మైసూర్ వి. దురైస్వామి అయ్యంగార్;-- జగదీశ్ యామిజాల
 మైసూర్ వి. దురైస్వామి అయ్యంగారుగాప్రసిద్ధులైన మైసూర్ వేంకటేశ దురైస్వామి అయ్యంగార్ కర్ణాటక సంగీత వైణిక విద్వాంసులు. 
ఈయన కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా పరిధిలో గల కత్తావల్లి అనే గ్రామంలో  1920 ఆగస్ట్ 11వ తేదీన ఓ సంగీత కుటుంబంలో జన్మించారు. 
ఆయన తాతయ్య జనార్దన అయ్యంగార్ పురందర దాస్ తదితరుల కృతులు గానం చేసేవారు. 
ఆయన తండ్రి వేంకటేశ అయ్యంగార్ వీణ వాయించడంలో దిట్ట. కానీ పల్లడం సంజీవ రావు వేణునాదానికి ఆకర్షితులై వేణువు వాయించడం నేర్చుకుని మహారాజా నాలుగవ కృష్ణ రాజేంద్ర ఉడైయార్ ఆస్థాన సంగీత బృందంలో ఒకరుగా కొనసాగారు.
ఈ బృందానికి వీణ విద్వాంసుడు వేంకటగిరియప్ప సారథ్యం వహించారు.
దురైస్వామి అయ్యంగార్ తన ఆరో ఏట మైసూర్ సంస్థానంలో అరియకుడి రామానుజ అయ్యంగార్ కచేరీకి హాజరయ్యారు. సహజసిద్ధంగానే సంగీత జ్ఞానమున్న దురైస్వామి అయ్యంగారుని ఈ  కచేరి మంత్రముగ్ధుడ్ని చేసింది.
దసరా పండుగలప్పుడు మైసూరులో ప్రముఖ సంగీత విద్వాంసుల కచేరీలు నిర్వహిస్తుంటారు. ఈ కచేరీలకు హాజరవుతూ వచ్చిన దురైస్వామి అయ్యంగార్ సంగీతంపట్ల మరింత మక్కువ పెంచుకున్నారు.
 
చిన్నతనంలోనే వీణ వాయించడంలో ఆసక్తి చూపిన ఆయన తొలిరోజుల్లో తండ్రి దగ్గర శిక్షణ పొందారు. 
అనంతరం వేంకటగిరియప్ప దగ్గర శిష్యరికం చేసిన దురైస్వామి అయ్యంగార్ అరుదైన ఇరవై వర్ణాలతోపాటు కొన్ని కీర్తనలు, పంచరత్న కృతులను వాయించడం నేర్చుకున్నారు. అలాగే చాముండేశ్వరి అమ్మవారిపై ముత్తయ్య భాగవతార్ పాడిన పలు కీర్తనలనుకూడా వేంకటగిరియప్ప వద్ద నేర్చుకున్నారు.
తన పన్నెండో ఏట మైసూర్ టి. చౌడయ్య వయోలిన్ వాయించగా మైసూర్ మహారాజా ఆధ్వర్యంలో ఈయన కచేరీ బ్రహ్మాండంగా సాగింది. ఆయన వీణానాదానికి తన్మయులైన మహారాజా వెండి నాణాన్ని బహుమతిగా ఇచ్చారు.
ఆయన మొదటి కచేరీ బెంగళూరు గాయన సమాజంలో 1943లో జరిగింది. ఇక చెన్నైలో ఆయన తొలి కచేరీని 1944లో  రసిక రంజని సభ ఏర్పాటు చేసింది. ఈ వీణానాద కచేరీలో మదరాస్ ఎ. కణ్ణణ్ మృదంగంపై సహకరించారు.
పాలక్కాడు మణి అయ్యర్, చౌడయ్య, లాల్గుడి జయరామన్, ఎం.ఎస్. గోపాలకృష్ణన్, టి.ఎన్. కృష్ణన్ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులు ఈయన కచేరీలలో వాయిద్యసహకారం అందించారు.
ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, అంజద్ అలీ ఖాన్ తదితర ప్రముఖ సంగీత విద్వాంసులతో కలిసి ఈయన వీణ వాయించారు.
కొన్ని కన్నడ సినిమాలకు సంగీతం సమకూర్చిన ఈయన సుప్రసిద్ధ కవి పి.టి. నరసింహాచారి నాట్య నాటకాలకు కూడా సంగీతం అందించారు.
చామరాజపేటలో ఉన్న శ్రీరామ సేవా మండలి ప్రతి ఏటా నిర్వహించే రామనవమి వేడుకలలో 1947 నుంచి 1997 వరకూ ఈయన వీణకచేరి తప్పనిసరిగా ఉండేది.
సంగీత కళానిధి‌, సంగీత కళా శిఖామణి  అయిన దురైస్వామి అయ్యంగారుని భారత ప్రభుత్వం 1983లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
లెనిన్ గ్రాడ్ లో జరిగిన భారత సంగీత ఉత్సవాలలో ఈయన పాల్గొని తన వీణానాదంతో ప్రేక్షకులను అలరించారు. 
1990లో జర్మనీలో నిర్వహించిన భారత సంగీత మహోత్సవంలోనూ పాల్గొన్న ఈయన దగ్గర సి. కృష్ణమూర్తి, టి. బాలకృష్ణన్ తదితరులు శిష్యరికం చేశారు. బాలకృష్ణన్ ఈయన కుమారుడే.
హెపటైటిస్ తో కొంతకాలం బాధపడిన దురైస్వామి అయ్యంగార్ 1997 అక్టోబర్ 28వ తేదీన కాలధర్మం చెందారు.

కామెంట్‌లు