ  కాలకూట  విషం  దాగుంది
 అది తాగితే గాని నిజం బయట పడదు
 బ్రతికి బట్ట కట్టదు
 సముద్రంలో పడవల్లా
 ఆకాశంలో విమానాల్లా
 అడవుల్లో కారుచిచ్చులా
 శూన్యం  ఇప్పుడు గాల్లో
 భూమిలో కలుస్తానంటుంది
 ఇంకేమైనా ఉందా
 ఇక్కడేదో ఒక కొత్త జీవి
 ఆవిష్కరించబడినట్లు
 ఒక కొత్త జీవితం
 అంతమైనట్లుంది  మరీ!?

Pratapkoutilya, lecturer in Bio-Chem
Palem,8309529273
కామెంట్‌లు