ఆనాటి హల్వా! అబ్బబ్బా ఏం రుచి ఏం రుచీ!!;-- యామిజాల జగదీశ్
 మదురై....అనే మాట వినడంతోనే రావడంతోనే అక్కడి అమ్మవారైన మీనాక్షి గుర్తుకు రావడం సహజం. దక్షిణ తమిళనాడులోని ఓ  నగరమైన మదురైకి ఎన్నో ఎన్నెన్నో విశిష్టతలున్నాయి.  హిందూ ఆధ్యాత్మిక కేంద్రమని, వైగై నదీ తీరాన ఉన్న ఈ నగరం  ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటని, ద్రవిడ సంప్రదాయాన్ని ప్రతిబింబించే నగరమని చెప్తుంటారు.
ఇక్కడి మదురై మీనాక్షీ ఆలయం భారతీయ పుణ్యక్షేత్రాలలో ఒకటి. మదురైని, మల్లెల నగరమని, నిద్రించని నగరమనికూడా అంటారు. ప్రసిద్ధి కలిగి ఉంది. నగరానికి మదురై అన్న పేరు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నగరాన్ని మలై నగరం, మదురానగర్, తెన్ మదురాపురి, కూడల్, ముక్కూడల్, పాండ్య మానగర్, నాన్మాడక్కూడల్, తిరు ఆలవాయ్, సుందరేశపురి, మీనాక్షి నగరం అని అనేక పేర్లున్నాయి.
మదురైలో ఇటీవల ఓ నెల రోజులపైనే ఉండి నిన్ననే సాండ్రా, వాళ్ళమ్మ తిరిగొచ్చారు. తమిళులైన వీరు మేముంటున్న ఐశ్వర్య ఎంక్లేవ్లోనే నివాసముంటారు. మదురై నుంచి వస్తూ వస్తూ తీసుకొచ్చిన కుంకుమ భరిణె, హల్వా ప్యాకెట్ మాకిచ్చారు. కుంకుమ భరిణె మా ఆవిడ తీసుకోగా హల్వా నేను తీసుకున్నా. ఆ ప్యాకెట్ మీదున్న అక్షరాలు నన్ను ఆకర్షించాయి. హల్వా తయారీలో ఓ ప్రత్యేకత సంతరించుకున్న ఆ దుకాణం పేరు "ఆది కాలత్తు". ఖ్యాతి పొందిన ఆది కాలత్తు ఒరిజినల్ నెయ్యితో తయారేచేసే మిఠాయి అని ప్యాకెట్ మీది మాటలు. ఆదికాలత్తు అంటే ఆది కాలం అని అర్థం. దుకాణం పేరు ఇలా ఉందేమిటాని వాకబు చేయగా కొన్ని విషయాలు తెలిసొచ్చాయి.
ఏ మంచి విషయాన్నయినా ఊరు సొంతం చేసుకుని ఆనందిండం, గొప్పగా చెప్పుకోవడం తమిళుల సంస్కృతి. అన్ని మంచి విషయాలలో మరచిపోలేనిదొకటి తీపి. అనాదిగా ప్రతి శుభకార్యమూ ఓ తీపి పదార్థంతోనే మొదలుపెట్టడం సర్వసాధారణం. ఆ తీపి పదార్థాలలో ఒకటి హల్వా. తమిళంలో హల్వాను అల్వా అంటారు. అల్వా మాట అనగానే తమిళులకు మరొకటికూడా గుర్తుకొస్తుంది. ఎవరి దగ్గరైనా మనం మోసపోతే ఫలానా వ్యక్తి నాకు "అల్వా" ఇచ్చాడురా అనడం మామూలు. కానీ ఈ మధురపదార్థం హల్వా (అల్వా) అలా కాదు. ఇదెంతో నాణ్యమైనది. రుచికరమైంది. అంద కాలత్తు ....దుకాణంలో తయాయ్యే హల్వా మూడు నెలలైనా పాడవదు. రుచి తగ్గదు.
మదురై నగరంలో కీయ ఆవని మూల వీధిలో ఉండే "ఆది కాలత్తు ఒరిజినల్ నెయ్ మిఠాయ్ కడై" ముఖ్యంగా హల్వాకు పెట్టింది పేరు.
మదురైలో నాలుగు తరాలుగా నడుస్తున్న దుకాణమిది. ఆ దుకాణం పక్కనుంచి వెళ్తుంటే వచ్చే నెయ్యి వాసనతో ఒక్క క్షణం అక్కడ ఆగిపోవడం తథ్యం.  ఘుమఘుమలాడే నెయ్యితో తయారు చేసే స్వీట్స్ అమోఘం. ఈ ఘుమఘుమే ఈ దుకాణానికి పబ్లిసిటీ అంటే అతిశయోక్తికాదు.
చూడటానికి ఇదొక చిన్నదుకాణమే. కానీ ఈ దుకాణానికొచ్చే కస్టమర్లు అనేకం. స్వచ్ఛమైన నేతితో వండటమే ఈ దుకాణం ప్రత్యేకం.
ప్రత్యేకించి హల్వా తయారుచేయడానికి కనీసం ఆరు రోజులు పడుతుంది. తొలి రోజున గోధుమను నినబెడతారు. పాలు తీయడం, పులియబెట్టడం, ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క విధానంతో హల్వాను తయారుచేస్తారు. పెద్ద పెద్ద దుకాణాలుకూడా ఇక్కడ చేసినట్టు తయారుచేయరని వినియోగదారుల మాట.
నాలుగవ తరానికి చెందిన కి. రమేష్ సారథ్యంలో నడుస్తున్న దుకాణమిది.
ఆయన ముత్తాత, తాత, తండ్రి ఈ హల్వా తయారీతోనే మదురైలో ప్రసిద్ధులయ్యారు. వారి అడుగుజాడలోనే రమేష్ కూడా నడుస్తున్నారు. మేము తయారు చేసే హల్వాకు గ్యారంటీ మూడు నెలలని రమేష్ చెప్తుంటారు. నూటికి నూరు శాతం...తయారైన మొదటి రోజు రంగు రుచి, వాసన ఎలా ఉంటాయో మూడు నెలలైనా ఏ మాత్రం చెడకుండా అట్టానే ఉంటుందంటారు రమేష్. 
నాణ్యతే మా దుకాణానికి బలం...ఇక్కడే ఇంకో విషయం చెప్పుకోవాలి. ఎవరైనా ఆర్డరిస్తే వెంటనే "ఓకే" అని తయారుచేయరు. కారం, హల్వా ఇలా ఏదడుగుతారో అందులో రుచిచూడమని కొంచెం ఇస్తారు. అది తిని తృప్తిగా ఉందని చెప్పిన తర్వాతే వారి నుంచి ఆర్డర్ తీసుకుంటారు.  ఇలా రుచి చూపించడంకోసం రోజుకి అయిదు కిలోల తీపి తయారుచేస్తారు. 
"ఎక్కడికైనా ఓ పని మీద పోతున్నప్పుడు ఈ దుకాణంలో హల్వా కొని తీసుకుపో...నీ పని మంచిగా జరుగుతుంది" అని అనుకోవడం సహజం. హల్వాతోపాటు కారంగా కారాసేవ, తామర ఆకులో ప్యాక్ చేసిచ్చే బంగాళదుంప మసాలాకి కూడా ఈ దుకాణం ప్రసిద్ధి. 
మదురై మల్లెపూల పరిమళానికెంత పేరుందో అలానే ఇక్కడి హల్వాకు అంత పేరుండటం అతిశయోక్తికాదు.





కామెంట్‌లు