*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౭౯ - 79)*
 *మహాప్రళయకాలమందు కేవలము సద్బ్రహ్మయొక్క శక్తిని ప్రతపాదించుట - నిర్గుణ నిరాకార బ్రహ్మచేత యీశ్వరమూర్తి ప్రాకట్యము - సదాశివుని ద్వారా స్వరూపభూతశక్తి ప్రాకట్యము - వీరి ద్వారా ఉత్తమక్షేత్రమైన కాశీ లేక ఆనందవనము ప్రాదుర్భావము - శివుని వామాంగము నుండి విష్ణువు ఆవిర్భావము - వర్ణన*
*తన కుమారుడు అయిన నారదముని చేసిన భక్తితో కూడిన ప్రార్థన విన్న బ్రహ్మ ఇలా చెప్పాడు --*
*"నారదా! నీవు బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడివి, దేవశిరోమణివి! నీవు ఎప్పుడూ కూడా ప్రపంచానికి మేలు ఎలా చేయాలి అని ఆలోచిస్తూ వుంటావు. ఇప్పుడు నువు శివ తత్వం గురించి, శివ పూజా విధము గురించి అడిగింది కూడా జన బాహుళ్యానికి మేలు చేకూర్చడానికే. ఈ వివరాలు వినడం వల్ల, సకల లోకాలలోని సమస్త పాపాలు కడిగివేయ బడతాయి. ఆ అనామయ శివ తత్వము గురించి నేను నీకు వివరిస్తాను."*
*"ఈ సకల చరాచర జగత్తు నశించినప్పుడు, ఎటువైపు చూచినా చిక్కని అంధకారమ. కన్ను పొడుచుకుని చూచినా ఏమీ కానరాని పరిస్థితి. సూర్య, చంద్రులు కనిపించడం లేదు. గాలి, నీరు, భూమి కనిపించడం లేదు. పకృతిలో ప్రధాన తత్వములు ఏవీ లేకుండా కేవలము ఆకాశం మాత్రము వుంది. అదృష్టము, ఆశ, శబ్దము, స్పర్శ, సువాసనలు, రూపము ఇవి ఏవీ కూడా దృష్టి కి ఆనడంలేదు. అన్ని వైపులా గాఢాంధకారము రాజ్యము చేస్తోంది. ఇటువంటి పరిస్థితులలో "తత్సద్ బ్రహ్మ" అను శృతి నుండి 'సత్" వునిపిస్తోంది. జగత్తు అంతా నశింపబడినది అనే విషయానికి గుర్తుగా ఈ "సత్" ఒక్కటే మిగిలివుంది. నిర్దిష్టమైన రూపాలుగానీ, భావాత్మక జగత్తు గానీ ఏమీ లేవు."*
*ఈ "సత్" ను యోగులు, మునులు తమ తమ మనస్సులలో ఎప్పుడూ చూస్తూ వుంటారు. ఇది మానవులు, జీవరాసుల మనసుకు అంది, అర్ధమయ్యే విషయం కాదు. మనం మాట్లాడే మాట కూడా "సత్" ను చేరుకోలేదు. ఈ "సత్" కు రంగు, రుచి, వాసన, పేరు, లేవు. ఇది పెరుగదు, తరుగదు. పొడుగా అవదు, పొట్టి అవ్వదు. ఈ "సత్" కు ఎటువంటి లక్షణాలు ఆపాదించలేము. ఎల్లప్పుడూ నిలిచివుండే శృతులు కూడా "సత్" వుంది అని మాత్రమే చెపుతున్నాయి. ఎలావుటుందో చెప్ప లేదు. శృతులకు కూడా ఈ "సత్" రూపాన్ని వర్ణించడం సాధ్యం కాలేదు. ఈ "సత్" కు మొదలు, తుది లేదు. నిర్వికారంగా, నిరాకారంగా వుండే పరంజ్యోతి స్వరూపము. ఈ "సత్" అన్నిటిలోనూ వుండి, అన్నిటికీ కారణమై వున్నది.*
*శివ ప్రాకట్యము తరువాత భాగంలో.....*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు