*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౬౩ - 063)*
 *పరోపకార పద్ధతి*
తేటగీతి:
*ద్యుమణి పద్మాకరము వికచముగఁజేయుఁ*
*గుముదహర్షంబు గావించు నమృతసూతి,*
*యర్ధితుఁడు గాక జలమిచ్చు నంబుధరుఁడు;*
*సజ్జనులు గారె పరహితా చరణమతులు.*
*తా:*
ఎవరూ కోరకుండానే సూర్యుడు కొలనులలో వున్న పద్మాలను వికసించేటట్టు చేస్తాడు. అలాగే, చంద్రుడు కూడా ఎవరూ కోరకుండానే కలువలను వికసించేటట్టు చేస్తాడు. ఇంతే కాదు తనను వర్షించమని అడుగకుండానే వర్షాన్ని కురుపిస్తాడు. ఈ భూమి మీద ఎదుటి వారు అడిగినా అడుగకపోయినా ఇతరులకు మంచి చేయాలి అనే మంచి లక్షణాలు వున్నారు సహాయం చేస్తూనే వుంటారు.......... అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*సద్గురువు తనను ఒకరు అడిగినా అడుగక పోయినా సమాజానికి ఏది మంచి చేస్తుందో ఆ పని తాను చేసి ఎదుటి వారికి దారిని చూపిస్తారు. ఆ సద్గురువు చేయి పట్టుకుని చేసే ప్రయాణంలో ప్రతీ వ్యక్తి మంచి బాటలోనే వుంటాడు. నలుగురి మంచి గురించి ఆలోచిస్తాడు. మహాశివుడు ఎంత బోళాగా వుంటాడో, గురువు కూడా అంతే బోళాగా వుంటాడు. ఎందుకంటే, "శివాయ గురవే నమః" అని కదా నానుడి. అటువంటి సద్గురువు మన అందరినీ తన వద్దకు పిలుచుకుని, సన్మార్గంలో నడిపించేలా పరాత్పరుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు