👌విషయ వాంఛల యందు
కొనసాగు "యౌవనము"
తెలిసీ తెలియని స్థితి
ఓ తెలుగు బాల!
( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.,)
👌"యౌవనము".. దేహము యొక్క దశలలో రెండవది! ఈ అవస్థలో యువతీ యువకులు.. మన్మధ జ్వరముచే పీడింప బడుదురు! అట్లే, కామము, క్రోధము, మదము.. మున్నగు వాటిచే గ్రుడ్డివారగుదురు! ఎవరినీ, దేనికీ లక్ష్య పెట్టరు!
👌"తరుణస్తావత్ విషయాసక్త:" యనెడు ఆర్యోక్తి ప్రకారం; యౌవన వంతులు.. కామాది విషయ సుఖముల యందు నిమగ్నులై యుంటారు! వారు.. స్వతంత్రము లైన ఆలోచనలు కల్గియుంటారు.
👌యౌవనమే.. జీవితకాలంలో విశేషమైన ప్రాధాన్యత కలిగియున్నది! భావి జీవితమునకు పునాది ఏర్పడుతుంది! యుక్తాయుక్త వివేకజ్ఞానంతో.. ఆత్మ నిగ్రహముతో జీవించ వలెను. ఎల్లప్పుడూ దైవభక్తితో, ధర్మ మార్గమును అనుసరింపవలెను!
⚜️ కంద పద్యము⚜️
తెలిసీ తెలియని దశయది
ఎలమిని కౌమార మద్ది యింపగు భవితన్
వెలయింపగ మూలమునౌ;
పలువిధముల గతుల నెన్ను ప్రాయ మ్మదియే!! (1)
⚜️ఉత్పల మాల⚜️
యౌవనమే మహర్దశగ నిమ్మును గూర్చును జీవితమ్మునన్
భావికి వర్తమానమున బాటలుదీర్చెడు స్థాయి యిద్దియే
కావలె నిగ్రహమ్ము సరిగాంచగ మేలది మంచి చెడ్డలన్
దైవము నమ్మి సద్గతుల ధర్మమునెన్ని చరింప మేలగున్!(2)
( రచన: డా. శాస్త్రుల రఘుపతి., )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి