*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౭౬ - 76)*
 *నారదుడు కోపముతో విష్ణుభగవానుని దూషించి శపించుట - శివమాయ నుండి విడివడి నారాయణుని పాదముల మీద పడుట - మనసును శుద్ధి చేసుకునే ఉపాయము అడుగుట - శివ మాహాత్మ్యము ను తెలుసుకొనుటకు బ్రహ్మ వద్దకు వెళ్ళమని ఆదేశించి, శివుని భజించు ఉపదోశము నొసగుట*
*శివ మాయా మోహితుడైన నారదుడు తన జ్ఞానమును అంతటినీ కోల్పోయి నారాయణుని దుర్భాషలాడుతూ, శపిస్తాడు. నారాయణుడు కూడా శివ మాయ ను కీర్తిస్తూ నారదుడు ఒసగిన శాపమును స్వీకరిస్తాడు. జరుగ వలసిన కార్యక్రమం జరిగిపోయింది. పరమశివుడు, నారదునిపై ప్రయోగించిన తన మాయను ఉపసంహరిచాడు. నారదునిపై శివమాయ ప్రభావం క్రమంగా తగ్గుతూ పూర్తిగా మాయమౌతుంది.*
*ఈ విధంగా శివ మాయ ప్రభావం తగ్గగానే నారదునికి తన పూర్వ పరిస్థితి కలుగుతుంది. తాను నారాయణునకు శాపము ఇచ్చాను అనే తప్పును నారదుడు గ్రహిస్తాడు. ఎన్నో విధాల బాధపడతాడు. తాను చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేసుకునే విధానం తెలియక ఎంతో వ్యాకులతకు లోనవుతాడు. మార్గదర్శనం చేయగలవాడు శ్రీహరి ఒక్కడే అనే స్పురణ కలిగి, ఎంతటి జ్ఞానిని అయినా మోహంలో పడవేయగలిగిన శివ మాయను ప్రస్తుతిస్తాడు. వ్యాకులతతో నిండిన మనసుతో, పరుగు పరుగున శేషశయనుని పాదాలు చేరుకుని, పరమపదమొసగే ఆ పాదలపై వాలి తనను దయతో ఉద్ధరించమని ప్రార్థన చేస్తాడు. "దేవదేవా! నేను శివుని మాయా మోహంలో ఉండటము వలన నీకు శాపము ఇచ్చాను. ఆ శాపమును వ్యర్ధము చేయుము. నేను చాలా గొప్ప పాపము చేసాను. నేను నీ దాసుడను. నాకమునకు పోవుట తథ్యము. నాచే చేయబడిన ఈ పాపపు కృత్యము వలన నేను నరకములో పడికొట్టుకు పోకుండా ఏదైనా ఉపాయము చేత రక్షచేయుము, దేవాధిదేవ! ఆపద్బాంధవా! శరణాగత వత్సలా! నీవు తప్ప వేరే దిక్కు లేదు నాకు. నేను నీకు సర్వస్య శరణాగతి చేస్తున్నాను. నన్ను రక్షించు! రక్షించు!! మహానుభావా!"*
*తనను శరణాగతి వేడుతున్న నారదుడు, ఎంతో పశ్చాత్తాప పడుతున్నాడని గ్రహిస్తాడు బ్రహ్మ తండ్రి. నారదుని కీర్తనలకు ఎంతో సంతోషించిన వాడౌతాడు. తన పాదాలపై పడిన నారదమహామునిని లేవనెత్తి, అక్కున చేర్చయకుని, ఊరడిల్ల జేసి, "నారదా! దుఖింపకు. నీవు నా భక్తలలో అగ్రగణ్యడవు. సందేహము లేదు. కానీ, నీవు నేనే గొప్ప అనే భావముతో శివుని ఉపదేశములను పెడచెవిన పెట్టి వ్యవహరించావు. అందువలన నీకు విషయం తెలియజెప్పడానికి పరమశివుడు తన మాయను నీమీద ప్రయోగించి అనుగ్రహించాడు."*
*నారదా! పరమశివుడే కర్మఫల ప్రదాత! ఆతని కోరికతోనే నీవు నాకు శాపమొసగుట జరిగినది.  అందరికీ స్వామి, శంకరుడే. గర్వమును కలిగించు వాడు, దూరము చేయువాడు, ఆ అంబా పతే! అట్టి స్వామి మాటలను నీవు అవహేళన చేసావు. ఫాలాక్షుడే పరబ్రహ్మ, పరమాత్మ! సచ్చిదానంద స్వరూపముతో ఆ పరమశివుడు ఎప్పుడూ కనబడుతూ ఉంటాడు. ఆయనే నిర్గుణుడు! నిర్వికారుడూ! తన మాయ చేత తానే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు లాగా ప్రకటితమై, బ్రహ్మ గా సృష్టించి, విష్ణువుగా పెంచి, పోషించి, మాహేశ్వరుడుగా మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. శివ స్వరూపమున, ఈ సమస్త లోకాలకు అతడే సాక్షీ భూతుడు. సర్వ కర్త! సర్వ భర్త! ఆ నాగభూషణుని ఆచార వ్యవహారాలు ఉత్తమములుగా వుంటాయి. ఆయన భక్తుల మీద అపారమైన కరుణ జూపి, దయను వర్షింప జేస్తాడు."*
*నారదమీంద్రా! సకల పాపాల నాశకరమూ, భోగ మోక్ష ప్రదాయకమూ అయిన ఉపాయం నీకు చెప్తాను, విను. నీవు, నీ మనసులో వున్న అనుమానం వీడి, శంకరుని యశస్సును కీర్తించు. ఎప్పుడూ ఆ మహాదేవుని ధ్యానం లోనే వుండి, ప్రతి నిత్యము ఆతనిని సేవించుము. ఆతని కీర్తిని విని, నిత్యమూ గానం చేయి. మనోవాక్కాయకర్మలతో భగవంతుడు అగు శంకరుని పూజించేవారు, మహాత్ములుగా, పండితులుగా, జ్ఞాని గా పిలువ బడతారు. "శివ" నామము అనే దావాగ్ని చేత అన్ని విధాలైన పాపకర్మలూ నశింప బడతాయి. బూడిద అయిపోతాయి. ఇది సత్యం! ఇదే సత్యం!! ఇందులో సంశయము గానీ సందేహము గానీ లేదు!'*
శ్లో: 
*శివేతినామదావాగ్నే ర్మహాపాతకపర్వతాః!*
*భస్మీ భవంత్యనాయాసాత్ సత్యం సత్యం న సంశయః!!*
(శి.పు.రు.సృ. 4/45)
                               
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు