పరిమళాలు లేని విరులు విధము
ప్రాణమున్న నపుడు పరిచర్య సల్పుము
సోమ నాఖ్యుమాట సొంపులమరు
చిదిమివేయు బ్రతుకు చిన్న తప్పిదములు
యాదిలోన వాని నదుపు చేయు
పెద్దవైన పిదప పెక్కు నష్టములోయి
సోమ నాఖ్యుమాట సొంపులమరు
తల్లిచేయు మేలు తరువు జేయు భువిలో
తనువు బలిని జేయు త్యాగమూర్తి
ప్రాణ భిక్ష పెట్టు ప్రాణదాత నిజము
సోమ నాఖ్యుమాట సొంపులమరు
తరులు తరిగిపోయె కరువులధిక మాయె
తల్లి ధాత్రి గుండె తల్లడిల్లె
పాడు చేయకోయి పర్యావరణమును
సోమ నాఖ్యుమాట సొంపులమరు
పసిడి వోలె మిన్న పల్లెకు శోభయే
చెరువు నొసగు నీరు చెలిమితోడ
గొంతు తడుపు జనుల గొప్ప జలవనరు
సోమ నాఖ్యుమాట సొంపులమరు
చూడ చక్కనిదిల చుక్కల చందము
తెలుగు భాష ఘనము వెలుగులీను
మదిని దోచు భాష మకరందము వలెను
సోమ నాఖ్యుమాట సొంపులమరు
కోటిమాటలేల? మేటియైన తెలుగు
సాటిలేని భాష నోటి తీపి
నాల్క లందు నమరు నవ్యకాంతి తెలుగు
సోమ నాఖ్యుమాట సొంపులమరు
అందమైన భాష యవనియందు తెలుగు
తేనెలూరు భాష తెగువ గలది
"దేశభాషలందు తెలుగు బహు వెలుగు
సోమ నాఖ్యుమాట సొంపులమరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి