వాణీదేవికి వందనాలు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అతని నోటినుండి రాలే
ఆణిముత్యాలు
అద్భుతమైన కవితలుగా
ఆవిర్భవిస్తున్నాయి

అతని కలంనుండి జాలువారే
అర్ధవంతమైన పదాలు
అమోఘమైన కవితలుగా
అవతారమెత్తుతున్నాయి

అతని మనసునుండి పారే
ఆలోచనలు పరుగులుతీసి
రమ్యమైన కవితలుగా
రూపుదిద్దుకుంటున్నాయి

అతని మోమునందు చిందే
అపరూప కళాకాంతులు
విశిష్టమైన కవితలుగా
వర్ధిల్లుతున్నాయి

అతని గళంనుండి వస్తున్న
ఆలాపనలు రాగాలు
కమ్మని కవితాగానాలై
కర్ణాలకింపును కలిగిస్తున్నాయి

అతని వంటినిండా
వాణీదేవి ఆవహించుటచేత
నిత్యనూతన కవితలు
నిరాటంకంగా వెలువడుతున్నాయి

అతను
సరస్వతీపుత్రుడు
అతనుచేసేది
సాహితీసృష్టి

విరించికి
వీణాదేవికి
విరచించేకవికి
వినమ్రతావందనాలు


కామెంట్‌లు