భగవద్గీత;- కళ తాటికొండ
వేదాలకు  వేదమైన వేదం
ఉపనిషత్తుల ఉనికి మూలం
ఉద్గ్రందాల ఊపిరి గీతం
ఋషుల మహర్షుల ఉద్బోధ ల సారం

 జీవన భ్రాంతి తెరలు తొలగించి

జీవ సంస్కారo లోని  దురితముల సుడిగుండాలను సునాయాసంగా దాటించి 
తీరం చేర్చే
ధర్మ నౌక

ధర్మార్థ కామ మోక్ష  పురుషా ర్థములే
జీవన సూత్రములని
 వివరించి

నిష్కామo  నియత స్వధర్మ చరణం అని  నిండు సంద్రమంత నిష్కామ కర్మ ని  నీటి బిందువులుగా విప్పి చెప్పిన  నీతిశాస్త్రం

కామక్రోధాలు విలయం
సుఖదుఃఖాల వలయం దాటించి
మోక్ష మార్గమున
పయనింప చేసే
రథ సారథి 
భగవద్గీత

బంధాల బంధనాలే మరుజన్మకు మూలమని 
అజ్ఞాన నివృత్తి చేసి
ఇహ లోకపు ఇచ్చల సంకెళ్లు తెంచి 
వ్యధల వాగులు దాటించి
 పుణ్య తీరాలు చేర్చే  జ్ఞానవారధి
ఈ భగవద్గీత

మనుగడ మార్గాన ఎదురొచ్చే ఇడుముల
అడ్డంకులు అంతం చేసి
ముసిరిన మనోవ్యధ మేఘాలను హరించి
మానసిక దౌర్బల్య  తిమిరాలను తొలగించే
రాతిరి
లేని రవికిరణం

గురుపరంపరలకే
ఆది గురువు ఈ 
అద్వైత అమృత వర్షిణి

అనన్యం అసామాన్యం అనితరసాధ్యం  ఈ క్రిష్ణ గీత అందుకే
మరువద్దు మానొద్దు 
భగవద్గీత శ్రవణం పఠనం
  

కామెంట్‌లు